Pawan Kalyan : రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న కాపులకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలు నామమాత్రపు పదవులను కట్టబెట్టి వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నాయి. అయితే కాపులకు కావాల్సింది పదవులు కాదని, రాజ్యాధికారమని అనేకమంది కాపులు భావిస్తున్నారు.. అయితే ఆ రాజ్యాధికారం సాధించే దిశగా ఏకీకృతమైన ప్రయత్నాలు సాగకపోవడం వలన రాజ్యాధికారకాంక్ష నెరవేరడం లేదు.
కొన్నేళ్ల కిందట రంగా రూపంలో ఆకాంక్ష నెరవేరుతుందని భావించినప్పటికీ ఆయన మరణంతో ఆ ఆశలను కాపులు వదులుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోను పెద్ద ఎత్తున కాపులు ఏకీకృతమై సీఎం పీఠం లక్ష్యంగా అడుగులు వేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడం, ఆ తరువాత పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేయడం తదితర కారణాలతో మళ్ళీ కాపులు రాజ్యాధికార కాంక్షను వదులుకున్నారు. తమకు అవకాశాలు ఇచ్చే పార్టీలవైపు మొగ్గు చూపి చేరిపోయారు.
అయితే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మళ్లీ కాపు నేతలు, కాపుల్లో ఆ కోరిక మరోసారి పునరుత్తేజితం పొందింది. ఒకప్పుడు రంగా, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు కాపుల్లో కలిగిన బలమైన కోరిక.. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనతో బలంగా వినిపిస్తోంది.