Indian Cricket First Captain CK Nayudu: ఆరడుగుల ఒకటిన్నర అంగుళాల పొడవు. రాజసం తొణికిసలాడే ఆకారం. బలమైన చేతులు. రబ్బరులా ఎటుపడితే అటు తిరిగే ముంజేతులు. చురుకైన మనస్సు. డేగ కళ్ళు. వేగవంతమైన రిఫ్లెక్సెస్. వీటన్నింటినీ మించి ప్రత్యర్థిని అధిగమించాలనే ప్రగాఢ వాంఛ. ఇన్ని గుణగణాలతో బ్యాటింగ్ కోసం మైదానంలోకి నడిచొస్తుంటే చూసేవాళ్ళకు అడవిలో వేటకు బయలుదేరిన సింహంలా కనిపించేవారు. మూసలో పోసిన సాంకేతికరమైన బ్యాటింగ్ గా కాక, ప్రతి బంతిని దాని వేగం మలుపు గ్రహించి ఎప్పటికప్పుడు వినూత్న పోకడతో బ్యాటింగ్ సాగిస్తూ బంతి బంతికీ కొత్తదనం చిందిస్తూ ప్రేక్షకులను ఆనందోత్సాహాలతో ముంచెత్తేవారు.

వినసొంపైన సంగీతంలా..
వినసొంపైన సంగీతంలా సాగుతున్న ఆయన బ్యాటింగ్ చూస్తుంటే బంతిని చేత్తో తీసి హనుమంతుడిలా మైదానం బయటకు విసిరేస్తున్నాడేమో అన్న భ్రమలో ప్రేక్షకులు కేరింతలు కొట్టేవారు. వారి ఆనందానికి పొంగి మధ్య మధ్య ఆయన సిక్స్ లు ఝళిపించేవారు.తన ఎత్తును, శరీర దారుఢ్యాన్ని ఉపయోగిస్తూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ, ధాటిగా బ్యాటింగ్ చేయడం మొదలుపెడితే, ఆనాటి పాత్రికేయులు అన్నట్లు వారి సిక్సర్స్ ఫిలాసఫర్ల ఆలోచనలకంటే ఎత్తుగా ఎగురుతూ మైదానం బయట ఉన్న టవర్ క్లాక్స్ ని పగలకొడుతుండేవి.
భారతీయ క్రికెట్ చరిత్రలో ప్రణయ కావ్యాలుగా అలరారిన బొంబాయి క్వాడ్రాంగ్యులర్ మ్యాచెస్ లో ఆయనే కథానాయకుడు. ఇంగ్లండ్ లో 1932లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన భారతీయ జట్టుకి ఆయనే కెప్టెన్. ఆ కెప్టెన్ పేరే సీ కే నాయుడు. పూర్తి పేరు కఠారి కనకయ్య నాయుడు. వీరు పదహారణాల తెలుగు వారని ఎక్కువ మందికి తెలియదు. వీరి పూర్వీకులు బందరు నుంచి నాగపూర్ వలసపోయారనీ తెలియదు. వీరి ప్రతిభను గౌరవించాలన్న దృక్పథంతో అలనాటి మధ్య పరగణాలలోని హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనను తమ సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి ఇండోర్ పట్టణానికి ఆహ్వానించారని కూడా చాలా మందికి తెలియదు.
కల్నల్ నాయుడు ఇంకాస్త ఆలస్యంగా పుట్టివుంటే భారతీయ క్రికెట్ చరిత్ర మరెంత అందంగా ఉండేదో అన్న ఆనాటి వాళ్ళ తీపి బాధలు మనకస్సలు తెలియవు. బౌలర్ గా తమ ఫస్ట్ క్లాస్ కెరీర్ ను ప్రారంభించి, సీకే అంటే సిక్సర్స్, సిక్సర్స్ అంటే సీకేగా క్రికెట్ చరిత్రలో గుర్తింపెరిగిన ఆయన జీవితం ఈ తరం క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.
మొదటి కెప్టెన్ ఆయనే
భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్ సీకే నాయుడు. 1932లో భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడింది. ఆ జట్టుకు సీకే నాయుడే కెప్టెన్. నాగపూర్‌లో పుట్టిపెరిగి.. అక్కడే స్కూలు రోజుల నుంచి క్రికెట్ ఆడి భారత జట్టుకు తొలి కెప్టెన్ అయిన సీకే తెలుగువారు. ఆయన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. అందుకే జులై 24వ తేదీ మంగళవారం మచిలీపట్నంలో సీకే నాయుడి విగ్రహాన్ని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆవిష్కరించారు.భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రప్రథమ కెప్టెన్ సీకే నాయుడు.
పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి క్రికెటర్ కూడా ఆయనే. వాణిజ్య ప్రకటనలకు క్రికెటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఆయనతోనే మొదలైంది. అప్పట్లో ఓ టీ కంపెనీ తమ ప్రకటనల్లో సీకే నాయుడి చిత్రాన్ని వాడుకునేది. భారతదేశంలో ఉక్కుమనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయి పటేల్ జన్మదినం, సీకే నాయుడు జన్మదినం ఒకటే(అక్టోబరు 31). అందుకే.. ఆరడుగుల ఎత్తుతో, బలిష్టమైన దేహంతో బలమైన షాట్లతో విరుచుకుపడే సీకే నాయుడిని క్రికెట్లో ఉక్కుమనిషిగా అభివర్ణిస్తుంటారు.

సిక్సర్ తో స్వాగతం పలికాడు
ఇంగ్లాండ్ రాణి లార్డ్స్ మైదానం వచ్చినప్పుడుఆమెకు సిక్సర్ తో స్వాగతం పలికి .. బిగ్బాన్ గడియారం గ్లాస్ పగలగొట్టిన వీరుడు
సి కె నాయుడుబౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన. 1933లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుంచి “పద్మభూషణ్” అందుకున్నాడు.
నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్ లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. నాగపూర్ లో పెరిగిన ఈయన పాఠశాల రోజుల నుంచే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రధమ శ్రేణి క్రికెట్ ప్రవేశం 1916లో హిందూ జట్టు ద్వారా జరిగింది యూరోపియన్ జట్టుపై ఈ న తన తొలి అరంగేట్ర మ్యాచ్ ఆడాడు. హిందూ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగ్ కు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన విజయ యాత్ర తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.
ఆరు దశాబ్దాలపాటు “ఫస్ట్ క్లాస్ క్రికెట్” ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మాచ్‌లో 52 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు.సి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీ పట్టణంలోని తెలగ నాయుడు వర్గంవారు. అయితే, ఆయన తాత కొట్టారి నారాయణస్వామి నాయుడుకి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి నాయుడు తాత నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్ కు మారింది. చివరికి సి.కె.నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూర్ లో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె.ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరి రోజుల వరకూ సి.కె. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీథికి సి.కె. పేరు పెట్టారు. సి.కె.నాయుడు సోదరుడు సి.ఎస్.నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్.
ఈయన 1967, నవంబర్ 14న ఇండోర్‌లో మరణించాడు.