India- Asia Cup 2022: అప్పుడెప్పుడో 2007లో టి20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ధోని సారథ్యంలో భారత జట్టు ట్రోఫీ అందుకుంది. పుష్కర కాలం దాటినా ఇంతవరకు మరొక కప్పు అందుకోలేదు. గతేడాది దారుణమైన ఆటతీరుతో కనీసం గ్రూప్ దశను కూడా దాటలేదు. గత తప్పులను పునరావృతం చేయకుండా కప్పు వైపు దూసుకెళ్తుంది అనుకుంటే.. ఆసియా కప్ లో అతి సాధారణ ప్రదర్శనతో ఆశలు, అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. సూపర్ _4లో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన భారత జట్టు ఫైనల్ చేరుతుందనుకోవటం అత్యాశే అవుతుంది. ఆసియా కప్ లో టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు ఇలా మధ్యలోనే నిష్క్రమించే పరిస్థితి రావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తూ క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

మిగిలింది 45 రోజులే
ప్రపంచ కప్ నకు 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ స్థితిలో ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో సత్తా చాటి భారత జట్టు ఆత్మవిశ్వాసం పెంచుకుంటుందని క్రీడాభిమానులు ఒక అవగాహనకు వచ్చారు. కానీ ఈ టోర్నీలో అభిమానుల ఆట తీరు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసేలా ఉంది. జట్టు, కూర్పు విషయంలో సెలెక్టర్లలో, టీం మేనేజ్మెంట్లో గందరగోళం పెరిగే పరిస్థితే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో నిలకడలేమి జట్టును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్లలో పట్టుదల, దృక్పథం లోపించినట్టు ప్రతీ మ్యాచ్ లోనూ స్పష్టం అవుతోంది. రోహిత్ శర్మ నుంచి భువనేశ్వర్ కుమార్ దాకా ఏ ఒక్కరూ నిలకడగా రాణించకపోవడం అభిమానులను ఆందోళన కలిగించే విషయం.
Also Read: Chiranjeevi- Pawan Kalyan: 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి కీలక నిర్ణయం
అన్ని విభాగాల్లోనూ..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడు విభాగాల్లోనూ టీం ఇండియా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో త్రిమూర్తులైన రోహిత్, రాహుల్, కోహ్లీ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. రోహిత్ శ్రీలంక పై బాగానే ఆడినా, అంతకు ముందు ఆడిన మ్యాచుల్లో నిరాశపరిచాడు. చాలా రోజుల నుంచి రోహిత్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడం లేదు. ఇక కోహ్లీ కూడా అతి కష్టం మీద పరుగులు చేస్తున్నాడు. లంకతో జరిగిన మ్యాచ్ లో మదు శంక లాంటి కొత్త బౌలర్ బంతికి విరాట్ అడ్డంగా బౌల్డ్ అవడం అభిమానులకు పెద్ద షాక్. గాయం కారణంగా చాలా రోజుల నుంచి జట్టుకు దూరమై ఆసియా కప్ టోర్నీలో పునరాగమనం చేసిన రాహుల్ గత లయ అందుకోలేకపోతున్నాడు. పాకిస్తాన్తో జరిగిన సూపర్ -4 మ్యాచ్లో అతడు కొంచెం మెరుగ్గానే కనిపించినా.. పూర్తిస్థాయిలో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక మిగతా మ్యాచ్ల్లో పూర్తిగా తేలిపోయాడు. మొత్తంగా చూస్తే టాప్ ఆర్డర్ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు తొలి మ్యాచ్ కే పరిమితం అయ్యాయి. రెండు మ్యాచ్ ల్లో అతడు బ్యాట్ తో, బంతి తో తేలిపోయాడు. దినేష్ కార్తీక్ గ్రూపులో తనకు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ రిషబ్ పంత్ జాగ్రత్త పడటం లేదు. నిర్లక్ష్యపు షాట్లతో ఔట్ అవుతున్నాడు. ఇక మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ.. కేవలం బలహీనమైన హాంకాంగ్ మీద మాత్రమే చెలరేగాడు. కీలక మ్యాచ్లో జట్టు ఆశలను నిలబెట్టలేకపోతున్నాడు.
