https://oktelugu.com/

IPL 2024 Promo : ఐపీఎల్- 17 ప్రోమో విడుదలైంది చూశారా.. మన పంత్, అయ్యర్ కేకో కేక

ఇలా నలుగురు యువ ఆటగాళ్లతో స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ప్రోమో రూపొందించింది. ఆ ప్రోమో ఆదివారం సాయంత్రం విడుదలైంది. విడుదల కావడమే ఆలస్యం నెట్టింట అది తెగ చక్కర్లు కొడుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 3, 2024 / 10:16 PM IST
    Follow us on

    IPL 2024 Promo : ఐపీఎల్ స్థూలంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 17వ సీజన్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పలు జట్లు సన్నాహకాల్లో మునిగిపోయాయి. మొదటి దశ షెడ్యూల్ కూడా బీసీసీఐ విడుదల చేసింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తర్వాతి షెడ్యూల్ మరి కొద్ది రోజులైనా తర్వాత విడుదల చేస్తామని బీసీసీఐ ప్రకటించింది. 17వ సీజన్ ను మ్యాచ్ ల ప్రసారహకులు స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. మరో మూడు వారాల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా నటించారు. ఈ ప్రోమో మొత్తం నిడివి 90 సెకండ్లు ఉంది. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో.. ఐపీఎల్-17 సీజన్ పై అభిమానుల అంచనాలను మరింత పెంచింది.

    ఇక ఈ ప్రోమోలో యువ ఆటగాడు రిషబ్ సిక్కు యువకుడి వేషధారణలో కనిపించాడు.. ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ సినిమా స్టైల్ లో పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ పంజాబీ దాబాకు వస్తాడు. గత ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై సిక్సర్ కొట్టి చెన్నై జట్టును జడేజా గెలిపిస్తాడు. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ధోని అమాంతం మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి జడేజాను హత్తుకుంటాడు.. ఆ సన్నివేశాన్ని చూసి పంత్ కన్నీరు కారుస్తాడు.

    ఇక కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయ్యర్ బెంగాలీ అబ్బాయి వేషధారణలో దశనమిచ్చాడు. అతడి కళ్ళకు సోడాబుడ్డి లాంటి అద్దాలు పెట్టుకొని గుజరాత్ జట్టుపై గత ఏడాది రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొడతాడు. ఆ వీడియోను అయ్యర్ తన కుటుంబంతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు నటించాడు.

    లక్నో కెప్టెన్ రాహుల్ ఓ గదిలో చదువుకుంటున్న విద్యార్థిగా కనిపిస్తాడు. ఆ సీజన్లో లక్నో బెంగళూరు జట్టుతో ఆడిన మ్యాచ్లో ఓడిపోతుంది. దీనికి ఎంపైర్ తప్పిదమే కారణంగా తెలుస్తుంది. ఆ మ్యాచ్ ఓడిపోవడాన్ని చూస్తూ అసహనంతో రాహుల్ బుక్ విసిరిస్తాడు. అంపైర్ పై అరుస్తాడు.

    ఓ కంపెనీ సీఈఓ గా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నటించాడు.. తన వ్యాపారంలో భాగంగా పాండ్యా జపాన్ ప్రతినిధులతో సమావేశం అవుతాడు. అది ముగియగానే.. తన పక్కన ఉన్న టీవీలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదవ సారి విజేతగా నిలిచిందనే వార్త ప్రసారమవుతుంది. దీంతో పాండ్యా హర్షం వ్యక్తం చేస్తాడు. జపాన్ బృందంతో సంబరాలు జరుపుకుంటాడు.

    ఇలా నలుగురు యువ ఆటగాళ్లతో స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ప్రోమో రూపొందించింది. ఆ ప్రోమో ఆదివారం సాయంత్రం విడుదలైంది. విడుదల కావడమే ఆలస్యం నెట్టింట అది తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రోమో ద్వారా ఐపీఎల్ 17 సీజన్ ప్రేక్షకులకు అంతకుమించిన ఆనందాన్ని పంచుతుందని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం చెప్పకనే చెప్పింది.