U19 cricket World Cup : “కప్ వస్తుంది.. యువ ఇండియా గెలుచుకుంటుంది.. సీనియర్లకు ఎదురైన పరాభవాన్ని తీర్చుకుంటుంది” అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు అందరి మదిలో మెదిలిన మాట ఇది. కానీ ఆస్ట్రేలియా జట్టు ఆ మాటలను నీటి మూటలు చేసింది. కోట్లాది అభిమానుల ఆశలను వమ్ము చేసింది. సీనియర్ జట్టు లాగానే జూనియర్ జట్టు చెలరేగి ఆడి టీం ఇండియా యువజట్టును ఓడించింది. అండర్ 19 వరల్డ్ కప్ ను స్వదేశానికి సగౌరవంగా తీసుకెళ్లింది. ఏకంగా 79 పరుగుల తేడాతో భారత యువ జట్టును ఓడించింది. విశ్వవిజేతగా అవతరించింది. టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకు వచ్చిన భారత జట్టును ఒత్తిడికి గురిచేసి ఆస్ట్రేలియా తిరుగులేని ఆట తీరుతో అలరించింది.. గత ఏడాది నవంబర్ నెలలో జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఇలానే ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు వచ్చింది. లీగ్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా ను సైతం ఓడించింది. కానీ ఫైనల్ మ్యాచ్లో చేతులెత్తేసింది. అలాగే టీమిండియా యువ జట్టు కూడా ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం విశేషం.
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 253 పరుగులు చేసింది.. ఓపెనర్లు విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్జాస్ సింగ్(55), హ్యూజ్ వీబ్జేన్(48), ఒలివర్ పిక్(46 నాట్ అవుట్), హ్యారీ డిక్సన్(42) పరుగులు చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను కాపాడారు.. ఇక భారత బౌలర్లలో పేసర్ రాజ్ లింబాని మూడు వికెట్లు తీశాడు. నమన్ తివారి రెండు వికెట్లు తీశాడు. అనంతరం 254 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా యువ జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆదర్శ్(47), అభిషేక్ (42) మాత్రమే రాణించారు. బీర్డ్ మన్, మెక్ మిలన్ కు మూడేసి వికెట్లు తీశారు. వీడ్లెర్ కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బీర్డ్ మన్ నిలిచాడు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ మఫాకా నిలిచాడు.
254 పరుగుల లక్ష్యం మరీ అంత పెద్దది కాకపోయినప్పటికీ భారత యువ జట్టు దారుణంగా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది.. టెయిలెండర్ అభిషేక్ పోరాటం అభిమానుల్లో ఆశలు చిగురింపజేసినప్పటికీ.. అతడికి మరో బ్యాట్స్మెన్ నుంచి తోడ్పాటు లేకపోవడంతో ఇండియా ఆశలను దెబ్బతీసింది. అభిషేక్ మరో బౌలర్ తివారి (19) తో కలిసి తొమ్మిదవ వికెట్ కు అందించిన 46 పరుగులే ఇన్నింగ్స్ లో అత్యధికం అంటే భారత బ్యాటింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సిరీస్ లో భారత యువ బాటర్లు ఉదయ్, సచిన్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఫైనల్ కు ముందు జరిగిన అన్ని మ్యాచ్ లలోనూ వీర విహారం చేశారు. అయితే ఫైనల్ మ్యాచ్లో మీరు కనీసం 10 పరుగులైనా చేయలేకపోయారు. ముఖ్యంగా భారత ఓపెనర్ ఆదర్శ్ చాలా ఓపికను ప్రదర్శించాడు. అయితే మూడో ఓవర్ నుంచే భారత వికెట్ల పతనం మొదలైంది. అలా ప్రారంభమైన పతనం ఎక్కడా ఆగలేదు. పేసర్ బీర్డ్ మన్, సిన్నర్ మెక్ మిలన్ భారత జట్టు పతనాన్ని శాసించారు.. ఇక రెండవ వికెట్ కు ఆదర్శ్, ముషీర్ 37 పరుగులు జోడించి జట్టులో కొంత ఆశలు రేపారు. అయితే వీరు కూడా అవుట్ కావడంతో భారత జట్టు పీకలలోతు కష్టాల్లో కూలిపోయింది. ఒక దశలో భారత్ 122 పరులకు 8 వికెట్లు కోల్పోయి దారుణమైన ఓటమి అంచున నిలిచింది. ఈ నేపథ్యంలో అభిషేక్, తివారీ తొమ్మిది ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు.. దీంతో ఏదో ఒక మూలన జట్టుకు గెలుస్తామని ఆశలున్నాయి. అప్పటికి భారత జట్టు విజయానికి 57 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. ఆ దశలో అభిషేక్ ను ఆస్ట్రేలియా బౌలర్ వీడ్లర్ అవుట్ చేయడంతో భారత జట్టు పూర్తిగా ఆశలను వదిలేసుకుంది. ఇక ఈ కప్ తో ఆస్ట్రేలియా 4వ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. 253 పరుగులు చేసి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంతో యువ ఆటగాళ్లు నిరాశానిస్కృహల్లో కూరుకు పోయారు.