Israel – palastina crisis : యుద్ధం మిగిల్చిన విషాదం.. కలుపు మొక్కలు, గుర్రం మాంసమే కడుపునకు అన్నం

ఈక్రమంలో ఇజ్రాయిల్ దాడుల వల్ల చనిపోయిన గుర్రాల మాంసాన్ని వండి తమ పిల్లల కడుపు నింపుతున్నామని శరణార్థులు వాపోతున్నారు. మరోవైపు రంజాన్ లోపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలాగా ఇజ్రాయిల్ దేశాన్ని ఒప్పిస్తామని ఈజిప్టు వర్గాలు చెబుతున్నాయి.

Written By: NARESH, Updated On : February 26, 2024 5:50 pm
Follow us on

Israel – palastina crisis : “మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు” ప్రఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా ఎప్పుడో దశాబ్దాల క్రితం చెప్పిన మాట అది. ఆయన తన స్వీయానుభవంలో చెప్పిన మాట.. పాలస్తీనాలోని గాజా వాసులకు అనుభవంలోకి వస్తోంది. వాస్తవానికి ఈ యుద్ధంతో గాజా వాసులకు సంబంధం లేకపోయినప్పటికీ.. చేయని తప్పునకు శిక్ష అన్నట్టుగా.. వారి పరిస్థితి మారిపోయింది. హమాస్ తీవ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. గాజా నగరం పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు.. బయటికి వెళ్లే అవకాశం లేదు. తల దాచుకోవడానికి చోటు లేదు. అంతకుమించిన ప్రత్యక్ష వేదన ఇంకొకటి ఏముంటుంది. అలాంటి పరిస్థితినే గాజా వాసులు అనుభవిస్తున్నారు.

ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూ సిబ్బంది గాజా లో మొన్నటి వరకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. శరణార్థులకు అన్నపానీయాలు అందజేశారు. ఆ సంస్థ ప్రస్తుతం గాజా నగరాన్ని వీడింది. ఫలితంగా ప్రజలకు అన్నపానీయాలు దూరమయ్యాయి. దీంతో ఆకలి కేకలు పెరిగాయి. గాజా నగరంలో 22 లక్షల మంది జనాభా ఉన్నారు.. ఇందులో 80 శాతం మంది దక్షిణ గాజాలోని రఫా అనే ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయిల్ దాడులు చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆహార సమస్య విపరీతంగా పెరిగింది.

ఎటువైపు నుంచి అన్న పానీయాలు వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడి ప్రజలు “మాలో” అనే కలుపు మొక్కలను ఆహారంగా తింటున్నారు. కొంతమంది వ్యాపారులు “మాలో” కలుపు మొక్కలను సేకరిస్తున్నారు. ఒక కట్టమొక్కలకు 80 ఇజ్రాయిల్ షాకేల్స్(భారత కరెన్సీలో ₹1,800) వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ మొక్కను నోటిలో ఏర్పడిన ఎలర్జీ, గొంతు నొప్పులు తగ్గించేందుకు ఔషధంగా వాడుతారు. ఈ మొక్కను మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యం అని తెలిసినప్పటికీ.. తమ ఆకలి తీర్చుకోవడానికి ఇంతకు మించిన పరిష్కార మార్గం లేదని గాజా వాసులు అంటున్నారు. ఉత్తర గాజా ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. అక్కడ కూడా దాడులు పెరిగితే ఇలానే ఉంటుందని ప్రజలు అంటున్నారు. వెస్ట్ బ్యాంక్ లోని జబాలియా శిబిరంలోనూ ఆకలి కేకలు తీవ్రమైనటు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో ఇజ్రాయిల్ దాడుల వల్ల చనిపోయిన గుర్రాల మాంసాన్ని వండి తమ పిల్లల కడుపు నింపుతున్నామని శరణార్థులు వాపోతున్నారు. మరోవైపు రంజాన్ లోపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలాగా ఇజ్రాయిల్ దేశాన్ని ఒప్పిస్తామని ఈజిప్టు వర్గాలు చెబుతున్నాయి.