Huzurabad By Election 2021: అవి రెండు చిన్న టౌన్లు. కానీ అక్కడి రోడ్లు ఎప్పుడూ చూడని బెంజ్ కార్లను చూసాయి. అక్కడి ప్రజల అనుభవంలోకొచ్చిన ప్రచార పదనిసలెన్నో. గత రెండు నెలలుగా ఊరుమీద ఊరు పడ్డట్టు ఎక్కడెక్కడి నాయకులో వచ్చి అక్కడ తిష్టవేశారు. రోజూ కలుస్తూ తమకే ఓటేయాలని విజ్ఞప్తులు చేశారు. నాయకులొచ్చినప్పుడే వారితో మాట్లాడిన అక్కడి ప్రజలు తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. వారికి తెలుసు ఎవరికి ఓటేయాలో.. వారు ముందే ఫిక్స్ అయ్యారట. ఎవరెన్ని చెప్పినా వారి మనుస్సులో ఓటేప్పుడో పడిపోయింది. తాజాగా కొందరు జర్నలిస్టు చేసిన సర్వేలోనూ ఇదే రుజువైంది.

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ ఎన్నిక, అటు తర్వాత ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. కేసీఆర్‌ను ఎదురించి మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ఒకవైపు, ఉద్యమ నాయకునిగా పేరున్న గెల్లు శ్రీనివాస్ మరోవైపు హౌరాహౌరీగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ పక్షాన చివరి అంకంలో పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించక ముందే మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, హరీశ్‌రావులు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ప్రకటన అనంతరం హరీశ్ ఈ ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం భుజస్కంధాలపై మోసుకుంటూ వచ్చారు.
అవినీతి చేసి టీఆర్‌ఎస్‌ను వెళ్లిపోయారు ఈటల.. అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. అంతేకాక రాష్ట్రంలోనే హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి 11 మంది లబ్దిదారులతో దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. కొందరు లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మరికొందరికి యూనిట్లు మంజూరు చేశారు. ఈ పథకంతో దళితుల్లో తమ క్రేజ్ పెరుగుతుందని భావించారు. సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ సైతం ఓట్ల కోసమే ఈ పథకాన్ని పెట్టామని ఓ సమావేశంలో చెప్పినట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇటువైపు ఈటల మాత్రం తను నమ్ముకున్న ధర్మమే గెలిపిస్తుందని, తానెంతో అభివృద్ధి చేశానని, తనను కావాలనే పార్టీలోంచి వెళ్లగొట్టారని ప్రచారం చేశారు.

కొన్ని ప్రయివేటు సంస్థల సర్వేలన్నీ హుజూరాబాద్‌లో ఈటలకే మొగ్గు చూపాయి. పోలింగ్ తేదీ 30 దగ్గరవుతున్నకొద్దీ ఎవరు గెలుస్తారా? అన్న టెన్షన్ ఎక్కువైపోయింది. అందరిలోను అనేక రూపాల్లో టెన్షన్ పెంచేస్తున్న ఉప ఎన్నికలో అంతిమ విజయం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దే అనే సర్వే ఒకటి వెలుగుచూసింది. కొందరు జర్నలిస్టులు నియోజకవర్గంలో బాగా తిరిగి ఓ సర్వే నిర్వహించారట. ఆ సర్వే నివేదిక ప్రకారం తమ ట్రంప్ కార్డుగా అనుకుంటున్న దళిత బంధు పథకమే చివరకు టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ ను గట్టి దెబ్బ తీస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఉపఎన్నికలో గెలవటం కోసమే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
నిజానికి ఈటల రాజేందర్ పట్ల నియోజకవర్గంలో సానుభూతి పెరిగిందని చర్చ నడుస్తోంది. ఎవరెన్ని చెప్పినా ఇక్కడి ఓటర్లు ముందే ఈటలకు మదిలో ఓటేసి పెట్టుకున్నారట. మరోవైపు ఏ ఎన్నికకు ఉపయోగించని మందీమార్బలాన్ని టీఆర్‌ఎస్ ఈ ఎన్నికకు వినియోగిస్తోంది. అయితే ఈటల రాజేందర్ స్థానికంగా అందరికీ తలలో నాలిక లాంటి వాడని, వ్యక్తిగతంగా ఈటలకు ఆ పలుకుబడి ఉందని రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఒక్క వ్యక్తిపైన అంతమంది వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారని, ఎలాగైనా ఈటలనే గెలిపించాలని భరోసాతో ప్రజలున్నట్టు తెలుస్తోంది. పార్టీలోంచి అక్రమంగా ఈటలను వెళ్లాగొట్టారనే సానుభూతి ఉండటం వల్ల ఈటల వర్సెస్ కేసీఆర్ అన్న కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే దళితులకు ఇస్తానన్న రూ.10 లక్షలు క్షేత్రస్థాయిలో చేరకపోవడం, హామీ ఇచ్చిన అభివృద్ధి పనులన్నింటికీ కేవలం ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకోవడం, గెలిచాక పనులు చేస్తామని చెప్పటం.. వెరసి ఈటల వైపే ప్రజలున్నట్టు తెలుస్తోంది. అయితే దుబ్బాకలోలాగా చివరి ఓటు తేలే తేలే వరకూ ప్రజల అభీష్టం ఎట్లుందో తెలియని పరిస్థితి ఉంటుంది. చివరికి ఎవరు గెలుస్తారో ఈ నవంబర్ 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే..
Also Read: Drugs Fight: చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్.. కలిసి సాగడం ఖాయమా?