India vs England 1st Test : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే మరీ.. ప్రతీ దేశంపైకి ‘బజ్ బాల్’ ఆటతో దండెత్తిన బ్రిటీషోళ్లు.. మన భారత్ లో మాత్రం తేలిపోయారు. మన స్పిన్ కు దాసోహమయ్యారు. ఇండియాలో కూడా బజ్ బాల్ ఆడుదామని ప్రయత్నించి బొక్కా బోర్లాపడ్డారు. తొలి 10 ఓవర్లు మన పేసర్ల బౌలింగ్ లో దంచికొట్టారు. కానీ ఎప్పుడైతే మన స్పిన్ ద్వయం వచ్చేసిందో అప్పుడే ఇంగ్లండ్ ఆటకట్టైంది.
సాధారణంగా ఇంగ్లండ్ కు బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాక.. కోచ్ గా బ్రెండన్ మెక్ కలమ్ వచ్చేశాక ఆ టెస్టు జట్టు ఆటతీరు మారిపోయింది. బజ్ బాల్ అంటూ టెస్టుల్లోనూ టీ20లా ఆడడం మొదలుపెట్టేశారు. ఆటగాళ్లంతా వికెట్లు పడుతున్నా దంచికొట్టి 300, 500 వరకూ స్కోరు చేసి ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించేవారు.
ఇలాగే ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లపై ఆడేసి ఇంగ్లండ్ జట్టు విజయాలు సాధించింది. కానీ అన్ని చోట్లా ఈ బజ్ బాల్ ఆట పనిచేయదని తేలింది. ముఖ్యంగా మన భారత ఉపఖండ స్పిన్ పిచ్ లపై బజ్ బాల్ ఆడుదామని ప్రయత్నించిన ఇంగ్లండ్ బొక్క బోర్లా పడింది. తొలి 10 ఓవర్లు తప్పితే టీమిండియాదే తొలి టెస్టులో ఆధిపత్యం.
ఇక బజ్ బాల్ ఆడుదామని వచ్చి స్పిన్నర్లకు దాసోహమైన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా షాకిచ్చింది. ముఖ్యంగా మన కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఏకంగా ఇంగ్లండ్ కే బజ్ బాల్ లా ఆడుతూ షాకిచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఆరంభం నుంచే దంచికొట్టాడు. వ్యూహాత్మకంగా స్పిన్ తోనే స్ట్రాట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
సాధారణంగా టెస్టుల్లో బాల్స్ ఎక్కువ.. పరుగులు తక్కువ ఉంటాయి.. కానీ తొలి 5 ఓవర్లలోనే రన్ రేట్ 7 దాటడం విశేషం. యశస్వి 24 బంతుల్లోనే 36 పరుగులకు పైనే చేశాడు. ఇక 70 బంతుల్లోనే 76 పరుగులు చేసి కుర్రాడు అదుర్స్ అనిపించేశాడు. మొత్తంగా బజ్ బాల్ ఆడుదామని ఇండియాకు వచ్చిన ఇంగ్లండ్ కు అదే బజ్ బాల్ తో ఇండియా షాకిచ్చింది. రివర్స్ పంచ్ ఇచ్చింది. తొలి టెస్టులో రేపు టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ పై పట్టుబిగించడం ఖాయం.
బజ్ బాల్ ఆటతో అటు జైస్వాల్, ఇటు రోహిత్ (24) రెచ్చిపోవడంతో తొలి రోజు టీమిండియా 23 ఓవర్లలోనే 119 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది.