https://oktelugu.com/

IPL 2024 PBKS vs DC : ప్రీతి జింటా ముద్దు.. రెచ్చిపోయిన పంజాబ్ క్రికెటర్.. ఢిల్లీ చిత్తు

పంజాబ్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కరన్ కు ప్రీతి జింటా ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఓటమితోనే స్వాగతం లభించినట్టయింది.

Written By: NARESH, Updated On : March 23, 2024 8:26 pm
Preetijinta Kisses, Sam Curran

Preetijinta Kisses, Sam Curran

Follow us on

IPL 2024 PBKS vs DC : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా శనివారం చండీగఢ్ లో జరిగిన రెండవ లీగ్ మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్ సామ్ కరణ్(63), లివింగ్ స్టోన్ (38) రాణించడంతో ఢిల్లీ జట్టు ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఢిల్లీ జట్టు 19 ఓవర్ వరకు 149 పరుగులు మాత్రమే చేసింది. అయితే చివర్లో వచ్చిన అభిషేక్ పోరెల్ 20 ఓవర్ లో హర్షల్ పటేల్ బౌలింగ్లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. 4, 6, 4, 4, 6, 1 బాది ఆ ఓవర్ లో పరుగుల సునామీని సృష్టించాడు. ఢిల్లీ జట్టు స్కోర్ ఒక్కసారిగా 174 పరుగులకు చేరుకుంది. పంజాబ్ ముందు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

175 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ త్వరగానే కోల్పోయింది. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టి 22 పరుగులు చేసిన ధావన్.. ఈశాంత్ శర్మ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. 9 పరుగులు చేసిన మరో ఓపెన బెయిర్ స్టో కూడా ఈశాంత్ శర్మ చేతిలో రన్ అవుట్ అయ్యాడు. ఈ దశలో సిమ్రాన్ సింగ్, సామ్ కరన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. మూడో వికెట్ కు 42 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిమ్రాన్ సింగ్(26) కులదీప్ యాదవ్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తర్వాత క్రికెట్ కీపర్ జితేష్ శర్మ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్ తీవ్రమైన కష్టాల్లో పడింది.

ఈ దశలో లివింగ్ స్టోన్ క్రీజ్ లోకి వచ్చాడు. దీంతో కరన్, లివింగ్ స్టోన్ పంజాబ్ జట్టును ఒడ్డున చేర్చే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 67 పరుగుల జోడించారు. జట్టు స్కోర్ 167 పరుగుల వద్ద ఉన్నప్పుడు కరన్ (63 47 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. కరన్ అవుట్ అయినప్పటికీ లివింగ్ స్టోన్(38 నాట్ అవుట్ 21 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్స్ లు) వీరోచిత పోరాటం చేశాడు. ఫలితంగా 19.2 ఓవర్లలోనే పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

పంజాబ్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కరన్ కు ప్రీతి జింటా ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఓటమితోనే స్వాగతం లభించినట్టయింది.