Pawan Kalyan: ‘కష్టాల్లో ఉన్న వాళ్లంతా నా సొంతవాళ్లే.. నేనెవరికి దత్తతగా వెళ్లను. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరు’ అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐకి దత్తపుడ్రుడు అనే మాటను ఫిక్స్ అవుతా.. చంచల్ గూడలో షటిల్ ఆడే మీరు నాకు చెబుతున్నారా? అంటూ ఏపీ సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ కడిగిపారేశారు.

ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కౌలురైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. వారికి అండగా ఉండేందుకే చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నానని పవన్ తెలిపారు. ఇప్పటివరూ 3వేల కు పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారందరికీ సహాయం చేస్తానని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఉద్వేగంతో కూడిన ఆవేదన భరిత ప్రసంగం చేశారు.
తాను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునే వాడిని అని.. ఒకే సారి అందలం ఎక్కాలనుకునే మనిషిని కాదనిపవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అంటే తనకు ద్వేషం లేదని.. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు.
ఇక జనసైనికులపై చేయిపడితే ఊరుకునే లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జనసైనికుల మీద పోలీసులు.. వైసీపీ గుండాలతో దాడి చేయించారని.. వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నానని.. నేను ఎంత మేర సహనం పాటిస్తానో నాకు తెలుసు అని..ఇక అవడం లేదనుకుంటే మాత్రం అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తనకు తెలుసు అంటూ వైసీపీకి హెచ్చరికలు పంపారు. జనసైనికులపై చేయి పడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసుకుంటూ పోతానని.. లేకున్నా ప్రజలకు దాసుడిగానే ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
