Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Badwel: బద్వేల్ బరి నుంచి జనసేన తప్పుకోవడం కరెక్టేనా?

Pawan Kalyan Badwel: బద్వేల్ బరి నుంచి జనసేన తప్పుకోవడం కరెక్టేనా?

Pawan Kalyan Badwel: ముందుగ మురిస్తే ‘పండుగ’ కాదంటారు. రాజకీయాల్లో అది అక్షరసత్యం.. ఏదైనా కానీ పోరాటంతో.. ప్రజల్లోకెళ్లి సాధించాలి. వారి మన్ననలు పొంది ఎన్నికల్లో గెలవాలి.. అప్పుడే ఏ రాజకీయ నాయకుడికి అయినా సార్థకత.. రాజమండ్రి శ్రమదానంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ కీలక వ్యాఖ్య చేశారు. అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ అరుస్తుంటే… వారిని వారించి.. ‘‘గెలిపించని మీరు నన్ను ‘సీఎం సీఎం’ అని పిలవవద్దని’’   తన అభిమానులకు చురకలంటించారు. మీరు గెలిపించిన తర్వాత అలా పిలవండి.. అప్పటి వరకు పిలవవద్దని సూచించారు. ఇక పవర్ లేని తనకు పవర్ స్టార్ ఎందుకని దాన్ని తీసేశానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో శ్రమదానం చేసిన పవన్ కళ్యాణ్ ఆవేదన ఆగ్రహం ఈ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. మంగళగిరి సభలోనూ తనను రెండు చోట్ల ఓడించారని.. ప్రజారాజ్యం పెట్టి వెనక్కితగ్గామని.. మీ వెంట నిలబడనందుకు క్షమించాలని ప్రజలను వేడుకున్నాడు..

-ప్రజల్లోకి వెళుతున్న పవన్.. పోటీకి మాత్రం దూరం..
ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే.. ఏ నేత అయినా కానీ రాజకీయంగా ఎదగాలంటే ప్రజల్లోకి వెళ్లాలి.. వారి కష్టాలు, నష్టాలు తెలుసుకొని ప్రతిపక్షంగా పోరాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే మొదలుపెట్టాడు. ఏపీ రోడ్ల సమస్యపై శ్రమదానంతో చేరువ అవుతున్నాడు. తనపై అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే పనిలో పడ్డారు. ప్రజల్లో పవన్ కు విపరీతమైన ఆదరణ వస్తోంది. వైసీపీ సర్కార్ ను 2024 ఎన్నికల్లో ఓడిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వచ్చేసరికి ఇలా పీచేముడ్ అనడమే జనసైనికుల్లో స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని అంటున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు.. ఎన్నికల్లో సీట్లే గొప్ప గిఫ్ట్.. కానీ జనసైనికులకు మాత్రం అవి అందకుండా పోతున్నాయన్న ఆవేదన వారిలో కలుగుతోంది.

-బద్వేల్ నుంచి జనసేన తప్పు కోవడం కరెక్టేనా?
మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తూ పోటీకి దిగి మరీ జనసేన వైదొలిగింది. జనసైనికులతో విత్ డ్రా చేయించి వారి పదవుల ఆశలపై నీళ్లు చల్లింది. అనంతరం జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని కాదని టీఆర్ఎస్ కు మద్దతిచ్చింది. ఇక ఏపీలో జరిగిన ఏకైక ఉప ఎన్నికల్లో తిరుపతిలో బీజేపీ కంటే కూడా బలమున్న, కార్యకర్తల బలమున్న జనసేన పోటీచేయకుండా తన మిత్రపక్షంను నిలబెట్టింది. దీన్ని జనసేన నేతలు, కార్యకర్తలే వ్యతిరేకించినా పొత్తు ధర్మంలో విడిచిపెట్టింది. ఇక ఇప్పుడు బద్వేల్ బరిలో జనసేన నిలబడుతుందని అందరూ ఆశించారు. సమరోత్సాహంతో ఉన్నారు. కానీ జనసేనాని పవన్ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లారు. ‘మరణించిన వైసీపీ ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇచ్చినందుకు జనసేన వైదొలుగుతోందని.. రాజకీయాల్లో విలువలు ముఖ్యం. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయండి’ అని పేర్కొంటూ పవన్ బద్వేల్ ఉప ఎన్నిక నుంచి వైదొలిగారు.

