India Travel : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు జీవితాన్ని బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే సెలవులు, పండుగలు వచ్చిన సమయంలో బయట ప్రాంతాలకు టూర్లకు వెళ్లాలని భావిస్తుంటారు. అయితే మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన కట్టడాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ కట్టడాలు అప్పటి చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
తంజావూరు.. దీన్ని దేవాలయాల నగరంగా పిలుస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఓ అద్భుతమైన ప్రదేశంగా చెప్పబడే తంజావూరు చారిత్రక మరియు సాంస్కృతిక ఔచిత్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాజరాజ చోళుడు నిర్మించిన ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. తరువాత కేరళ రాష్ట్రం మలబార్ తీరం సమీపంలో ఉన్న కాలికట్.. దీన్నే కోజికోడ్ అని పిలుస్తారు. 1498లో వాస్కోడగామా రాకకు సాక్ష్యంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రశాంతమైన బీచ్ లు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.
ఆగ్రా.. ఇక్కడ ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్ మహల్ ఉంది. మొఘల్ సామ్రాజ్యం రాజధానిగా విరాజిల్లిన ఈ ప్రాంతంలో ఆగ్రా కోటా, ఫతేపూర్ సిక్రీ నగరం చారిత్రక వైభవాన్ని పెంచుతాయనడంలో అతిశయోక్తి లేదు. తరువాత పాట్నా…పూర్వం మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న పాటలీపుత్రనే ఇప్పటి పాట్నా. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుంది.
హంపి.. విజయనగర సామ్రాజ్యానికి కేంద్ర బిందువుగా ఉండేది. 15, 16వ శతాబ్దాలలో వాణిజ్య, కళాత్మక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అంతేకాదు సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలకు ప్రసిద్ధి గాంచింది. అనంతరం సోమనాథ్..ఇక్కడి సోమనాథ్ ఆలయం అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. పురాతన మూలాలను కలిగి ఉన్న ఈ నగరం.. వాణిజ్యం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
తరువాత అజ్మీర్.. ప్రారంభ కాలంలో చౌహాన్ రాజవంశం రాజధానిగా ఉన్న అజ్మీర్ తరువాత మొఘల్ రాజవంశానికి రాజధానిగా మారింది. అజ్మీర్ కు సమీపంలో పుష్కర్ అనే సరస్సు ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.