CM Jagan: విధేయత అన్న మాట రాజకీయాల్లో తరచూ వినిపిస్తోంది. ఈ పదమే కొందరికి రాజకీయ అవకాశాలను తెచ్చిపెడుతుంది. విధేయత చూపని నేతలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని అధినేతలు చూస్తుంటారు. అయితే విధేయతకు పెద్దపీట వేయడం అన్నివేళలా కుదరదు. ఏపీలో వైసీపీ ఆవిర్భావం నుంచి సేవలందించి విధేయత చూపిన చాలా మంది నాయకులు తెరమరుగయ్యారు. ఇప్పటి రాజకీయానికి కావాల్సింది విధేయత కాదు.. చతురత అన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ అవసరాలు తప్ప మరిదేనికీ అంత ప్రాధాన్యత లేదు. అయితే ఇప్పుడు ఏపీలో బీసీ కార్పొరేషన్లకు సంబంధించి కార్యవర్గాల పొడిగింపు వెనుక విధేయతను సాకుగా చూపుతున్నారు. కానీ అవే పదవులు ఆశించి ఎదురుచూస్తున్న వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే విధేయతకు గౌరవిస్తూనే.. ధిక్కార స్వరాలకు షాకిస్తున్నారన్న మాట.

ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉంది. ప్రజా వ్యతిరేకత చూస్తుంటే పతాక స్థాయిలో ఉంది. జగన్ సర్కారును వణికిస్తోంది. ఇటువంటి సమయంలో నాయకత్వంపై ఎమ్మెల్యేలు ధిక్కార స్వరంతో మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల్లో విభేదాలు భగ్గమంటున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అసంతృప్తి కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిని ఆదిలోనే అడ్డుకట్ట వేయాలంటే ఒక బలమైన ఘటనను సాకుగా చూపాలి. అందులో భాగమే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యామ్నాయంగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిని తేవడం. సొంత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే హైకమాండ్ స్పందించింది, అక్కడ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రామ్ కుమార్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించి అధికారులు, పార్టీ శ్రేణులను ఆయనకే ఫాలో అవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంటే ఎదురుతిరిగితే షాక్ ఇస్తామన్న సంకేతాలను పంపింది.

అదే సమయంలో బీసీ కార్పొరేషన్ల పదవీ కాలాన్ని ఎన్నికల వరకూ పొడిగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల కిందట 55 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులను నియమించారు. వారి పదవీకాలం డిసెంబరు 16తో ముగిసింది. కానీ కొత్త వారిని నియమిస్తే అసంతృప్తి జ్వాలలు ఎగసినడే అవకాశమున్నందున పాతవారినే కొనసాగించారు. విధేయతకు మరోసారి పట్టం కట్టినట్టు చూపే ప్రయత్నం చేశారు. వాస్తవానికి గత రెండేళ్లలో పేరుకే కార్పొరేషన్లు తప్పించి విధులు, నిధులు లేవు. కేవలం నవరత్నాల్లో భాగంగా ఇచ్చే పథకాల నిధులనే లెక్కలు కట్టి కార్పొరేషన్ ప్రగతిగా చెప్పుకొచ్చారు. కనీసం వీరికి కార్యాలయాలు లేవు. కానీ పేరు పక్కనే పదవి. ఆ పై నెలసరి వేతనంతో మనసును సంతృప్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కానీ వారిని పదవిని తప్పించి వేరేవారికి ఇస్తే మాత్రం అది పార్టీలో విభేదాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. అందుకే జగన్ సర్కారు తెలివిగా విదేయత అన్నమాటను తెరపైకి తెచ్చి రెండోసారి పదవులను రెన్యూవల్ చేసింది.