CM Jagan Delhi Tour : ఏపీ రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్నా.. బిజెపి స్నేహాన్ని కోరుకోవడంలో మాత్రం అన్ని పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. బిజెపితో కలిసి నడుస్తుంది ఒకరు.. కలవాలనుకున్నది మరొకరు.. తెర వెనుక స్నేహ హస్తం అందిస్తున్నది ఇంకొకరు. అయితే ఈ ముగ్గురిలో బిజెపికి అసలు స్నేహితుడు ఎవరో తెలియడం లేదు. అసలు బిజెపి మనసులో ఏముందో బయటపడడం లేదు. ఇప్పట్లో బయటపెట్టే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది. ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ ఈనెల 6న ఢిల్లీ వెళ్తుండడం విశేషం.
చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ ఢిల్లీ వెళుతుండడం ఇదే తొలిసారి. జగన్ లండన్ పర్యటనలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులు సిఐడి చంద్రబాబును నంద్యాలలో అదుపులోకి తీసుకుంది. అప్పటినుంచి కోర్టు విచారణలు, రిమాండ్ కొనసాగుతోంది. అయితే చంద్రబాబు అరెస్టు వెనుక జగన్కు కేంద్ర పెద్దలు సహకరిస్తున్నారన్నది ఒక అనుమానం. కేంద్ర పెద్దల అనుమతి తీసుకోనిదే జగన్ ఇంతటి సాహస చర్యకు దిగరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ బలమైన అభిప్రాయం అటు తెలుగుదేశం పార్టీలో సైతం ఉంది. వామపక్షాల నాయకులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ వెళ్లనుండడం చర్చనీయాంశంగా మారింది.
జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావలసిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బిజెపికి మిత్రపక్షమైన జనసేన.. మాట మాత్రం గానైనా చెప్పకుండా టిడిపికి స్నేహస్తం అందించింది. మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పిన పవన్… ఇప్పుడు మాట మార్చారు. వచ్చేది జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వం అని పేరు చేశారు. బిజెపితో వెళితే ఓట్లు పెరుగుతాయి కానీ.. సీట్లు పెరిగే అవకాశం లేదని పవన్ తేల్చి చెప్పారు. దాదాపు బిజెపితో కటీఫ్ దిశగా పవన్ ప్రసంగాలు ఉండడం విశేషం.
అయితే దీనిపై బిజెపి నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను వదులుకుంటే మొదటికే మోసం వస్తుందని ఏపీలోని కొంతమంది బిజెపి నాయకులు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే రాజకీయంగా వైసిపి తో కొన్ని రకాల అవసరాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించడానికి వైసిపి ఎంపీలు అవసరం. అందుకే బిజెపి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు జగన్ సర్కార్కు అన్ని విధాల సాయం అందిస్తోంది. అప్పుల పరిమితికి దాటినా పట్టించుకోవడం లేదు. దీంతో బీజేపీపై అందరూ అనుమానపు చూపులు చూస్తున్నారు. చంద్రబాబు ఈ స్థితికి అగ్రనేతలే కారణమని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం హాట్ టాపిక్ గా మారింది.