Maldives Tourism: అట్లుంటది భారతీయులతోని.. మాల్దీవులకు ఇప్పుడర్థమవుతోంది

Maldives Tourism ఎప్పుడైతే భారత్ మీద వ్యంగ్య వ్యాఖ్యలు చేశారో..అప్పుడే #notomaldives, #cancelmaldives అనే యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి.. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం నాలుక కరుచుకుని.. అలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులను తొలగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 31, 2024 8:20 am
Follow us on

Maldives Tourism: క్షవరం అయితేనే వివరం అర్థమవుతుందని ఓ సామెత ఉంటుంది. ఈ సామెత మాల్దీవుల(maldives) అధ్యక్షుడు ముయిజ్జుకు కళ్ళకు కడుతోంది. అతడికి మాత్రమే కాదు అక్కడి పర్యాటక సంస్థలకు, హోటళ్లకు, విమానయాన సంస్థలకు అవగతమవుతోంది. ప్రధానమంత్రి లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన తర్వాత.. ఆ ప్రాంతంలో వీడియోలు, ఫొటోలు తీసి “మీ తదుపరి పర్యటన లక్షద్వీప్ మాత్రమే కావాలి. మీకు సాహస క్రీడలంటే ఇష్టమైతే కచ్చితంగా లక్షద్వీప్ ప్రాంతాన్ని ఎంచుకోవాల”ని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఎప్పుడైతే ప్రధాని ఈ మాట అన్నారో.. అప్పుడే మాల్దీవుల ప్రభుత్వానికి కాలడం మొదలైంది. ఫలితంగా భారతదేశం మీద వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల్లాగా స్వచ్ఛమైన పర్యాటకాన్ని కొనసాగించడం భారత్ వల్ల కాదు అనే అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేశారు. భారత్ అనే పేరు మదిలోకి వస్తే పేడ వాసన వస్తుందని మాట్లాడారు. దీంతో దెబ్బకు మాల్దీవులపై భారతీయులకు కోపం వచ్చింది. ఆ కోపం తాలుకూ పరిణామాలను మాల్దీవులు ఇప్పుడనుభవిస్తోంది.

ఎప్పుడైతే భారత్ మీద వ్యంగ్య వ్యాఖ్యలు చేశారో..అప్పుడే #notomaldives, #cancelmaldives అనే యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి.. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం నాలుక కరుచుకుని.. అలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులను తొలగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు చాలామంది లక్షద్వీప్ పర్యటనకు వస్తున్నారు. గత 15 రోజులుగా ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. విమానాలు, రైళ్ళ ద్వారా పర్యాటకులు విపరీతంగా ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ ఉన్న వివిధ బీచ్ లు సందర్శకులతో కిటకిటడలాడుతున్నాయి. ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరగగా.. మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య పడిపోయింది. పర్యాటకానికి సంబంధించి ఒక సంస్థ చేసిన సర్వేలో గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలిసాయి. అప్పటివరకు భారత్ అగ్రస్థానంలో కొనసాగితే.. ఇప్పుడు అది ఐదవ స్థానానికి పడిపోయింది.. భారత్ నుంచి 13,989 పర్యాటకులు మాత్రమే మాల్దీవులకు వెళ్లారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో ఉంది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండవ స్థానానికి ఎదిగింది. చైనా 16,529, బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇక గత ఏడాది డిసెంబర్ 31 వరకు మన దేశం నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవుల ప్రాంతాన్ని సందర్శించారు.. అప్పట్లో ఈ దేశంలో మన పర్యాటక వాటా 11 శాతంతో భారత్ భారత్ అగ్ర స్థానం లో ఉండేది. రష్యా రెండు, చైనా మూడు, బ్రిటన్ నాలుగో స్థానం లో ఉండేవి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళటం.. అక్కడ ప్రాంతాలను ఫోటోలు తీయడం, సముద్రంలో మునిగి సాహస క్రీడను ఆస్వాదించడం.. వంటి వాటిని వీడియోలు తీయడం.. వాటిని ఆయన సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేయడం.. ఆ తర్వాత మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడటం.. అది ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన వివాదాలకు దారి తీసింది. ఫలితంగా మాల్దీవులు అంటేనే భారతీయులు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.. మన దేశం నుంచి పర్యాటకులు రాకపోవడంతో అక్కడ చాలా వరకు హోటళ్ళు, ఇతర విహార ప్రాంతాలు, విమానయాన సంస్థలు గిరాకీ లేక బోసిపోతున్నాయి. దౌత్య పరమైన వివాదాల నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పై అక్కడి ప్రతిపక్ష పార్టీలు అభిశంసన కు తెర లేపాయి. సంతకాల సేకరణ కూడా చేపట్టాయి.