India Vs West Indies 3rd ODI: భారత్ క్రికెట్ టీంకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఇన్నాళ్లు వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న టీం ఇండియా మరోసారి రీఛార్జ్ అయినట్లుంది. ఇందులో భాగంగానే తాజాగా వెస్టీండీస్ పై విజయం సాధించింది. అయితే ఇది మాములు విజయం కాదు. ఘనవిజయం అని చెప్పుకోవచ్చు..ఎందుకంటే భారత్ నిర్దేశించిన 351 లక్ష్యాన్ని వెస్టిండీస్ చేయలేకపోయింది. కేవలం 151 పరుగులకే భారత్ కట్టడి చేసింది. అటు బౌలర్లు సైతం విజృంభించారు. గతంలో కంటే టీమిండియా ఈసారి ఓ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లడంతోనే ఈ విజయం దక్కిందన్న చర్చ సాగుతోంది. ఆ వివరాల్లోకెళ్తే..
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలుచుకుంది. రెండో మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. దీంతో ఎప్పటిలాగే టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎలాగైనా కీలక మ్యాచ్ గెలవాలన్న కసితో టీం ఇండియా తీవ్ర కసరత్తు చేసింది. దీంతో ముందుగానే భారీ స్కోరు చేసి వెస్టీండీస్ ను భయపెట్టింది. ఇక ఆ టీంను లక్ష్యాన్ని చేరనీయకుండా కట్టడి చేసింది. మొత్తంగా టీం ఇండియా విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకుంది.
హార్దిక్ పాండ్యా సారథ్యంలో జరిగిన మూడో వన్డేలో ఇండియా టాస్ గెలిచింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఇందులో అత్యధికంగా శుభ్ మన్ గిల్ 92 బంతుల్లో 11 పోర్లతో సహా 85 పరుగులు చేశాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్ 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా 4 ఫోర్లు, 5 సిక్స్ లతో 70 రన్స్ చేసి అజేయుడు (నాటౌట్)గా నిలిచాడు. ఓ వైపు జట్టును సక్రమంగా నడిపిస్తూనే వ్యక్తిగతంగా ఎక్కువ రన్స్ చేసి పాండ్యా ప్రత్యేకంగా నిలిచాడు. ఆ తరువాత సంజూ శాంసన్ సైతం 41 బంతుల్లో 51 పరుగులు చేసి సపోర్టుగా నిలిచాడు.
ఇలా భారీ పరుగులు అందించడమే కాకుండా ఈ లక్ష్యాన్ని ఛేదించకుండా మన బౌలర్లు సైతం కట్టడి చేశారు. బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా 4 వికెట్లు తీసి విండీస్ ను మొదట్లోనే దెబ్బ కొట్టాడు. ఆ తరువాత ముఖేష్ కుమార్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. జయదేవ్ ఉనద్కత్ ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే గతంలో కంటే ఈసారి టీమిండియా కలిసికట్టగా ఆడి వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించింది. గత కొద్ది కాలంగా భారత్ కు సరైన విజయం లేదు. దీంతో క్రీడాభిమానులు నిరాశతో ఉన్నారు. ఈ తరుణంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రెకెటర్లు ఎలాగైనా గెలవాలన్న కసితో కప్ ను కొట్టారు.