CM Revanth Reddy: ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతోంది. రేవంత్ రెడ్డి కూడా దూకుడుగానే ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదా అని కాకుండా.. ఒక సగటు రాజకీయ నాయకుడు లాగా విలేకరులు అడిగే అన్ని ప్రశ్నలకు చాలా స్వేచ్ఛగా సమాధానం చెబుతున్నాడు. వారి మీదకు ఉల్టా ప్రశ్నలు వేయకుండా ఒక మనుషుల్లాగా గౌరవిస్తున్నాడు..గుడ్ ఇదే తెలంగాణకు కావాల్సింది. సచివాలయంలోకి ప్రవేశమే లేని దుర్భేద్య వ్యవస్థలో.. ఏకంగా ఒక ముఖ్యమంత్రి మీడియా మీట్ ఏ ఆంక్షలు లేకుండా జరిగిందంటే మామూలు విషయం కాదు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం మీడియా సర్కిల్లో, అటు పొలిటికల్ సర్కిల్లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. భలే దెబ్బ కొట్టారు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటయ్యా అదంటే.. నమస్తే తెలంగాణకు అంటే భారత రాష్ట్ర సమితి భజన పత్రికకు సర్కార్ యాడ్స్ నిలుపుదల గురించి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం ముందు రోజు అన్ని పత్రికలకు జాకెట్ యాడ్స్ ఇచ్చాడు. అందులో నమస్తే తెలంగాణ కూడా ఉంది.. నమస్తే తెలంగాణ ఓనర్లకు రేవంత్ అంటే గిట్టదు. పైగా అతని మీద కోట్ల లీటర్ల కొద్దీ బురద పోసింది ఆ గులాబీ కర పత్రం! నేను పోస్తాను. నువ్వు కడుక్కో అన్నట్టుగా వ్యవహరించింది. పాపమ్ ఎల్లకాలం తన ఓనరే అధికారంలో ఉంటాడు అనుకుంది. కానీ రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా. జనం గుద్ధుడు గుద్దితే కారు దెబ్బకి షెడ్ కు వెళ్ళిపోయింది.. అయితే తన ప్రమాణ స్వీకారం సందర్భంగా రేవంత్ రెడ్డి నమస్తే తెలంగాణ కు కూడా యాడ్ ఇస్తే… పాత పగను మర్చిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రజా పాలన కార్యక్రమం ముందు నమస్తే తెలంగాణపై యుద్ధమే ప్రకటించాడు.
తన ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి అన్ని పేపర్లకు జాకెట్ యాడ్స్ ఇచ్చిన ప్రభుత్వం.. నమస్తే తెలంగాణకు మాత్రం కోత విధించింది.. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ప్రకటనలు కూడా ఆ పత్రిక తో పాటు తెలంగాణ టుడే, టీ న్యూస్ కు ఇవ్వద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే అందరికీ ఇచ్చినప్పుడు వీటికే ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్న రావడం సహజం. కానీ రాజకీయ సమీకరణాలు చాలా వేరుగా ఉంటాయి.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ ఆంధ్రజ్యోతి పత్రికకు యాడ్స్ ఇవ్వలేదు. ఇలా సంవత్సరాలపాటు సాగింది. అంతేకాదు మమ్మల్ని ప్రశ్నించే విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోమంటూ బెదిరించాడు కూడా. తర్వాత దానికి తెలంగాణ వ్యతిరేకులు అనే కవరింగ్ ఇచ్చాడు. భారత రాష్ట్ర సమితిని వ్యతిరేకిస్తే తెలంగాణను వ్యతిరేకించినట్టా? ఇదేం దిక్కుమాలిన ధోరణి? సరే ఇప్పుడు ప్రభుత్వం నమస్తే తెలంగాణకు యాడ్స్ కట్ చేసింది. వచ్చే రోజుల్లో కూడా ఇదే పద్ధతి అవలంబిస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ చేయాల్సింది చాలా ఉంది.
