Dr Sivaranjani Santosh ORS case :సాధారణంగా కార్పొరేట్ శక్తులతో తలపడాలంటే ఎవరైనా వెనుకాడతారు. కానీ, తన ముందున్నది లాభాపేక్ష కలిగిన కంపెనీలు కాదు.. పసిబిడ్డల ఆరోగ్యం అని నమ్మిన ఒక వైద్యురాలు ఎనిమిదేళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేశారు. ఆమే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్.
పోరాటం దేనికోసం?
మార్కెట్‌లో ORS (Oral Rehydration Salts) పేరుతో విక్రయిస్తున్న అనేక పానీయాలు కేవలం చక్కెర నీళ్లని, అవి WHO ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆమె గుర్తించారు. తప్పుదోవ పట్టించే ఈ లేబులింగ్ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులకు సరైన వైద్యం అందడం లేదని ఆమె గళమెత్తారు. సోషల్ మీడియా అవగాహన నుంచి హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేసే వరకు ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె పోరాట ఫలితంగానే FSSAI కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ కంపెనీ పడితే అది ‘ORS’ అనే పదాన్ని వాడకూడదని, ఒకవేళ వాడితే అది ‘WHO ఫార్ములా కాదు’ అని స్పష్టంగా ముద్రించాలని నిబంధన తెచ్చింది.
కక్షసాధింపు చర్యలు.. వెల్లువెత్తుతున్న మద్దతు
ఈ చారిత్రాత్మక విజయాన్ని జీర్ణించుకోలేని కొన్ని ఫార్మా కంపెనీలు ఆమెను లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నాయి. అయితే ఈ అన్యాయాన్ని దేశవ్యాప్త వైద్య సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.”ఒక వైద్యురాలిగా రోగుల భద్రత కోసం మాట్లాడటం ఆమె బాధ్యత. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు.” FAIMA మద్దతుగా నిలిచింది.
వైద్య సంఘాల హెచ్చరిక
HRDA, జుడా, తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు శివరంజని పూర్తి మద్దతు ప్రకటించాయి. వెంటనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించాయి.
నిజాయితీతో చేసే పోరాటం ఎప్పుడూ ఒంటరిది కాదు. డాక్టర్ శివరంజని సంతోష్ సాధించిన విజయం కేవలం ఆమెది మాత్రమే కాదు.. దేశంలోని కోట్లాది మంది తల్లుల నమ్మకానిది, పసిబిడ్డల ఆరోగ్యానిది. కార్పొరేట్ శక్తుల బెదిరింపులకు లొంగని ఆమె ధైర్యం సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి.