https://oktelugu.com/

Hyderabad woman : అన్ని ఆధారాలు చెరిపేసి భర్తను వదిలేసి వెళ్లిన మహిళ.. ఐదేళ్లకు ఆధార్ అప్డేట్ తో పట్టేసిన హైదరాబాద్ పోలీసులు

సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆమె స్వచ్ఛందంగా తన ఇంటిని విడిచిపెట్టినట్లు గుర్తించారు. కానీ ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2023 12:11 pm
    women missing

    women missing

    Follow us on

    Hyderabad woman : ఐదేళ్ల క్రితం అదృశ్యమైన ఓ మహిళ గుట్టును అత్యాధునికి సాంకేతికత సహాయంతో హైదరాబాద్‌ పోలీసులు తేల్చేశారు. ఆసక్తికరమైన కేసులో, తెలంగాణ మహిళా భద్రత విభాగం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అదృశ్యమైన మహిళ పూర్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన రహస్యాన్ని కనిపెట్టారు.

    2018లో అదృశ్యం..
    హైదరాబాద్‌లో ఓ సంపన్న కుటుంబానికి చెందిన 36 ఏళ్ల వివాహిత, 2018, జూన్‌ 29న నగరంలోని హుమాయున్‌ నగర్‌లో కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె మతంతోపాటు తన డిజిటల్‌ ఆధారాలను కూడా మార్చుకుంది. దీంతో ఎవరూ గుర్తుపట్టకుండా అన్ని ఆధారాలను చెరిపేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. మరో వ్యక్తిని వివాహం చేసుకుని మహారాష్ట్రలోని ఒక ఎన్జీవోతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

    హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌..
    ఇదిలా ఉండగా మహిళ అదృశ్యంపై ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మొదట ఆమె భర్తతో వివాదం కారణం అయి ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఆమె తన ఆధార్‌ కార్డ్‌ను అప్‌డేట్‌ చేసినట్లు గుర్తించడంతో ఆమె భర్తకు అదృశ్యంతో సంబంధం లేదని గుర్తించారు.

    కొత్త జీవితం ప్రారంభించినట్లు గుర్తింపు..
    ఫేషియల్‌ రికగ్నేషన్, డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ టెక్నిక్‌లను ఉపయోగించి అదృశ్యమైన మహిళ కొత్త జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెను గోవాలో ట్రాక్‌ చేశారు.

    డిజిటల్‌ టెక్నాలజీ సహకారంతో..
    మహిళను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు, విచారణ వివరాలు, సాంకేతికత గురించి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్, మహిళా భద్రతా విభాగం శిఖా గోయెల్‌ వెల్లడించారు. ‘డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించి మేము చాలా మంది తప్పిపోయిన వ్యక్తులను గుర్తించాము, అయితే ఈ కేసు ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రారంభంలో, కొనసాగుతున్న వివాదాల కారణంగా మేము కుటుంబ సభ్యులను అనుమానించాం. కానీ ఇది కొత్తగా ప్రారంభించడానికి ఒకరి డిజిటల్‌ మరియు వ్యక్తిగత గుర్తింపును చెరిపివేసినట్లు తేలింది’ అని వెల్లడించారు.

    అడ్రస్‌ దొరకకుండా.. ఆధారాలే లేకుండా..
    ఐదేళ్ల క్రితం మహిళ అదృశ్యమైన ఘటనలో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా తన మొబైల్‌ ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయింది. 2014, 2015లో తన భర్తతో విభేదాలు తలెత్తి రెండుసార్లు కనిపించకుండా పోవడం ఆమెకు ఇది మొదటి సారి కాదు. రెండుసార్లు వెళ్లిపోయి తిరిగి వచ్చింది. 2018లో మాత్రం వెళ్లి తిరిగి రాలేదు. భర్త వేధింపుల వల్లే ఆమె కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి వరకట్న వేధింపుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

    స్వచ్ఛందంగా వెళ్లిపోయి..
    సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆమె స్వచ్ఛందంగా తన ఇంటిని విడిచిపెట్టినట్లు గుర్తించారు. కానీ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో 2019లో, ఆమె తండ్రి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది మహిళా భద్రతా విభాగం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నుంచి సహాయం కోరాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

    చాలెంజ్‌గా తీసుకుని..
    మహిళా భద్రత విభాగం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ.. ‘ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ క్యాబ్‌ బుక్‌ చేసేందుకు ఆమె మరో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించినట్లు ఆమె స్నేహితుల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు. క్యాబ్‌ కంపెనీతో ఆమె వాయిస్‌ రికార్డింగ్‌ ఆధారంగా ఆమె మహారాష్ట్రలోని పూణేకి వెళ్లినట్లు గుర్తించాం. అయితే అక్కడ ఆమె తన ఫోన్‌ అమ్మేసింది. దీంతో దర్యాప్తుకు ఆటంకం ఏర్పడింది. కరోనాతో మరింత క్లిష్టంగా మారింది.

    ఆధార్‌ అప్‌డేట్‌..
    ఈ క్రమంలో ఆమె ఆధార్‌ కార్డు గత నెలలో నవీకరించబడింది. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్‌ టీం గుర్తించింది. దీంతో దర్యాప్తులో పురోగతి వచ్చింది. అప్‌డేట్‌లో ఆమె తెలుగు నుంచి మరాఠీకి మార్పు మరియు ఆమె మతం, భర్త పేరులో మార్పులు ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా ఆమె బ్యాంక్‌ ఖాతా వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత డిజిటల్‌ పరిశోధన సోషల్‌ మీడియాలో ఆమె కొత్త గుర్తింపును వెలికితీసింది. ఈ క్రమంలో ఆమె గోవాలో ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లు సూచించాయి. ఆమె సామాజిక సేవలో పాల్గొంటుందని నిర్ధారించారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఉపయోగించి చివరకు ఆమెను గోవాలో గుర్తించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు హాజరైన సమయంలో, ఆమె తనకు తానుగా ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె కొత్త భర్తకు కూడా ఆమె గురించిన పాత వివరాలు తెలిశాయి.