Iran Vs America: అమెరికాపై ఇరాన్ దాడి.. మరో యుద్ధం తప్పదా?

హౌతి రెబల్స్ పై అమెరికా దాడులను నిరసిస్తూ ఇరాన్ కూడా కాలు దువ్వుతోంది. ఏకంగా అమెరికాపై దాడులు చేస్తోంది. ఇరాక్ లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనం పైకి ఇరాన్ బాలిస్టిక్స్ మిస్సైల్లను సంధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 21, 2024 12:55 pm

Iran Vs America

Follow us on

Iran Vs America: ఇటీవలే పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులు చేసిన ఇరాన్.. మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తిరిగి పాకిస్తాన్ దాడి చేసినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితిలో వేగంగా మారిపోతున్నాయి. ఇరాన్ దాడులు మర్చిపోకముందే యేమన్ పైకి అమెరికా దాడికి దిగింది. ఆ ప్రాంతంలో హౌతి తిరుగుబాటుదారులు ఉన్నారని ఆరోపిస్తూ అక్కడ వారి స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నది. అమెరికాకు బ్రిటన్ వంటి దేశాల సహకారం తోడు కావడంతో మరింత దూకుడుగా దాడులు చేస్తోంది. సముద్ర మార్గాన్ని.. ముఖ్యంగా తమకు వాణిజ్య అవసరాలు తీర్చే వస్తువులను తీసుకొస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెడుతున్న హౌతి రెబల్స్ పై అమెరికా ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నది.

హౌతి రెబల్స్ పై అమెరికా దాడులను నిరసిస్తూ ఇరాన్ కూడా కాలు దువ్వుతోంది. ఏకంగా అమెరికాపై దాడులు చేస్తోంది. ఇరాక్ లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనం పైకి ఇరాన్ బాలిస్టిక్స్ మిస్సైల్లను సంధించింది. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉన్న అమెరికా కాన్సులేట్ భవనాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. అయితే ఈ దాడులు జరిగిన వెంటనే ఇరానీయన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పందించింది. ఆ దాడికి తామే కారణమని ప్రకటించింది. అంతేకాదు ఎర్బిల్ సిటీలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం గూడ చర్య కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు ఏకమవుతున్నాయని.. తమను ఇబ్బంది పెట్టడానికి ఆ దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటున్నదని ధ్వజమెత్తింది..

ఇక ఇరాన్ మిలిటెంట్లు కూడా రెచ్చిపోయి దాడులకు దిగారు. ఇరాక్ లోని అమెరికా ఏయిర్ బేస్ పై ఏకంగా భీకరమైన దాడులు చేశారు. ఈ ఘటనలో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడిని అమెరికాలోని రక్షణ కార్యాలయం పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ దాడిలో సైనికులు గాయపడ్డారని ప్రకటించింది. సద్దాం హుస్సేన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. అతడిని గద్దించేందుకు అప్పట్లో అమెరికా యుద్ధం చేసింది.. ఆ తర్వాత ఇరాక్ పశ్చిమ ప్రాంతంలోని అల్ అసద్ లో అమెరికన్ ఎయిర్ బేస్ నిర్మించింది. ఇరాక్ దేశ కాలమన ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఇరాన్ మిల్టెంట్లు ఈ దాడి చేశారు. ఎయిర్ బేస్ పై బాలిస్టిక్స్ మిస్సైల్స్ తో దాడులు చేశారు. అయితే ఈ దాడి వెనుక ఇరాన్ మిలటెంట్ గ్రూపులు ఉన్నాయని అమెరికా భావిస్తోంది. అయితే నష్టం తీవ్రత ఎంత ఉందో ఇప్పటివరకు అమెరికన్ రక్షణ కార్యాలయం ప్రకటించలేదు. అయితే ఈ దాడిలో అమెరికా సైనికులతో పాటు ఓ ఇరాక్ ఉద్యోగి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. హౌతి తిరుగుబాటుదారులపై దాడులు చేస్తున్న అమెరికా.. ఇరాన్ తమపై చేసిన దాడులను ఏ విధంగా తిప్పి కొడుతుంది? దీనివల్ల మధ్య ఆసియా ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇవి యుద్ధానికి దారితీస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.