Ram Mandir: భారతీయ హిందువుల 500 ఏళ్ల స్వప్నం మరికొన్ని గంటల్లో నెవవేరబోతోంది. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రామ నామమే జపిస్తున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 సెకన్లకు అభిజిత్ లగ్నంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని చూసేందుకు అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే రామ్ లల్లా విగ్రహం అయోధ్య రామాలయ గర్భగుడిలోకి చేరుకుంది. కళ్లకు గంతలు కట్టి ఉన్న బాల రాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దివ్య సౌందర్య రాముడు..
చిద్విలాసంతో ఉన్న బాల రాముడి మోము ఎంతో సుందరంగా ఉంది. నల్లరాతి ఏకశిలతో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఈ బాల రాముడికే జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరుగనుంది. 23వ తేదీ నుంచి భక్తులకు రామ్ లల్లా దర్శనం ఇస్తారు. 200 కిలోల బరువు, 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ బాల రాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.
విగ్రహ ప్రత్యేకతలివీ..
శ్రీరాముడు బాలుని రూపంలో ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఆకర్షణీయంగా ఉంది. ఇక బాల రాముడి విగ్రహం చుట్టూ విష్ణు మూర్తి దశావతారాలు ఉన్నాయి. రామ్ లాల్లా విగ్రహం దిగువున ఒకవైపు హనుమంతుడు, మరొక వైపు గరుడ దేవుడు ఉన్నారు. పద్మ పీఠంపై బాల రాముడు నిలబడి ఉన్నాడు.
విగ్రహం చుట్టూ దశావతారాలు..
రామ్ లల్లా విగ్రహం అంచుల మీద విష్ణుమూర్తి దశావతారాలను చెక్కారు. మత్సా్యవతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురాముడి అవతారం, రాముడి అవతారం, కృష్ణుడి అవతారం, బుధ్ధుడు, కల్కి అవతారాలన్నీ చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వీటితోపాటు సూర్య భగవానుడు, శంఖం, స్వస్తిక్, సుదర్శన చక్రం, గధ, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. దీని మీద చేసిన కళా ఖండాలు ఔరా అనిపిస్తాయి. ఈ విగ్రహం తయారీకి ఏక శిలను మాత్రమే ఉపయోగించారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. నీరు, ఇతర వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు.