ICMR Study : కరోనా, కోవిడ్ 19 ఈ పేరు వింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. చైనాలో మొదటగా ఈ వ్యాధి గురించి బయటకు వచ్చినప్పుడు పట్టించుకోలేదు ఇతర దేశాలు. కానీ మెల్లమెల్లగా ఇతర దేశాలకు పాకుతుంటే అందరిలోనూ గుబులు మొదలైంది. దీంతో వెంటనే ఐక్యరాజ్యసమితి కూడా అలర్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక దేశాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ మస్ట్, శానిటైజర్ బెస్ట్ అంటూ ప్రచారం చేశారు. లేదంటే ఫైన్ లు వేశారు. ఇలా కరోనా సృష్టించిన కల్లోలం మామూలుగా లేదు. ఇదిలా ఉంటే కరోనా ఇండియాలో మొదట్లో ఒకరిద్దరికి మాత్రమే వచ్చింది. కానీ ఆ తర్వాత మన దేశంలో కూడా అందరికీ పాకిపోయింది.
జలుబు, దగ్గు ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయంతో వణికిపోయారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఉద్యోగస్తులు, కూలీలు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు.అయితే ఈ వైరస్ ను అంతం చేయాలని ఎన్నో విధాలుగా ఆలోచించినా ప్రభుత్వాలు చివరకు వాక్సినేషన్ ప్రక్రియను మొదలు చేశాయి. మొదటి డోస్, రెండవ డోస్ అంటూ ఉచిత వైద్య సేవలను అందించాయి. దీని వల్ల కరోనా రాకుండా నియంత్రించగలిగారు. ఇక లాక్ డౌన్ ఉన్నా కూడా దగ్గరున్న సెంటర్లకు వెళ్లి ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ లను తీసుకున్నారు.
వాక్సిన్ తీసుకునే సమయంలో కూడా చాలా మందిలో ఎన్నో అనుమానాలు ఉండేవి. అయితే ప్రస్తుతం కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని.. అకస్మాత్తుగా చనిపోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ పుకార్లు అన్నింటికి చెక్ పెట్టింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇటీవల కాలంలో యువతలో వస్తున్న ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ సడన్ డెత్ లు వ్యక్తిగత కారణాల వల్లే జరుగుతున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అంతే కాదు ఈ వ్యాక్సిన్ డోస్ ఒకటి తీసుకున్నా కూడా మరణాల రిస్క్ తగ్గుతుందని తెలిపింది.
18-45 వయసున్న గ్రూపుల వారిపై అధ్యయనం చేయగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సహ అనుబంధ వ్యాధులు, సడన్ డెత్ లు గుర్తించలేదని ధ్రువీకరించింది. అయితే 729 కేసులు, 2, 916 పర్యవేక్షణలను పరీక్షించగా ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ మరణాలకు ధూమపానం, తీవ్ర శ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, వివిధ ఆహారపు అలవాట్లు కావచ్చని స్పష్టం చేసింది.