5G Charges : భారత టెలికాం దిగ్గజ సంస్థలు అయిన జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఉచిత 5జీ అన్‌లిమిటెడ్ సేవలు నిలిపివేశాయి. త్వరలో చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది.
ఏడాది తర్వాత…
దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది గడిచింది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు మాత్రమే అత్యాధునిక సాంకేతికతతో కూడిన సేవల్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం 5జీ మొబైల్ ఉన్న వారికి 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫ్రీగా డేటా అందిస్తున్నాయి. మొదట ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, క్రమంగా అంతటికీ విస్తరించాయి. ఈ క్రమంలో 5జీ డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి విధించలేదు. వినియోగదారులు ఫ్రీగా, అన్‌లిమిటెడ్ డేటా వాడుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ఫ్రీ డేటా సేవలు నిలిపివేయాలని రెండు టెలికాం కంపెనీలు నిర్ణయిచాయి.
ఇకపై చార్జీలు..
త్వరలో ఫ్రీ 5జీ డేటాకు స్వస్తి పలకాలని నిర్ణయించిన జియో, ఎయిర్‌టెల్ సంస్థలు.. ఇకపై చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నాయి. ఈఏడాది జూన్ లేదా, జూలై నుంచి చార్జీలు వసూలు చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం రెండు టెలికాం కంపెనీలు 4జీ ప్లాన్స్ ధరలకే 5జీ సేవలు ఆఫర్ చేస్తున్నాయి. జూలై నుంచి 5జీ సేవలకు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తాయని తెలుస్తోంది. ఇన్ని రోజులు ఉచితంగా అందించిన 5జీ సేవల చార్జీలను కూడా ఇకపై వసూలు చేయాలని టెలికాం సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. 20 శాతం టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.