Crime News : సంసారం ఒక చదరంగం.. 80వ దశకంలోనే సంపారంలో ఒడిదుడుకుల గురించి సినిమా తీశాడు ఓ సీనియర్ డైరెక్టర్ . తాజాగా సంసారం ఒక చదరంగం టైటిల్‌తో సినిమా కూడా వచ్చింది. ఇది కూడా వైవాహిక జీవితం, కుటుంబంలో వచ్చే సమస్యలు వాటిని ఎదుర్కొనే తీరుపైనే దర్శకుడు సినిమా తీశాడు. కాపురం అన్నాక కలహాలు కామన్. కష్టాలు, సుఖాలను సమానంగా ఎదుర్కొంటేనే సంసార సాగరంలో జీవిత నావా సాఫీగా సాగిపోతోంది. సుడిగుండాలు వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ వాటిని ఎదుర్కొంటే ఈజీగా ఒడ్డుకు చేరతారు. ఇది ఎన్నో సినిమాలు, పుస్తకాల్లో రాశారు.
సీతమ్మ.. రాముడే తన సర్వస్వం అని నమ్మింది కాంట్టే.. రాణి అయినా.. రాముడి వెంటే అడవులకు వెళ్లింది. రావణుడి చెర నుంచి బయటపడింది. దేవుడైనా.. జీవుడైనా కాపురంలో కలహాలు ఉంటాయి. అందుకే ‘చీకట్లో ఉన్నా.. వాకిట్లో ఉన్నా.. కంటికి రెప్పులె కాస్తడు మొగుడు’ అంటూ ఓ సినీ రచయిత రాసిన పదాలు ప్రతీ మహిళ హృదయాన్ని టచ్ చేశాయి. ఇదంతా ఎందుకంటే.. ‘అతనితో కలిసి జీవించలేను, అతడు లేకుండా జీవించలేను’ అనే క్లాసిక్ కేసులో గుజరాత్‌కు చెందిన ఓ మహిళ తన పదేళ్ల సంపార జీవితంలో వివిధ కారణాలతో భర్తను ఏడుసార్లు జైలుకు పంపింది. ట్విస్ట్ ఏమిటంటే అరెస్ట్ అయిన ప్రతీసారి తనే మళ్లీ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అంశం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఏం జరిగిందంటే..
గుజరాత్‌లోని పటాన్‌కు చెందిన ప్రేమ్‌చంద్ మాలీకి మెహసానాకు చెందిన సోను మాలీతో 2001లో వివాహమైంది. వీరు కాడిలో స్థిరపడ్డారు. జీవితం మొదట్లో చాలా ప్రశాంతంగా ఉండగా, 2014లో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సోనూ 2015లో ప్రేమ్‌చంద్‌పై గృహహింస కేసు పెట్టింది. దీంతో బాధితురాలికి నెలకు రూ.2 వేల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రోజువారీ కూలీగా పనిచేసే ప్రేమ్‌చంద్ ఏడాదిపాటు భరణం చెల్లించాడు. తర్వాత ఇబ్బంది పడ్డాడు. దీంతో సోను మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆ తర్వాత అరెస్టయి ఐదు నెలలు జైలు జీవితం గడిపాడు.
ఎవరూ లేకపోవడంతో..
ప్రేమ్‌చంద్‌కు జీవితంలో మరెవరూ లేరు. దీంతో సోనూ అతని గ్యారెంటర్‌గా ముందుకు వచ్చి అతనికి బెయిల్ ఇచ్చింది. చట్టబద్ధంగా విడిపోయినప్పటికీ, ఈ జంట కలిసి జీవించడం కొనసాగించారు. తరచూ వాగ్వాదాలకు దిగారు. 2016 నుంచి 2018 వరకు ప్రతీ సంవత్సరం సోనును గాయపర్చాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రేమ్‌చంద్‌ను పోలీసుల మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రతిసారీ, ఆమె జోక్యం చేసుకుని అతని బెయిల్‌కు ఏర్పాట్లు చేస్తుంది.
భరణం చెల్లించకపోవడంతో..
ఇక 2019, 2020లో ప్రేమ్‌చంద్ రెండు వేర్వేరు సందర్భాలలో భరణం చెల్లించడంలో విఫలమయ్యాడు, ఇది మరో రెండు సందర్భాలలో జైలు శిక్షకు దారితీసింది. మరోసారి, సోను రక్షకుడిగా నిలిచి తమ అల్లకల్లోలమైన జీవన విధానాన్ని పునఃప్రారంభించారు.
2023 ప్రారంభంలో వారు తమ కాడి ఇంట్లో స్థిరపడ్డారు. ఈ ఏడాది కూడా భరణం చెల్లింపుల విషయంలో ప్రేమ్‌చంద్ మళ్లీ విఫలమయ్యాడు. దీంతో కోర్టు మళ్లీ అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. సోను జూలై 4న మరోసారి బెయిల్ ఇచ్చి భర్త బెయిల్‌పై విడుదలయ్యేలా సహకారం అందించింది.
ఒక్క రోజులోనే మళ్లీ అరెస్ట్..
అయితే, వారి కలయిక స్వల్పకాలికం. జూలై 5న ప్రేమ్‌చంద్ తన పర్సు, సెల్‌ఫోన్ పోయాయని భార్య సోనును ప్రశ్నించాడు. ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఇద్దరూ గొడవ పడ్డారు. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వారి 20 ఏళ్ల కుమారుడు రవి కూడా ప్రేమ్‌చంద్‌పై బ్యాట్‌తో దాడి చేశాడు. తర్వాత సోను తన కళ్లలో ఎర్ర కారం చల్లాడని ఆరోపిస్తూ ప్రేమ్‌చంద్‌పై కడి పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనతో విసుగు చెందిన ప్రేమ్‌చంద్ భార్య, కొడుకును వదిలి పటాన్‌లోని తన తల్లి వద్దకు వెళ్లాడు. జూలై 7న తనను తన భార్య సోను, కొడుకు రవి వేధిస్తున్నారని, దాడిచేశారని పటాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇలా పదేళ్లుగా కలహాల కాపురం రేస్తున్న ప్రేమ్‌చంద్, సోను మళ్లీ కలుస్తారో లేదో చూడాలి.