IPL 2024 MI vs GT : ఐదుసార్లు ఐపీఎల్ విజేత.. అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 17వ సీజన్ ను ఓటమితో మొదలుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. కీలకమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. పేలవమైన ఆటతీరు కనబరిచింది. ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ చెట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు కేవలం 168 పరుగులు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్ 45, గిల్ 31 పరుగులతో సత్తా చాటారు. చివరి ఓవర్లలో రాహుల్ తెవాటియా 22 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
169 పరుగుల విజయ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటకట్టుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 43, డేవాల్డ్ బ్రేవాస్ 46 పరుగులతో సత్తా చాటినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లలో ఓమర్జాయ్ , జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సాయి కిషోర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
చివరి ఓవర్ లో ముంబై జట్టుకు 19 పరుగులు అవసరమయ్యాయి. ఉమేష్ యాదవ్ బౌలింగ్ అందుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా 6, 4 కొట్టాడు. మరుసటి బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పియూష్ చావ్లా భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ జట్టు విజయం దాదాపుగా ఖరారయింది.
ఈ ఓటమి నేపథ్యంలో రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సార్లు ముంబై జట్టుకు ట్రోఫీ తీసుకొస్తే.. కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నిస్తున్నారు. ముంబై జట్టు ఓడిపోవడం పట్ల రోహిత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మైదానంలోనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ముంబై జట్టు ఓడిపోయిన నేపథ్యంలో రోహిత్ అభిమానులు సంబరాలు చేసుకున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.