బౌలింగ్ మరీ దారుణం
బమ్రా లేని ఫేస్ విభాగం సాధారణంగా కనిపిస్తోంది. ఫేస్ దళాన్ని ముందుండి నడిపించడంలో సీనియర్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలమవుతున్నాడు. డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తాడని పేరున్న అతను.. పాకిస్తాన్ తో జరిగిన సూపర్_4 మ్యాచ్ చివర్లో ఒకే ఓవర్ లో 19 పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆర్ష్ దీప్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఆవేష్ ఖాన్ అవకాశాలను ఉపయోగించుకోలేక తుదిజట్టులో కోల్పోయాడు. ప్రస్తుతం జట్టులో మిగతా పేసర్ల ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో షమీ లాంటి సీనియర్ వైపు మళ్లీ చూడాల్సి వస్తోంది. సీనియర్ బౌలర్లపై భారం ఎక్కువ అవుతోందని, అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ పేసర్ల వైపు మొగ్గుచూపితే.. వారు అవకాశాలను ఉపయోగించుకోలేకపోవడంతో షమిని తిరిగి జట్టులోకి తేవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో మ్యాచ్ ను మినహాయిస్తే స్పిన్నర్ చాహల్ ఈ టోర్నీలో ఆశించినంత మేర ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఫీల్డింగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. పాక్ తో జరిగిన మ్యాచ్లో అర్ష్ దీప్ తేలికైన క్యాచ్ వదిలేయడం మ్యాచ్ ను ఎలా మలుపు తిప్పిందో తెలిసిందే.

మార్పులు చేసినా ఏం ఉపయోగం?
గత ఏడాది ప్రపంచ కప్ వైఫల్యం తర్వాత జట్టులో యాజమాన్యంలో చాలా మార్పులు జరిగాయి. కెప్టెన్ మారాడు. కొత్త కోచ్ వచ్చాడు. కోహ్లీ స్థానంలో పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ మాత్రమే జట్టును నడిపించలేదు. గతంతో పోలిస్తే మ్యాచ్ లు పెరిగిపోయాయి. పని ఒత్తిడి, ఫిట్నెస్ సమస్య కారణంగా వేర్వేరు సిరీస్ లకు వేరువేరు కెప్టెన్లు సారథ్యం వహించారు. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలామంది కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చింది. ఈ ప్రయోగాల కారణంగా గత పది నెలల్లో టీం ఇండియా ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో సిరీస్ ఆడిందో చెప్పాలన్నా సమాధానం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. ఏ సిరీస్ లో ఎవరు జట్టును నడిపించారో, ఎవరెవరు ఏ స్థానంలో ఆడారో, అభిమానులకు అర్థం కాని గందరగోళం తలెత్తింది. తరచూ ఆటగాళ్ళను మారుస్తూ వెళ్లడంతో ఎవరూ జట్టులో పూర్తిస్థాయిలో కుదురుకోలేకపోయారు. అవకాశాలు అందుకున్న కుర్రాళ్ళల్లో మరీ గొప్ప ప్రదర్శన ఎవరూ చేయలేదు. దీంతో జట్టులో ఇప్పటికే ఉన్న సీనియర్లలో ఎవరినీ పక్కన పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా కప్పుకు వచ్చేసరికి చాలావరకు సీనియర్లను ఆడిస్తున్నారు. వాళ్లు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో అండర్ డాగ్ జట్లుగా ముద్రపడ్డ పాకిస్తాన్, శ్రీలంక మెరుగ్గా ఆడుతుండడం గమనార్హం. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు ఆపసోపాలు పడుతుండడం దారుణం. ప్రస్తుత ఆటగాళ్ల ఆట తీరును బేరిజువేసుకొని వచ్చే ప్రపంచ కప్ కైనా బలమైన జట్టును ఎంపిక చేయాలని క్రీడాభిమానులు కోరుతున్నారు
Also Read: Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్
[…] […]