AP CM Jagan : వైసీపీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. గత ఎన్నికల ముందు ఇదే మాదిరిగా చాలామంది అధికారులు వైసీపీకి సేవలు అందించారు. పార్టీ అధికారంలోకి రావడంతో వారికి ఉన్నత కొలువులు దక్కాయి. మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సలహాదారుడి పదవిలో ఉన్నారు. ఆయన బాటలోనే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఉన్నారు. జనంలోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన వలవన్ ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నారు. పది రోజుల కిందటే ఆయన నియమితులయ్యారు. దీని వెనక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు సమాచారం.
కరికుల వలవన్ తిరుపతి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ ప్రస్థానానికి అనువుగా ఉండేలా టీటీడీ బోర్డులో ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా కొనసాగేలా దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి దక్కించుకున్నారని సమాచారం.
ఆగస్టు నెలాఖరులో కరికుల వలవన్ పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఇప్పుడున్న పోస్ట్ లోనే ఏడాది పాటు కొనసాగేలా జగన్ సర్కార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉంటూ తిరుపతిలో రాజకీయ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం దొరికింది.