https://oktelugu.com/

IND vs ENG 4 th Test : గిల్, ధృవ్ షాన్ దార్.. ఇండియా “తీన్” మార్

కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గిల్, ధృవ్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రూట్, హార్ట్ లీ చెరో వికెట్ తీశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 26, 2024 / 01:43 PM IST
    Follow us on

    IND vs ENG 4 th Test : ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3 -1 తో కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లు గెలిచి హ్యాట్రిక్ సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత జట్టు కొంత తడబాటుకు గురైంది. 84 పరుగుల వరకు ఒక్క వికెట్ పోకుండా ఆడిన భారత జట్టు.. ఇంగ్లాండ్ బౌలర్ బషీర్ దాటికి వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.. రజత్, సర్ఫ రాజ్, జడేజా వంటి బ్యాటర్లను బషీర్ పెవిలియన్ పంపించాడు. రజత్, సర్ఫ రాజ్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నారంటే బషీర్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ హార్ట్ లీ బౌలింగ్ లో కీపర్ స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి రూట్ బౌలింగ్లో అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టు.. మిగతా నాలుగు వికెట్లను 36 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం.

    రాంచీ మైదానం పై పగుళ్ళు నేపథ్యంలో స్పిన్నర్లకు సహకరిస్తుందని క్యూరేటర్లు ముందుగానే చెప్పారు. వారు చెప్పినట్టుగానే ఈ మైదానంపై ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్లు అశ్విన్, కులదీప్ 9 వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

    నాలుగో టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 307 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 145 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఈ విజయం ద్వారా టీమిండియా టెస్ట్ సిరీస్ దక్కించుకుంది. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గిల్, ధృవ్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రూట్, హార్ట్ లీ చెరో వికెట్ తీశారు.