Kapu Politics : ఒక కర్ర పొరకను ఈజీగా విరిచివేయచ్చు. అదే కర్రల మూటను విరవడం కష్టం.. ఈ లాజిక్ ఇన్నాళ్లు మిస్ అయ్యారు కాబట్టే కాపులు రాజ్యాధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు కర్ర పొరకులు అన్నీ (వివిధ పార్టీల్లోని కాపు నేతలంతా) దగ్గరికి వచ్చి కలిస్తే వారిని ఓడించడం ఏపీలోని బలమైన పక్షాలకు కూడా కష్టం. ఇప్పుడు ఈ విషయాన్ని గ్రహించి అందరినీ ఏకం చేసే మహాక్రతువును మీద వేసుకున్నారట ఏపీ కాపునేతలు..
తక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు ఏపీని పరిపాలిస్తుంటే.. రాజకీయాలను శాసించేస్థాయిలో ఏపీ జనాభాలో ఉన్న ‘కాపులు’ మాత్రం ఇన్నాళ్లు అగ్రవర్ణాల పల్లకీ మోసే ద్వితీయ శ్రేణి నేతలుగానే మిగిలిపోయారు. అందుకే ఈ మధ్య కాపుల్లో కాస్త పునరాలోచన మొదలైంది. ఏపీలో రాజ్యాధికారమే లక్ష్యంగా వారి అడుగులు పడుతున్నాయి. ఇటీవల విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లో కాపు నేతల మీటింగ్ తో కాస్త అలజడి మొదలై చల్లబడింది. ఇప్పుడు మరోసారి రాజుకుంటోంది.

ఏపీలో అధికారమే లక్ష్యంగా ‘కాపుల వేదిక’ ఏర్పాటుకు నేతలు నడుంబిగిస్తున్నట్టు తెలిసింది. అధికారంలో చట్టబద్ధమైన వాటా సాధించేందుకు ఏపీలో ఒత్తిడి తీసుకొచ్చే ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా తమ లక్ష్యాన్ని సాధించడానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఈ డిసెంబర్ లో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగా పలువురు ప్రముఖ కాపు నేతలు ఆదివారం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించి తమ వ్యూహంపై చర్చించారు. లాబీయింగ్ ద్వారా అధికారాన్ని సాధించడమే అంతిమ లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా తమ ఓటు బ్యాంకును పదిలపరుచుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కాపు నేతలు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాపు సామాజికవర్గ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటివరకూ కాపు ఓటు బ్యాంకు చీలిపోయిందని నేతలు భావించారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో సామాజికవర్గం ప్రధాన పాత్ర పోషించగలినప్పటికీ ఐక్యత లేకపోవడంతో వారు తమ సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు.
‘కాపు నాయకులు వేర్వేరు పార్టీల్లో ఉండడం వల్ల ఓటు బ్యాంకు చీలిపోయిందన్నది నిజం. కాపు నాయకుల మధ్య ముందు ఐక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. తద్వారా తమ సామాజికవర్గ సామర్థ్యాన్ని పార్టీలకు రుచిచూపించాలని కాపు నేతలు భావిస్తున్నారు.
అన్ని పార్టీల నుంచి కాపులకు గరిష్ట సంఖ్యలో సీట్లు సాధించాలనే లక్ష్యంగా.. ప్రధానంగా ఉమ్మడి కాపుల ఫోరమ్ ను ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ ‘కాపుల వేదిక’ ఒక సమూహంగా వ్యవహరిస్తుంది.ఇందులో అన్ని పార్టీల నేతలు ఉంటారు. తద్వారా వారు తమ డిమాండ్లను నెరవేర్చడానికి అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకురావచ్చు.
అయితే వైసీపీ కి చెందిన కాపు నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం. ఇతర కాపు నేతలైన టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ, కాంగ్రెస్ నుంచి వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ రావు, ఎంవీజీకే భాను, మాజీ ఐపీఎస్ అధికారి సాంబశివ ఉన్నారు. ఇప్పటికే తొలిదశ మీటింగ్ లో జేడీ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, వంగవీటి రాధా, తోట చంద్రశేఖర్ లాంటి దిగ్గజ నేతలు పాల్గొన్నారు.
ఈ రెండు సమావేశాల అంతిమ లక్ష్యం ఏ పార్టీ అయినా కాపు సామాజికవర్గానికి గరిష్ట సంఖ్యలో సీట్లు వచ్చేలా చూడటం.. తద్వారా బలమైన కాపు వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వీరంతా ఈ స్కెచ్ గీస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.