Jayasudha ABN RK: హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఏ ఇండస్ట్రీలో 50 సినీ కెరీర్ లో ఉన్నవారు ఎవరూ లేరు. అంతటి గొప్ప అదృష్టం మన తెలుగు నటి జయసుధకు వచ్చింది.ఆమె హీరోయిన్ గా పరిచయమై.. నటిగా ఇప్పటిదాకా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే జయసుధకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. 50 ఏళ్లు కనుక హాలీవుడ్ లో చేసి ఉంటే ఇంటికి బోకెలు, సన్మానాలు చేసేవారని.. కానీ ఇక్కడ తెలుగులో పట్టించుకున్న వారు లేరని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న జయసుధకు ఆర్కే అభినందనలు తెలిపారు. కానీ ఇక్కడి ఇండస్ట్రీ మాత్రం తనను పట్టించుకోవడం లేదని.. ఇన్ని సినిమాలు తీసినా కనీసం పద్మశ్రీ దక్కలేదని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన జయసుధ.. హీరోయిన్ గా ఎదిగి.. ఇప్పటికీ తిరుగులేని నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నటిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ మాత్రం ఇన్ని సంవత్సరాలు నటించినా జయసుధకు పద్మశ్రీ ఇవ్వలేదు. అదే కొన్ని సినిమాలు.. అవి అరకొరగా హిట్ లు ఇచ్చినా.. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న కంగనా రనౌత్ కు ‘పద్మశ్రీ ’ ఇచ్చారని ఆర్కే, జయసుధ చర్చించుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ చేసినా.. ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇన్ని సంవతసరాలు నన్ను ఉండనిచ్చేవారు కాదని.. ఎప్పుడో పంపించేవారని జయసుధ తెలిపారు. ముంబై నుంచి వస్తే నెత్తిన పెట్టుకుంటారని.. వారి కుక్క పిల్లలకు కూడా రూమ్స్ ఇస్తున్నారని జయసుధ ఆవేదన చెందారు. ఇక్కడి నటులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని వాపోయారు.
ఇక డామినేషన్ అనేది ఇక్కడి పెద్ద హీరోలలో పెద్దగా ఉండదని.. కానీ వారి పక్కన ఉండేవారితోనే సమస్య అని జయసుధ తన అనుభవాలు పంచుకున్నారు. మా ఎన్నికల గోల పడలేకనే అమెరికా వెళ్లానని.. అయిపోయేవరకూ రాలేదని ఆ ఎన్నికల గురించి చెబితే నా 50 ఏళ్ల సినీకెరీర్ అంత ఉంటుందని ఏవగించుకున్నారు.
తాను సినిమాల్లో నటిస్తున్నప్పుడే శోభన్ బాబు గారిలా డబ్బులు నిల్వచేసుకోవడం నేర్చుకోలేకపోయానని.. ఆయన ఎన్నో సార్లు స్థలం చూపించి కొనుక్కోమని చెప్పినా వినలేదని జయసుధ వాపోయారు. సావిత్రిలా తాను కూడా సినిమాల్లో సంపాదించి పోగొట్టుకున్నానని జయసుధ ఆవేదన చెందారు.
మొత్తంగా జయసుధ ఇన్నేళ్ల సినీ జీవితంలో తనను ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షో ఎపిసోడ్ ప్రసారమయ్యాక అయినా ఆమెకు గౌరవం ఇస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.
[…] […]