Telangana Congress : అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. అధికారం ఈసారి ఖాయం చేసుకోవాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఈ సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ గెలిచే సీట్లు ఎన్ని.. ఏం చేయాలి.. అసలు అధికారంలోకి వస్తుందా అనే అంశాలపైన పార్టీ నాయకత్వానికి కీలక సర్వే అందింది.
ఇదీ పరిస్థితి..
కర్ణాటక తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపైన రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకమాండ్ కు కీలక నివేదిక సమర్పించారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితుల పైన అంచనాలను వివరించారు. ఈ నివేదిక ఆధారంగా తాజాగా హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ.వేణుగోపాల్ కీలక సూచనలు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష చేశారు. సునీల్ కనుగోలు ఇచ్చి నివేదిక ఆధారంగా మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చేయాల్సిన మార్పులు.. అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు.
41 స్థానాల్లో విజయావకాశం..
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని సునీల్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని సూచించారు. 36 స్థానాల్లో మాత్రం గెలుపు అంత సులభం కాదని తేల్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని సునీల్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా ఎన్నికల ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు.
ఆ 36 నియోజకవర్గాల్లో..
పరిస్థితి బాగోలేదని చెప్పిన 36 నియోజకవర్గాల్లో ఏం చేయాలి.. ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలనే దాని పైన నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఢీ కొట్టేలా ఆకర్షణీయ మేనిఫెస్టోతో అన్నివర్గాలను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం పలు రకాలుగా అభ్యర్ధుల ఎంపిక మొదలు.. అన్ని స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేస్తోంది.
వరాలతో కేసీఆర్ షాక్..
ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ వరుసగా ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్ పైన శాసనసభలో ప్రకటనకు సిద్ధమయ్యారు. పంట రుణాలు మాఫీ ప్రక్రియ ప్రారంభించారు. తన పాలనలో తెలంగాణ సాధించిన పురోగతి.. దక్కిన ఖ్యాతిని అసెంబ్లీ వేదికగా వివరించేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ వంద సీట్లకు పైగా గెలుస్తామని బీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. ఇక బీజేపీ అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. దీనిని అనుకూలంగా మలచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.