TTD Hundi Income: నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. దండిగా శ్రీవారికి ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం శ్రీవారికి ఏడాది హుండీ ద్వారా 1,403 కోట్ల ఆదాయం సమకూరింది. అంతేకాదు రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా 100 కోట్ల దాకా ఆదాయం వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 3, 2024 11:20 am

TTD Hundi Income

Follow us on

TTD Hundi Income: వచ్చేవారు వస్తుంటారు. వెళ్లేవారు వెళ్తుంటారు. ఆ ఆలయానికి కట్టిన పచ్చతోరణం వాడి పోదు. ఆ నిత్య కళ్యాణ మంత్ర ఘోష ఆగదు. అది ఓ కలియుగ వైకుంఠం.. ఆ క్షేత్రంలో వెలసిన దేవుడే దేవుడు. ఆ స్వామికి జరిగే పూజలే పూజలు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ ఆ క్షేత్రం మహత్యం గురించి ఎంతయినా చెప్పొచ్చు. ఇంతకీ ఆ దేవాధిదేవుడు తిరుమల శ్రీవారు అని ఈ భూ మండలంలో భక్తులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరు వీధుల్లో వెలిసిన ఆ దేవుడు.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు.. అదే స్థాయిలో భక్తుల నుంచి కానుకలు పొందుతున్నాడు. కళ్యాణ కట్టలో సమర్పించే తలనీలాల నుంచి భక్తులు ఆత్రుతగా స్వీకరించే లడ్దూ ప్రసాదం వరకు..ప్రతీదీ స్వామి వారి ఖజానాకే వెళ్తుంది. ఇంతకీ స్వామివారి ఆదాయం ఈ ఏడాది ఎంత సమకూరిందంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం శ్రీవారికి ఏడాది హుండీ ద్వారా 1,403 కోట్ల ఆదాయం సమకూరింది. అంతేకాదు రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా 100 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబర్లోనే 116 కోట్ల ఆదాయం రావడం విశేషం. గత ఏడాది 2.54 కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 23 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించింది. ఈ పది రోజుల్లో 6,47,452 భక్తి భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా హుండీ ద్వారా స్వామివారికి 40.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక విరాళాలు, ఇతర మార్గాల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో దేవస్థానం ప్రకటించలేదు.

ఇక హుండీ ద్వారా ఆ స్థాయిలో ఆదాయాన్ని పొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం.. ధార్మిక కార్యక్రమాల కోసం కూడా భారీగానే ఖర్చుపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో స్వామివారి కోసం ప్రత్యేకంగా ఆలయాలు నిర్మిస్తోంది. రాష్ట్రాల్లో టిటిడి పేరుతో కళ్యాణ మండపాలు కూడా నిర్మిస్తోంది. శ్రీవారి ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్లను కూడా విక్రయిస్తున్నది. ప్రత్యేక పండగ రోజుల్లో స్వామివారి కల్యాణంలో కూడా నిర్వహిస్తోంది. ఏటికేడు భక్తులు పెరుగుతుండడంతో అదే స్థాయిలో సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. నిత్యాన్నదానంతో లక్షలాదిమంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నది.