Juice Jacking : బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో చార్జింగ్ పెడుతున్నారా? ఆర్ బీఐ హెచ్చరిక

బహిరంగ ప్రదేశాల్లో చార్జింగ్ పెడుతున్నప్పుడు USB పోర్ట్ లకు కనెక్ట్ చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. అదనంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN ఉపయోగించి, ఫోన్ లో అధునాతన సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే సైబర్ అటాకర్ల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతోంది

Written By: NARESH, Updated On : March 1, 2024 11:23 am
Follow us on

Juice Jacking : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఇది వెనుకటి రోజుల్లో.. కానీ ఇప్పటి స్మార్ట్ ఫోన్ కాలంలో శతకోటి మోసాలకు అనంత కోటి మార్గాలు.. డబ్బు సంపాదించే ఏ మార్గాన్ని కూడా మోసగాళ్లు వదులుకోవడం లేదు. పైగా చెమట చుక్క చిందించకుండా సంపాదించుకోవాలనే యావ వారిని మోసపూరితమైన దారుల వైపు మళ్ళిస్తోంది. ఇలాంటి మోసగాళ్లపై, వారు వేసే మోసపూరిత ఎత్తుగడల పై జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? ఎవరిని ఉద్దేశించి జారీ చేసింది? ఈ కథనంలో తెలుసుకుందాం.

చాలామంది ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్, బస్టాండ్, విమానాశ్రయాల్లో బహిరంగ ప్రదేశాలలో స్మార్ట్ ఫోన్లను చార్జింగ్ పెడతారు. అయితే ఇలా చార్జింగ్ పెట్టడం ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ‘మీరు వాడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు బహిరంగ ప్రదేశాల్లో చార్జింగ్ పెట్టడం వల్ల సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఇలా బహిరంగ ప్రదేశాలలో చార్జింగ్లు పెట్టి చాలామంది సమస్యల్లో చిక్కుకుంటున్నారు. వారు సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారని” రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బహిరంగ ప్రదేశాలలో చార్జింగ్ పెట్టే సాకెట్ లలో సైబర్ నేరగాళ్లు ముందుగానే ఒక చిప్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. ఇలా చార్జింగ్ పెడుతున్నప్పుడు అది మొబైల్ లో మొత్తం సమాచారాన్ని సేకరించి అందులోకి పంపిస్తుంది. దీనిని ఇంగ్లీష్ పరిభాషలో జ్యూస్ జాకింగ్ (juice Jacking) అంటారు. మన తెలుగులో చెప్పాలంటే పండ్ల రసం ముందు పెట్టి జేబులో డబ్బులు లాగినట్టు.. అలా చార్జింగ్ పెట్టగానే బ్యాంకు వివరాలతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి దర్జాగా వెళ్తాయి. ఫలితంగా వారు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డబ్బులు మొత్తం దోచేస్తుంటారు. క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది.

చార్జింగ్ కోసం చాలామంది USB పోర్ట్ లను విస్తృతంగా వాడుతుంటారు. వీటి ద్వారా డాటా కూడా బదిలీ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ను చార్జింగ్ కోసం USB పోర్ట్ కి చార్జర్ ను కనెక్ట్ చేసి, దానిని ఆన్ చేసినప్పుడు డాటా బదిలీని సూచించే పాప్ అప్ సైబర్ నేరగాళ్లకు చూపిస్తుంది. ఇలా బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ సాకెట్లలో.. ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చార్జింగ్ చేస్తే.. ఆ వివరాలు మొత్తం హ్యాకర్లకు చేరిపోతాయి. వెంటనే వారు మీ బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం తమ ఖాతాలోకి మళ్లించుకుంటారు. ఇటువంటి ఘటనలు ఇటీవల హైదరాబాద్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలలో జరిగాయి. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి రావడంతో.. ఖాతాదారులకు పై విధంగా హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో చార్జింగ్ పెట్టకపోవడం మంచిదని సూచిస్తోంది.

బహిరంగ ప్రదేశాల్లో చార్జింగ్ పెడుతున్నప్పుడు USB పోర్ట్ లకు కనెక్ట్ చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. అదనంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN ఉపయోగించి, ఫోన్ లో అధునాతన సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే సైబర్ అటాకర్ల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతోంది. ఇలా బహిరంగ ప్రదేశంలో చార్జింగ్ పెట్టి రాజస్థాన్ కు చెందిన ఓ ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల కు చిక్కింది. ఆ ఫోన్లో ఆమె వ్యక్తిగత వివరాలతో పాటు వివిధ రకాల వీడియోలు ఉన్నాయి. అందులో ఆమె భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అవన్నీ హ్యాకర్ల చేతికి చిక్కాయి. దీంతో వారు ఆమెను బ్లాక్ మెయిలింగ్ చేశారు. తమకు 5 లక్షలు ఇవ్వకపోతే వాటన్నిటిని ఇంటర్నెట్లో పెడతామని హెచ్చరించారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తమకున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ మోసగాళ్ళను పట్టుకున్నారు.