England vs India : ఇంగ్లాండ్ జట్టుపై స్వదేశంలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 4-1 ను తేడాతో భారత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత జట్టు ర్యాంకింగ్ స్వరూపమే ఒక్కసారిగా మారిపోయింది. టెస్ట్ ల్లో, WTC Rankings లో, వన్డే ల్లో, టీ -20 ల్లో భారత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇలా అన్ని రంగాల్లో మొదటి స్థానంలో కొనసాగుతూ అరుదైన ఘనతను భారత జట్టు లిఖించింది. తాజాగా ఈ నెంబర్ వన్ కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. దీంతో భారత జట్టులో ఆనందానికి అవధులు లేవు.
ఐసీసీ బుధవారం ఆటగాళ్ల వ్యక్తిగత టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో భారత జట్టుకు చెందిన ఏస్ స్పిన్నర్, వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బౌలర్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ ప్రథమ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.. టీం ఇండియా పేస్ గుర్రం బుమ్రా ను పక్కన పెట్టి మరి మొదటి స్థానాన్ని సాధించాడు.
అశ్విన్ మొదటి స్థానం సాధించడం ఇది ఆరవసారి. 2015 డిసెంబర్ మాసంలో తొలిసారి అతడు మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇక తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్ లో తన స్పిన్ మాయాజాలాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లకు రుచి చూపించాడు. 5 టెస్టుల సిరీస్ లో ఏకంగా 26 వికెట్లు నేలకుల్చాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అశ్విన్ తో పాటు కులదీప్ యాదవ్ కూడా ఈ టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫలితంగా అతని కూడా తన కెరియర్లో ఉత్తమ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం కులదీప్ యాదవ్ 15 స్థానాలు మెరుగుపరచుకొని 16 వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బుమ్రా మూడవ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ జట్టుపై జరిగిన రెండు టెస్టుల సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆటగాడు హేజిల్ వుడ్ బౌలింగ్ విభాగంలో రెండవ స్థానానికి ఎగబాకాడు.. కాగా, రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లోనే 500 వికెట్ల మైలురాయిని అధిగమించడం విశేషం.