-బీజేపీ పోటీచేస్తుందా? పవన్ మద్దతిస్తారా?
జనసేన బద్వేల్ లో పోటీచేయదని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి మిత్రపక్షం బీజేపీ మాత్రం దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ జనసేనకు విరుద్ధంగా ఇక్కడ కమలం పార్టీ పోటీచేస్తుందా? పోటీచేస్తే పవన్ మద్దతు ఇస్తారా? అంటే డౌటేనంటున్నారు. పవన్ రాజకీయం వల్ల ఇప్పుడు బీజేపీ సైతం బద్వేలులో డిఫెన్స్ లో పడిపోయింది. నిజానికి తిరుపతి ఉప ఎన్నికల్లో అక్కడి వైసీపీ ఎంపీ కరోనా కారణంగా చనిపోయాడు. అయితే వారి వారసులకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ-జనసేన పోటీచేశాయి. ఓడిపోయాయి. కానీ బద్వేలులో వారసులకు ఇవ్వడంతో పోటీకి పవన్ ససేమిరా అంటున్నారు.

-బద్వేల్ బరిలో నిలిస్తే సీమలో బలం పెరిగేది?
కడప జిల్లా.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ కంచుకోట. అలాంటి జిల్లాలో జనసేన పోటీచేసి గెలవకపోయినా కనీసం ప్రతిపక్ష టీడీపీని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిస్తే జనసేనకు కొండంత బలం వచ్చేది. ఏపీలో టీడీపీ పని అయిపోందని.. ఇక జనసేననే ప్రతిపక్షమని ప్రజలకు చాటి చెప్పేది. కానీ ఈ అవకాశాన్ని విశ్వసనీయ రాజకీయాల పేరుతో పవన్ పక్కనపెట్టాడు. రాయలసీమలో జనసేన బలం నిరూపించుకునే మంచి అవకాశాన్ని కాలదన్నాడు. పోటీచేస్తే అటు జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం.. నేతల్లో స్థైర్యం పెరిగేది. ఎన్నాళ్లుగానో పోటీకి మోహం వాచి ఉన్న జనసేన నేతలకు కొత్త ఉత్సాహం వచ్చేది. కానీ పవన్ ప్రకటనతో అసలు జనసేన ఎన్నికల్లో పోటీచేస్తుందా? మేం నిలబడుతామా? అన్న నైరాశ్యం కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది.

-ప్రతిపక్ష టీడీపీకి జనసేన మళ్లీ చాన్స్ ఇస్తోందా?
బద్వేల్ బరిలో నిలవకుండా ప్రతిపక్ష టీడీపీకి జనసేన ఊపిరినిచ్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే కొద్దిరోజులుగా వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న పవన్ కళ్యాణ్ తీరా బద్వేల్ ఎన్నికలకు వచ్చేసరికి వైదొలిగారు. పోటీచేయనన్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో నిలుస్తోంది. ఇక్కడ జనసేన పోటీచేస్తే టీడీపీని వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి దోహదపడేది.కానీ ఇప్పుడు పోటీచేయకుండా టీడీపీకి జనసేననే ఫేవర్ చేసినట్టుగా మారింది. జనసేన నిర్ణయం ఖచ్చితంగా టీడీపీకి ప్లస్ అంటున్నారు. అక్కడ అధికార, ప్రతిపక్ష టీడీపీల మధ్యే పోటీ ఉండడం ఖాయమంటున్నారు.

అయితే జనసేనకు ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాస్’ పోయింది. ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ క్రమంలోనే బద్వేలులో పోటీచేస్తే గందరగోళం నెలకొంటుందని.. వేరే గుర్తుతో పోటీకి పవన్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీని వల్ల రాజకీయంగా మైనస్ అవుతుందని ఆలోచినట్టున్నారు. అంతేకాకుండా బద్వేల్ లో సరైన అభ్యర్థి కూడా జనసేనకు లేరనే టాక్ కూడా నడుస్తోంది. ఈ కారణాలన్నీ చూసి.. మొత్తంగా బద్వేల్ బరి నుంచి జనసేన వైదొలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన వైదొలగడం ఆ పార్టీకి ఖచ్చితంగా దెబ్బేనని.. ఇలా అందివచ్చిన అవకాశాన్ని పవన్ జారవిడుచుకున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular