Pawan Kalyan Varahi Yatra : ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త రాష్ట్రం చేయడమే లక్ష్యంగా కాకినాడ జిల్లా అన్నవరం నుంచి వారాహీ రథయాత్రకు శ్రీకారం చుట్టారు జనసేన అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్. జగన్‌ను గద్దె దించడంతోపాటు ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలన్నదే జనసేనాని లక్ష్యం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్న పవన్.. రథయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. పది రోజులపాటు రెండు ఉమ్మడి జిల్లాలు, 20 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా చేపట్టిన యాత్ర తొలిరోజు గ్రాండ్ సక్సెస్ అయింది. కత్తిపూడి వద్ద నిర్వహించిన తొలి సభకు భారీగా జనం తరలివచ్చారు.
ఎవడు అడ్డుకుంటాడో చూస్తా..
కత్తిపూడి సభలో పవన్ పంచ్ డైలాగులతో అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ వేయించారని తెలిపారు. కానీ ఈసారి అలా జరుగదన్నారు. పక్కా ఎమ్మెల్యే అవుతానని గర్జించారు. ఎవడు అడ్డుకుంటాడో చూస్తానని తనదైన శైలిలో అధికార పార్టీపై వాక్‌బాణాలు సంధించారు.
సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా..
ఇక వచ్చే ఎన్నికల్లో తనకు సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. అయితే సీఎం ఇచ్చేది ఎవరు అన్నది మాత్రం ఆయన చెప్పకపోవడమే పవన్ మార్క్ పాలిటిక్స్ అనుకోవాలి. నాకు పదవులు ముఖ్యం కాదు అని ఇటీవల దాకా పవన్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చబోమని కూడా స్పష్టం చేశారు.
రథంపై మారిన పవన్ టోన్..
వారాహి రథం ఎక్కిన తర్వాత పవన్ టోన్ కొంత మారినట్లు కనిపిస్తోంది. కత్తిపూడి జంక్షన్లో అశేషంగా వచ్చిన జనవాహిని చూసిన పవన్ తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు. విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో అంటూ సస్పెన్స్‌లో పెట్టారు. పొత్తుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ టీడీపీని అలెర్ట్ చేసేలా స్టేట్మెంట్ ఇచ్చారు. సీఎం పదవి ఇస్తే చాలా సంతోషంగా తీసుకుంటాను అన్న డైలాగ్ పొత్తు ధర్మంలో అధికార వాటాగానా లేక విడిగా పోటీ చేసి జనం మద్దతుతో అందుకునే విధానమా అన్నది చెప్పలేదు.
పొత్తలు ఉన్నాయంటూనే..
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనమయమంటున్న పవన్ పొత్తులు ఇంకా ఖరారు కాలేదంటున్నారు. సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొత్తులు ఉంటాయని ఒకవైపు సంకేతం ఇస్తూనే మరోవైపు పొత్తులు ఖరారు కాలేదని తెలిపారు. సీఎం పదవి ఎవరో ఇవ్వాలి అన్నట్లు మాట్లాడుతూన్నారు. పరోక్షంగా పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్న సంకేతం ఇచ్చినట్లు అర్థమవుతోంది.
టీడీపీని అలర్ట్ చేసేందుకే..
కానీ పవన్ నోట మాత్రం విడిగా అంటూ రావడం ఏపీలో రాజకీయంలో కొత్త వేడిని తెచ్చేదే అంటున్నారు. నిన్నటిదాకా ఓట్లు చీలనివ్వను అంటూ సాగిన పవన్ స్పీచ్ ఇపుడు కాస్తా మారింది అని అంటున్నారు. లేకపోతే విడిగా అన్న మాట కేవలం టీడీపీని అలర్ట్ చేయడం కోసమే వాడినట్లు తెలుస్తోంది. సొంతంగా అధికారంలోకి రాకపోయినా.. కింగ్ మేకర్ కావడాడనిక వారాహి యాత్ర షురూ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు అధికార పక్షాన్ని అదిలిస్తూ ఇటు టీడీపీకి తన బలం చూపేందుకే ప్రజాక్షేత్రంలోకి వచ్చారని అంటున్నారు. ఈ విషయంలో పవన్‌కు క్లారిటీ ఉందని పేర్కొంటున్నారు. ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతా అనడం ద్వారా ప్రస్తుతానికి తన లక్ష్యం ఎమ్మెల్యేగా గెలవడమే అంటున్నారు. అందుకే సీఎం అయితే సంతోషిస్తా అని ప్రకటించారని చెబుతున్నారు.
రెండువైపులా పదునున్న యాత్ర..
ఇక వారాహి యాత్ర రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు వైసీపీ ఓటమే తన లక్ష్యమని క్లారిటీ ఇవ్వడం, వచ్చే ఎన్నికల్లో ఓడించడం, రెండోది టీడీపీకి తన బలం ఏమిటో చూపి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు రాబట్టుకోవడం అని అంచనా వేస్తున్నారు. పొత్తు కుదురుతుందా.. ఒంటరిగా వెళ్తారా అన్నది విషయంలో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.