Telangana Politics : కిషన్ రెడ్డి రాకతో…తెలంగాణ బీజేపీ డల్ అయ్యిందా?, రాహుల్ తిరిగి పార్లమెంటుకు రావడంతో కాంగ్రెస్ కు వైభవం సిద్ధించిందా? ఇవి చాలా క్లిష్టమైన ప్రశ్నలే. ఎందుకంటే వీటికి సమాధానం అంత ఈజీగా చెప్పలేం. గత పరిణమాలు భిన్నమైన ఫలితాలు ఇచ్చాయి కాబట్టి సానుకూల దృక్పథంతో సమాధానం చెప్పడం కష్టం. కిషన్ రెడ్డి గురించి చెప్పాలీ అంటే బీజేపీ లో పాత కార్యకర్తకు పైన లీడర్ ఎవరన్నది అవసరం లేదు. అసలు పట్టించుకోడు…ఏదో ఒకరోజు బాధో.. ఆనందమో పొందుతాడు కావచ్చు. రెండో రోజు నుంచి…మళ్లీ జనాల్లో గింగిరాలు తిరుగుతూనే ఉంటాడు. అతడికి పార్టీ ఒక వ్యసనం. కళ్ళ ముందు మస్తు మంది లీడర్లను చూసుంటాడు…చాలా సార్లు ఎమ్మెల్యే కేండిడేటు ఎవరో కూడా పట్టించుకోడు. అజెండా జీవితంలో జీర్ణించుకుపోయి..జెండా జీవితం అయిపోయి ఉంటుంది అతడికి నిరంతరం పార్టీ ఇచ్చిన కార్యక్రమం అతడ్ని నడిపిస్తూ ఉంటుంది.
లీడర్‌కు భయం ఉంటుంది
అందుకే బీజేపీలో లీడర్ అయినవాడికి కార్యకర్త అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఎక్కువసార్లు పార్టీ నాయకులు స్వార్థాన్ని జయించలేనప్పుడు…ఒంటరితనాన్ని అనుభవిం చడమే జరుగుతుంటుంది. ఎంతటి శిఖర సమాన నాయకుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే… అంతే వేగంగా అతడి జీవితం ఎడారి అయిపోతుంది. ఇక్కడ పార్టీ వ్యతిరేకత అంటే…దేశ వ్యతిరేకత గానే కనిపిస్తుంది. ఇందులో లేశమాత్రమైనా అనుమానం లేదు. వ్యక్తి జీవితం, పార్టీ జీవితం.. దేశం, ఒకే రేఖలో పరస్పర పూరకంగా నడిచే వ్యవస్థ ఈ బీజేపీది. ఈ వ్యవస్థ ను అవగాహన చేసుకోవడం కొత్తగా తమ అనయూయులతో పార్టీలో జేరిన వారికి కష్టంగానే ఉంటుంది. మిగిలిన పార్టీల్లో ఆ వ్యక్తి ఆధారంగానే …అతడు విదిల్చే పైసల బేస్ గానో కార్యకర్త నడుస్తూ ఉంటాడు. ఆ అలవాటు వల్ల ఇక్కడ ఇబ్బంది పడతాడు. అలా అని బీజేపీలో అందరూ పులుకడిగిన ముత్యాలు అని కాదు. ఒక రాజకీయ పార్టీలో, ఈ వ్యవస్థలో ఉండే అవలక్షణాలు కొన్నైనా ఉండకపోవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడమే కొంత ఇబ్బంది.
ఆపగలిగే శక్తి ఉండదు
ఒకసారి గానీ ఈ ప్రోగ్రాం సెట్ అయ్యిందా..ఇంక బీజేపీని ఆపగలిగే శక్తి ఏ పేపరోడికీ, ఆ పేపర్ మీద ఆధారపడిన కుల కుటుంబ పార్టీ ఓడికీ సాధ్యం కాదు. ఒక్కసారి అధికారంలోకి రావడమే కొంచెం కష్టం.. ఆ ఫీట్ గానీ సాధించిందా…ఇంక మిగతా రాజకీయ పార్టీలకు దిన దిన గండమే. సో…అక్కడ కిషన్ రెడ్డా…బండి సంజయా అన్నది రెండు మూడు రోజుల బాధే. ఆ తరువాత మళ్లీ పార్టీ జెండా, ఎజెండా, కార్యక్రమం…ఇదే కార్యకర్తకు మెయిన్. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడం, దేశ రక్షణకు చాలా ముఖ్యం అన్నది కార్యకర్తకు మనస్సులో ముద్రించుకు పోయిన చిత్రం. దాన్ని సాకారం చెయ్యడంలో నిమగ్నమై ఉండటం వల్ల లీడర్ ఎవడన్నది క్షణ కాలం ముచ్చటే…
నాలుగైనా, నలభై అయినా ఆయన చలువే
రాహుల్ ఎక్కడున్నా ఆయనే పార్టీ, అతడు పార్లమెంటులో ఉన్నా లేకున్నా అతడే ఆ పార్టీకి లీడర్. రేపు నలభై అయినా నాలుగు అయినా అతడి వల్లే వస్తాయన్నది ఆ పార్టీ లీడర్ల నమ్మకం. లీడర్ల ను నమ్ముకున్న కార్యకర్తలు, అతడు ఏదంటే అదే. పైన ఏదో ఒక బొమ్మ చూపించాలి కాబట్టి అదీ ఒక రకమైన మానసికతకు చాలా అవసరం కాబట్టి. ఆ బొమ్మను చూపించి ఆట ఆడేస్తూ ఉంటారు. నలభై సీట్లు, నాలుగు అయినా కింద కార్యకర్తకు ఫరక్ పడదు. అతడికి దక్కేది దక్కుతున్నంత వరకూ.. సో..కిషన్ రెడ్డి రాకతో తెలంగాణ బీజేపీ డల్ అయ్యిందా? రాహుల్ తిరిగి పార్లమెంటుకు రావడంతో కాంగ్రెస్ కు వైభవం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చాలా ఈజీ.