Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ పక్షాలనే కాదు.. సామాన్య జనాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబును ఏ ప్రభుత్వము టచ్ చేయలేకపోయింది. ఆయన ఒక అపర మేధావి అని.. తప్పు చేసిన ఆధారాలు లేకుండా చూసుకుంటారని.. ఆయన ఎప్పటికీ చట్టానికి చిక్కరని ఇలా ఎన్నెన్నో చంద్రబాబు గురించి వ్యాఖ్యానాలు సాగేవి. అయితే ఇవి మొన్నటి వరకు నిజమే. కానీ జగన్ అంతకంటే మొండివాడు. దీంతో చంద్రబాబు జైలుకు వెళ్లే వరకు ఆ మొండితనాన్ని కొనసాగించారు. తాను అనుకున్నది సాధించగలిగారు.
చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరిగిందని టిడిపి అంచనా వేస్తోంది. ఇది తమకు ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తోంది. అయితే జగన్ ఎన్నికల ముంగిట ఇటువంటి నిర్ణయానికి వస్తాడా? తన పార్టీకి మైనస్ జరిగి.. టిడిపికి ప్లస్ అవుతుందంటే అంతటి సాహసానికి దిగుతాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మంచి పనులు చేయాలని జగన్కు అధికారం అప్పగిస్తే.. దుర్వినియోగం చేస్తున్నాడు అన్న భావనను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. బాబు అరెస్టుతో తటస్తులు, విద్యాధికులు తమ వైపు టర్న్ అవుతారని టిడిపి భావిస్తోంది.
అయితే దీనిపై వైసీపీ భిన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టును ప్రజలు లైట్ తీసుకుంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్ల దాడిని గుర్తు చేస్తున్నారు. దాదాపు మృత్యువు చెంతకు వెళ్లి మరి.. చంద్రబాబు బయటపడ్డారు. సానుభూతి దక్కుతుందని ముందస్తుకు వెళ్లారు. కానీ ప్రజలు పట్టించుకోకపోవడంతో దారుణ పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే వర్కౌట్ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2014 ఎన్నికలకు ముందు జగన్ సైతం 16 నెలల జైలు జీవితం అనుభవించారు. అయినా పెద్దగా సానుభూతి వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరుగుతుందని జగన్ బలంగా విశ్వసిస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు అరెస్టుతో జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. చట్టానికి దొరక్కుండా.. అహంకారంతో నాలుగు దశాబ్దాలుగా విర్రవీగుతున్న చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేయడం ద్వారా జగన్ క్రేజ్ పెరిగిందని భావిస్తున్నారు. చాలామంది తటస్తులు, వివిధ రంగాల ప్రముఖులు జగన్ను అభినందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే తనకు నష్టం జరుగుతుందని భావిస్తే చంద్రబాబు విషయంలో జగన్ ఎంత దూకుడుగా వ్యవహరించి ఉండేవారు కాదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.