Chiranjeevi : ఎంతోమంది హీరోలు వచ్చిన మన తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్ మాత్రం చిరంజీవి ఒక్కడే. ఆయనను చూసి నిదర్శంగా తీసుకొని ఆ తరువాత స్వయంకృషితో వచ్చిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. చిరంజీవి అంటే విపరీతమైన ప్రేమ ఉండే అభిమానులు దేశమంతటా ఉన్నారు. అలాంటి మన చిరంజీవికి వాల్తేరు వీరయ్య మినహా కొద్ది సంవత్సరాల నుంచి బ్లాక్ బస్టర్ సినిమా లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే.
యాక్టింగ్ అయినా, డాన్స్ అయినా, కామెడీ అయినా, ఫైట్స్ అయినా చిరంజీవికి చిరంజీవే సాటి. ఎలాంటి రోల్ అయినా అవలీలగా చేయగలరు ఈ హీరో. ఒకప్పుడు స్వయంకృషి, రుద్రవీణ, శుభలేఖలు లాంటి అద్భుత చిత్రాలను మనకు అందించిన చిరంజీవి ఇప్పుడు మాత్రం ఎందుకో ఎక్కువగా రీమేక్ లు పైన ఇంట్రెస్ట్ చూపివడం అభిమానులకు కూడా కొంచెం బాధ కలిగిస్తొంది.
అయితే చిరంజీవి కెరీర్ ప్రారంభంలో రీమేక్ సినిమాలు చేయలేదా అంటే.. ఆయనకి అసలు మెగా స్టార్డం తెచ్చింది చాలా వరకు రీమేక్ సినిమాలు అని చెప్పొచ్చు. చట్టానికి కళ్ళు లేవు, ఖైదీ, విజేత, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, హిట్లర్, ఠాగూర్ ఇలా చిరంజీవి చేసిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రీమేక్ సినిమాలే. ఆ సినిమాలతో చిరంజీవి అంచలంచలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు రీమేక్ లు గురించి అభిమానులు బాధపడుతున్నారు అంటే దానికి కారణం లేకపోలేదు.
అప్పట్లో సోషల్ మీడియా, ఓటిటి లాంటివి లేవు. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు ఇవన్నీ ఉన్నాయి. ఏ భాషలో విడుదలైన సినిమా అయినా, సబ్ టైటిల్స్ లేదా వారి వారి భాషల్లో డబ్బింగ్ ఆడియోతో వినేసి, చూసేస్తున్నారు. ఒక భాషలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంతే, భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఆ సినిమాని చూసేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ఎందుకు రీమేక్ సినిమాల పైన ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు.
పాలిటిక్స్ లోకి వెళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత, చిరంజీవి నటించిన సైరా, ఆచార్య, వాల్తేరు వీరయ్య మినహా మిగతా సినిమాలు అన్నీ రీమేక్ సినిమాలే. ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ లాంటి రీమేక్ చిత్రాలు చిరంజీవి నటన వల్ల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ పొందిన కలెక్షన్లు సునామి అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఆ కలెక్షన్స్ చూసి అవి అసలు చిరంజీవి రేంజ్ సినిమాలు కాదు అని ఆయన అభిమానులే అనుకోవడం విశేషం.
అదే చిరంజీవి సింపుల్ స్టోరీ తో వాల్తేరు వీరయ్య అని తీస్తే, అభిమానులు బ్లాక్ బస్టర్ చేశారు. అంటే చిరంజీవి రీమేక్ సినిమాలు కాకుండా సొంత కథతో యావరేజ్ సినిమా చేసిన అది బ్లాక్ బస్టర్ అవుతుంది అని వాల్తేరు వీరయ్యతో అర్థమైంది. కానీ ఈ విషయం చిరంజీవికి అర్థం అయిందా లేదా అనేది సందేహం. ఎందుకంటే వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ అందుకున్న వెంటనే ఎన్నో సంవత్సరాల క్రితం తమిళంలో రిలీజ్ అయిన వేదాళం సినిమా కి రీమేక్ అయినా భోళాశంకర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు ఈ హీరో.
తాజాగా విడుదల చేసిన ‘భోళాశంకర్’ ట్రైలర్ చూస్తే మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్ అయితే ఇది వాల్తేరు వీరయ్య , ఠాగూర్ ఇతర ఇదివరకే చిరంజీవి చేసిన సినిమాలను పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు. సో చిరంజీవి రిమేక్ ల విషయంలో పునరాలోచించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వేదాళం సినిమా ఎప్పుడో 2015 వ సంవత్సరంలో తమిళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు చూసేసారు. అయితే ఆ కథను తీసుకొని, అది కూడా ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ కి దర్శకత్వం ఇచ్చి చిరంజీవి సినిమా ఎందుకు చేస్తున్నారో అని ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరి నుంచి మెగా అభిమానులు బాధపడుతున్నారు. మరి ఇప్పుడైనా చిరంజీవి అభిమానుల బాధ అర్థం చేసుకుని రీమేక్ లకు దూరంగా ఉంటారో లేదో చూద్దాం.