Hyderabad Floods: విశ్వనగరం.. చినుకు పడితే నరకం.. హైదరాబాద్‌ దుస్థితికి కారణం ఏంటి?

హైదరాబాద్‌ డెక్కన్‌ రీజియన్‌లో ఉంది. ఇక్కడ వాటర్‌ ఒకే డైరెక్షన్‌లో రాదు. అన్ని డైరెక్షన్స్‌లో ఫ్లో అవుతుంది. అందువల్లే 1908 లో మూసీ ఫ్లడ్స్‌ వచ్చాయి.

Written By: NARESH, Updated On : July 26, 2023 11:55 am

Hyderabad Floods

Follow us on

Hyderabad Floods: వానపడితే అందరికీ ఆనందం ఉంటుంది. పంటలకు ఊపిరి పోస్తుంది. ఎంతోమందికి వానలు ఉపాధినిస్తాయి. కానీ హైదరాబాద్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వర్షం కురిస్తే నగరవాసులు అల్లాడిపోతున్నారు. చినుకు పడితే వెన్నులో వణుకు పుడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరం మొత్తం నదిని తలపిస్తుంది. కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలన్నీ రోజుల తరబడి నీటిలో ఉండాల్సిన దుస్థితి. చిన్నపాటి వర్షం పడినా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. వాహనాలు ముందుకు కదలలేక ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. వర్షానికి నగరం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిసార్లు గంట ప్రయాణం 6 గంటలు పడుతుందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

నీరంతా రోడ్ల పైకి..
హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం వర్షం నీరు వెళ్లేందుకు మార్గం చూపలేకుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం చెరువులను ఆక్రమించడమే. కనుమరుగైన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. దీంతో చెరువుల్లోకి పోవాల్సిన నీరంతా రోడ్లపై చేరుతుంది. స్థానిక సంస్థలు, అధికార యంత్రాంగం, ప్రజల ఉమ్మడి అలసత్వంతో సిటీలోని చెరువులు ఉనికిని కోల్పోయాయి. లేక్స్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు అసలు లేక్సే కనిపించడం లేదు. కొన్నేళ్లకు ఉన్నవి కూడా కనుమరుగు కావడం ఖాయం.

పదేళ్ల క్రితమే హెచ్చరిక..
నగర అభివృద్ధి నమూనాలో అధ్వానమైన విధానాలతో సిటీ మునుగుతోంది. ప్రకృతి సంపద, పర్యావరణం దెబ్బ తినడంలో పాలకవర్గాల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. నగర పరిధిలోని చెరువు గుర్తింపు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ కోసం లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని క్రితం హైకోర్టు పదేళ్ల క్రితం ఆదేశించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కమిటీ చెరువుల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్‌ ఆక్రమణలు అరికట్టడం, సుందరీకరణ బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వంతో చెరువులు కనుమరుగైనా పట్టించుకునేనాథులు లేకుండా పోయారు.

3,132 చెరువులకు మిగిలింది వెయ్యే…
హెచ్‌ఎండీఏ పరిధిలో 3132 చెరువులు, జీహెచ్‌ఎంసీ చెరువులో పరిధిలో 189 చెరువులు ఉన్నాయి. మొత్తం 3132 చెరువులకు గాను 1000 చెరువులను మాత్రమే లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ గుర్తించింది. ఈ వెయ్యి చెరువుల్లోనూ 224 చెరువులకు మాత్రమే కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 189 చెరువుల్లో 50 చెరువుల ఎఫ్‌టీఎల్‌ను కమిటీ గుర్తించింది. సిటీ వ్యాప్తంగా చాలా చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీ బిల్డింగ్‌లు వెలుస్తున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తుల ఆక్రమణలపైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

కాలువలు కనుమరుగు..
నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో చెరువులలోకి వరద నీటిని తీసుకొచ్చే ఫీడర్‌ ఛానళ్లు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల నిర్మాణాలు, నివాసాల నుంచి మురుగు నీటి ప్రవాహం మాత్రమే చెరువుల్లోకి ప్రవహిస్తోంది. దుర్గం చెరువు చుట్టూ పెద్దఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలిశాయి. వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు చెరువులోకి వదులుతున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు చెరువు నిండిపోయి మురుగు నీరు రోడ్లపైకి వచ్చి నిలుస్తోంది. చెరువుల అభివృద్ధి పేరిట జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పనులు కూడా లేక్స్‌ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చెరువుల్లోకి నీటి ప్రవాహాన్ని పెంచేలా చూడాల్సిన పాలకవర్గాలు.. చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మిస్తున్నాయి.
నీరు పోయే దారేది?
జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురికి కాలువలు, వర్షపునీటి కాలువలు ఉన్నాయి. వీటిలో 216 మేజర్‌ నాలాలు, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్‌లైన్‌ డ్రెయిన్‌లు, చిన్న సైజు డ్రెయిన్‌లు ఉన్నాయి. ఈ నాలాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యాయి. ఫలితంగా నీరు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ఇబ్బంది కలుగుతోంది. సిటీలో ఆక్రమణకు గురైన నాలాల్లో 840 బాటిల్‌ నెక్‌లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 506 చోట్ల విస్తరణ చేపట్టారు.

సామర్థ్యం తక్కువ..
మరోవైపు నగరంలో వర్షపు నీటి డ్రెయిన్ల సామర్థ్యం అవసరానికి సరిపడా లేవు. హైటెక్‌ సిటీ, పరిసర ప్రాంతాల్లో సెంటీ మీటర్ల వర్షం కురిసినా రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 3 సెంటీమీటర్ల వర్షపు నీటిని తీసుకునే సామర్థ్యం కలిగిన డ్రెయిన్లు ఉన్నాయి. డ్రెయిన్లలో చెత్తా చెదారం పేరుకుపోయింది. ప్రైవేటు సంస్థలు అక్రమంగా కేబుళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా నీరు వెళ్లలేక రోడ్లపైనే నిలుస్తోంది. హైటెక్‌ సిటీ ఏరియాలో రియల్‌ బూమ్‌తో బర్లకుంట, తుమ్మిడికుంట, దుర్గం చెరువు, పటేల్‌ చెరువు, మల్కం చెరువు, కాజాగూడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు విధ్వంసానికి గురి కావడంతో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది.

30 ముంపు ప్రాంతాలు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 ముంపు ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హబ్సీగూడ(మోడర్న్‌ బేకరి), నాగోల్‌(ఆదర్శ నగర్‌ కాలనీ), మలక్‌పేట్‌ (ఆర్‌యూబీ), యాకుత్‌పురా(ఆర్‌యూబీ), చాంద్రాయణ్‌గుట్ట (వలీ ఫంక్షన్‌ హాల్‌), న్యూఅఫ్జల్‌ నగర్, దత్తాత్రేయ కాలనీ (న్యూ బైటెక్‌ రోడ్‌), కరోల్‌ బాగ్, టోలీ చౌకీ(హెచ్‌ఎస్‌ రెసిడెన్సీ), నదీమ్‌ కాలనీ కల్వర్ట్, జమాలీకుంట ఔట్‌లెట్, బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట, రంగ్‌ మహల్, లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌజ్, ఎంఎస్‌ మక్తా, బల్కంపేట్‌ ఆర్‌యూబీ, విల్లా మేరీ కాలేజీ ఎదురుగా, షేక్‌పేట్‌ ఆదిత్య టవర్, షేక్‌పేట్‌ వివేకానంద నగర్, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44, మాదాపూర్‌ నెక్టార్‌ గార్డెన్, శిల్పారామం బస్టాప్‌ ముందు, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌ హఫీజ్‌పేట్‌ ఫ్లైఓవర్‌ దగ్గర, మాదాపూర్‌ డొమినోస్‌ రోడ్, నింబోలి అడ్డ, యూనివర్సల్‌ స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి షిర్డీనగర్‌ వరకు, ఒలిఫంట బ్రిడ్జి, కర్బలా మైదాన్ సమీపంలో, రాణీగంజ్‌ బాంబే హోటల్‌ ముందు వర్షం పడినా ప్రతిసారి నీరు నిల్వ ఉంటుందని జీహెచ్‌ఎంసీ స్పష్టంచేసింది. ఈ ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపలేమని కూడా తేల్చిచెప్పింది.

సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
‘గొలుసు కట్టు చెరువుల లింక్‌లు తెగ్గొట్టేశారు. రాత్రికి రాతి చెరువులు ఇండ్ల జాగాలైనయ్‌. ఇప్పుడు భారీ వానలకు హైదరాబాద్‌ లాంటి మహానగరమే మునుగుతోంది. చెరువుల కబ్జాలు అడ్డుకొని ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. రాష్ట్రంలోని చెరువుల కబ్జాలు తొలగించే చర్యలు తీసుకోండి. కఠినంగా ఉండాలి. కొరడా ఝళిపించాలి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇప్పుడైనా కోఆర్డినేషన్‌తో పనిచేయాలి. అవసరమైతే పోలీసుల్ని వెంటబెట్టుకొని వెళ్లండి. చెరువుల రక్షణకు నడుంబిగించండి. చెరువులకు నీళ్లు ఇచ్చే క్యాచ్‌మెంట్‌ ఏరియాలు, కాలువలు, నాలాలు, కల్వర్టుల రక్షణకు చర్యలు చేపట్టాలి. వాటిపై ఆక్రమణల్ని చట్ట ప్రకారం తొలగించండి’ అని రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Hyderabad Floods

అన్ని దిశలకూ వరద..
హైదరాబాద్‌ డెక్కన్‌ రీజియన్‌లో ఉంది. ఇక్కడ వాటర్‌ ఒకే డైరెక్షన్‌లో రాదు. అన్ని డైరెక్షన్స్‌లో ఫ్లో అవుతుంది. అందువల్లే 1908 లో మూసీ ఫ్లడ్స్‌ వచ్చాయి. హైదరాబాద్‌ లో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 80 వేల మంది రోడ్డున పడ్డారు. అప్పుడు వరదలు వచ్చినా తట్టుకునేలా ఓ మంచి డ్రైనేజీ సిస్టంతో కూడిన ప్లాన్‌ గీయమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అడిగారు. ఆయన గీసిన ప్లాన్‌ ప్రకారం రెండు రిజర్వాయర్లను కట్టించారు. అవి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ రిజర్వాయర్లు. 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ మళ్లీ మునిగింది. కాకపోతే ఒకప్పుడంత కాదు. ప్రాణనష్టం తగ్గింది. కానీ 2020లో ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో ఈ మహానగరం వరదలు వస్తే ఎందుకు మునిగిపోయిందంటే చెరులు ఆక్రమణలే కారణం.

హుస్సేన్‌సాగర్‌ పక్కనే ఉన్నా.. సెక్రటేరియేట్‌కు వరద..
ఇక ఇటీవల ప్రారంభించిన నూతన సెక్రటేరియేట్‌ కూడా నాలుగు రోజుల వర్షానికి స్విమ్మింగ్‌ పూల్‌ను తలపిస్తోంది. సుమారు రూ.900 కోట్లతో నిర్మించిన కొత్త సచివాలయానికి పటిష్టమైన డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో భారీ వర్షాలకు నీరంతా నిలిచిపోతోంది. పక్కనే హుస్సేన్‌సాగర్‌ ఉన్నా… డ్రెయినేజీ నిర్మాణం లేని కారణంగానే వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదని తెలుస్తోంది. బవనంపైన కూడా భారీగా నీరు నిలిచి ఉంటుంది. భవనం అడుగున వాన నీటిని ఒడిసిపట్టేలా రిజర్వాయర్లు నిర్మించామని అధికారులు తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. భారీ వర్షాలు కురిస్తే అవి ఏ మూలకు సరిపోవని తేలిపోయింది. నిర్మాణంలో వైఫల్యాలు. అంచనాల్లో తప్పిదాలు వర్షాలకు బయటపడుతున్నాయి. సెక్రటేరియేట్‌ నుంచి సాగర్‌లోకి డ్రెయినేజీ నిర్మించి ఉంటే వర్షం నీరంతా వెళ్లిపోయేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.