https://oktelugu.com/

Reorganization Districts: మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ.. ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో?

తెలంగాణలో ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థను కూడా కేసీఆర్‌ సర్కార్‌ నిర్వీర్యం చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక జిల్లా అన్నట్లుగా జిల్లాలను విభజించిన కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ మీటింగులు జరిగినా, జిల్లా సమీక్ష సమావేశాలు జరిగినా వాటికి ప్రాధాన్యం లేకుండా చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 9, 2024 / 04:05 PM IST

    Reorganization Districts

    Follow us on

    Reorganization Districts: తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాజకీయ అవసరాల కోసం పది జిల్లాలో ఏర్పడిన తెలంగాణలో పాత జిల్లాలను చలువలు పలువలుగా చీల్చేసింది. పదికి అదనంగా 23 జిల్లాలు.. మొత్తం 33 జిల్లాలుగా మార్చేసింది. ఇక రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా జరిగింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై సమీక్ష చేయాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటలో జరిగిన లోపాలను సవరించి శాస్త్రీయంగా, పాలనా యోగ్యంగా జిల్లాలను విభజించాలని భావిస్తోంది.

    కొడుకు కోసం ఒకటి.. బిడ్డ కోసం ఇంకోటి.. లక్కీ నంబర్‌ కోసం మరోటి..
    తెలంగాణను పదేళ్లు పాటించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టింది. పాత 10 జిల్లాలను ఇష్టానుసారంగా అశాస్త్రీయంగా విభజించింది. కొడుకు కోసం ఒక జిల్లా.. బిడ్డ కోసం మరో జిల్లా.. తన లక్కీ నంబర్‌ కలిసి వచ్చేలా ఇంకో జిల్లా.. రాజకీయ అవసరాల కోసం కొన్ని.. ప్రతిపక్షాలను బలహీన పర్చేందుకు కొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి తెలంగాణలో అప్పటి వరకు 10 నుంచి 15 జిల్లాల డిమాండ్‌ మాత్రమే ఉంది. కానీ, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఏళ్లుగా డిమాండ్‌ ఉన్న జిల్లాలతోపాటు.. తన రాజకీయ అవసరాలు, ఇతర కారణాలతో మరో ఎనిమిది జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు.

    రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా..
    ఇక జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా అశాస్త్రీయంగా విభజించారు. డిమండ్‌ లేకపోయినా కేవలం రాజకీయ అవసరాల కోసమే మండలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదట 37 రెవెన్యూ డివిజన్లు ఉండగా వాటిని 74కు పెంచారు. క మండలాలు 464 ఉండగా, వాటిని 607కు పెంచేశారు. నాలుగైదు గ్రామాలను కలిపి కూడా ఒక మండలం ఏర్పాటు చేసేశారు. ఇక జిల్లాల విషయానికి వచ్చేసరికి ఒకటిన్నర, రెండు నియోజకవర్గాలను కలిపి జిల్లాలు ఏర్పాటు చేశారు.

    అస్యవ్యస్థంగా ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థ..
    ఇక తెలంగాణలో ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థను కూడా కేసీఆర్‌ సర్కార్‌ నిర్వీర్యం చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక జిల్లా అన్నట్లుగా జిల్లాలను విభజించిన కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ మీటింగులు జరిగినా, జిల్లా సమీక్ష సమావేశాలు జరిగినా వాటికి ప్రాధాన్యం లేకుండా చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రెండు మూడు జిల్లాల్లో కలిపి ఉండడంతో ఎమ్మెల్యే కూడా రెండు మూడు జిల్లాల్లో జరిగే సమావేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా వాటికి సరిపడా భవనాలు లేవు, పాత భవనాల్లో, అద్దె భవనాలతో నెట్టుకొస్తున్నారు. సిబ్బంది అంతంతే. వీటిపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌.. శాస్త్రీయంగా జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతోంది.

    జిల్లాలు ఎన్నవుతాయి?
    పది జిల్లాల తెలంగాణను సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6 వచ్చేలా 33 జిల్లాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కార్‌ శాస్త్రీయంగా పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేసే పునర్‌ వ్యవస్థీకరణలో ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో.. మొత్తంగా ఎన్ని జిల్లాలు ఉంటాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీలో మాదిరిగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతారా లేక మరేదైనా విధానాన్ని ప్రామాణికంగా తీసుకుని జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరిస్తారా అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.