Marriages postponed : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని పెద్దలు అంటూ ఉంటారు కదా! అందులో ఉన్న సాదక బాధకలను దృష్టిలో పెట్టుకునే వారు అలా చెబుతుంటారు. ఇల్లు సంగతేమో గానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎన్నో ఇబ్బందులుంటాయి. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకూ ప్రతీది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. విందూ వినోదాలే కాదు బంగారం కొనుగోలూ ఇందులో భాగమే. ఇలాంటి ఖర్చు వ్యవహారంలో ప్రతీ పైసాకు లెక్క చెప్పాలంటే కుదురుతుం దా? ఒకప్పుడేమోగానీ ఇప్పుడు కచ్చితంగా లెక్క చెప్పాల్సిందే! లేకుంటే ఐటీ అధికారుల చుట్టూ తిరగాలి.
ఇది పెళ్లిళ్ల సీజన్. ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల సీజన్. అక్టోబరు-నవంబరు నెలల్లో మంచి రోజులున్నాయి. ముఖ్యంగా నవంబరు 19, 24 తేదీల్లో ఎక్కువ పెళ్లి ముహుర్తాలున్నాయి. ఆ రెండు రోజుల్లోనే తెలంగాణలో వేలాది వివాహాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వివాహ వేడుకలు కాస్తా ఎన్నికల వల్ల ఆందోళన, భయాల మధ్య నిర్వహించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. ఆధారాలు చూపితే ఇస్తామంటున్నారు. కానీ అవి, తిరిగి ఎప్పటికి చేతికందుతాయో అని వివాహ వేడుకలు నిర్వహించేవారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సమయంలో దుస్తులు, బంగారం, పెళ్లి ఏర్పా ట్లు.. ఇలా దాదాపుఅన్నింటికీ నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతాయి. ముఖ్యంగా దుస్తులు, బంగారం కోసం లక్షల్లో ఖర్చు పెడతారు. మంగళసూత్రం చేయించాలన్నా లక్ష రూపాయల కంటే ఎక్కువగానే అవుతుంది. కానీ, ఎన్నికల కోడ్ వల్ల రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లలేని పరిస్థితి.
నగదును స్వాధీనం చేసుకున్నప్పటికీ సరైన ఆధారాలు చూపితే ఆ డబ్బును తిరిగిస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ, ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకొని అధికారుల చుట్టూ ఎవరు తిరుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెళ్లికార్డు చూపితే ఇబ్బందులుండవని ఎన్నికల అధికారులంటున్నారు. కానీ ఒక్కసారి డబ్బును స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆధారాలు చూపి, వారి దగ్గర్నించి తెచ్చుకోవడం వెంటనే జరగదని, నిబంధనల మేరకు రోజుల సమయం పడుతుందని అంటున్నారు.
ఇదిలావుంటే బంగారం, దుస్తుల షాపుల వ్యాపారంపైన కూడా ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. నగరాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో వ్యాపారాలు జరుగుతున్నా.. చిన్నచిన్న పట్టణాల్లో మాత్రం బంగారం, వస్త్ర వ్యాపారాలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజులుగా యూపీఐ లావాదేవీలు సక్రమంగా జరగడం లేదంటున్నారు. ఇక పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, మద్యం షాపులలో రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. తనిఖీల్లో భాగంగా అధికారులు వాళ్ల డబ్బులను కూడా పట్టుకుంటుండటంతో వారంతా లబోదిబోమంటున్నారు.