కోవిడ్ తర్వాత పత్రికల సర్కులేషన్ దారుణంగా పడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రింట్ మీడియా పరిస్థితి కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత అనే లాగా ఉంది. ఈ పత్రికల విషయంలో ప్రభుత్వం కూడా అంత ఉదారత చూపించాల్సిన అవసరం లేదు. కోవిడ్ సమయంలో కాస్ట్ కటింగ్ పేరుతో అడ్డగోలుగా ఉద్యోగులను యాజమాన్యాలు తొలగించాయి. కనీసం వారికి ఎటువంటి పరిహారం కూడా చెల్లించలేదు. చాలామంది ఉద్యోగులు ఇతర వ్యాపకాలను చూసుకున్నారు.. అయితే సర్కులేషన్ దాదాపు సగానికంటే ఎక్కువ కోల్పోయిన పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ది లార్జెస్ట్ సర్కులేటెడ్ ఇన్ తెలుగు డైలీ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఈనాడు ముక్కి మూలిగి 8 లక్షల కాపీలు( రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి) ప్రింట్ చేస్తోంది. కానీ వికీపీడియాలో మాత్రం దాని సర్కులేషన్ 16 లక్షలు అని చూపిస్తోంది. సాక్షి కూడా అటు ఇటుగా ఆరు లక్షల కాపీలు ప్రింట్ చేస్తోంది. గతంలో సాక్షి సర్కులేషన్ 12 లక్షలు గా ఉండేది. ఇక ఆంధ్రజ్యోతి అటు ఇటుగా 4 లక్షల కాపీలు ప్రింట్ చేస్తోంది.. సో తెలుగు నాట ఈ మూడు పత్రికలకే ఏబిసి రేటింగ్ ఉంది.. అయితే ఈ పత్రికలు గతంలో అంటే కోవిటి కంటే ముందు ఉన్న తమ సర్కులేషన్ లెక్కలు చూపించి ప్రభుత్వం దగ్గర యాడ్స్ తీసుకుంటున్నాయి. అంతేకాదు తమ టారిఫ్ రేటు పెంచి లక్షల్లో దండుకుంటున్నాయి.. ఇక మిగతా పత్రికల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. మరి ఇలాంటి వాటికి రేవంత్ ప్రభుత్వం అడ్డగోలుగా యాడ్స్ ఇచ్చుకుంటూ పోతే పరిస్థితి ఏమిటి? గతంలో కేసీఆర్ వెలుగు, ఆంధ్రజ్యోతి మినహా మిగతా పత్రికలకు అడ్డగోలుగా యాడ్స్ ఇచ్చాడు. ఇక ఆ నమస్తే తెలంగాణ అయితే 10 సంవత్సరాలు పండగ చేసుకుంది.. కేవలం తెలుగు మీడియా మాత్రమే కాకుండా ఇంగ్లీష్, హిందీ పత్రికలకు కూడా కెసిఆర్ అడ్డగోలుగా యాడ్స్ ఇచ్చాడు.. కేవలం తన ప్రచారటోపానికే వందల కోట్లు తగలేశాడు.
అప్పట్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీఆర్వోలే యాడ్ ఏజెన్సీలు నెలకొల్పారు. పట్టుమని పది కాపీలు ప్రింట్ చేయడం.. వాటికి యాడ్స్ ఇప్పించుకోవడం.. సర్కారు నుంచి లక్షల్లో దండుకోవడం దర్జాగా చేశారు. అంతేకాదు మొన్నటికి మొన్న ఎన్నికల్లో కూడా ఇదే తంతు కొనసాగించారు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ మీడియా ప్రకటనల గురించి.. గతంలో జరిపిన కేటాయింపుల గురించి విచారణ చేస్తే వందల కోట్ల బాగోతం తెరపైకి వస్తుంది.. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పత్రికలకు వాటి సర్కులేషన్ ఆధారంగానే యాడ్స్ ఇవ్వాలి. చానల్స్ కి కూడా న్యూ వ్యూయర్ ఆధారంగానే ప్రకటనలు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం పెట్టే ఖర్చుకు ఒక పారదర్శకత ఉంటుంది. లేకుంటే రేవంత్ రెడ్డి పాలనలోనూ కెసిఆర్ జమానా కనిపిస్తుంది..