https://oktelugu.com/

Revanth Reddy : పాలనలో ప్రత్యేకత.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం.. ఇదీ 30 రోజుల రేవంత్‌ పాలన!

ఇలా నెల రోజుల్లోనే పాలనలో గుణాత్మక మార్పును చూపించారు రేవంత్‌రెడ్డి. ఏకపక్షంగా కాకుండా సమష్టిగా చేసే నిర్ణయాలు కాంగ్రెస్‌ సర్కార్‌ మంచి చేస్తుంది అనే భావనను ప్రజల్లో కల్పిస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2024 / 06:47 PM IST
    Follow us on

    Revanth Reddy : తెలంగాణలో పదేళ్ల కుటుంబ పాలనకు ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో చరమ గీతం పాడారు. ప్రజాపాలనను కాంక్షిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పార్టీని నడిపించిన రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరో 11 మందిని మంత్రులుగా కేబినెట్‌లోకి తీసుకున్నారు.

    ప్రజల మధ్య ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. అదేరోజు గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి ప్రజాపాలన ప్రారంభించబోతున్నట్లు ప్రగతి భవన్‌ ముందు ఉన్న కంచెను తొలగించడం ద్వారా ఒక సంకేతం ఇచ్చారు. ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా మార్చారు. తర్వాత రెండు రోజులకే ప్రజాభవన్‌లో ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. ఆ భవనం వైపు కన్నెత్తి కూడా చూడలేని ప్రజలను నేరుగా ఆహ్వానించారు. ఇలా ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు రేవంత్‌రెడ్డి.

    సమష్టిగా పనిచేస్తూ..
    ఇక నెల రోజుల పాలన విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. డిసెంబర్‌ 7న ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్‌రెడ్డి 9వ తేదీ నుంచే ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు. ఇందుకోసం కేబినెట్‌ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుని అమలు చేశారు.

    ప్రగతిభవన్ ను డిప్యూటీ సీఎం భట్టికి కేటాయింపు

    అసెంబ్లీలో ఐక్యంగా..
    ఇక ప్రభుత్వం కొలువు దీరిన 5 రోజులకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. స్పీకర్‌ ఎన్నిక, ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారంతోపాటు పలు అంశాలపై ఎజెండా రూపొందించి సమావేశాలను కొనసాగించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా తమదైన శైలిలో ఐక్యతను ప్రదర్శించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఎలా అప్పుల ఊబిలోకి నెట్టిందో వివరించారు. ఎంత అప్పులు ఉన్నాయి. ప్రజలపై అప్పు ఎంత ఉంది అనేవి వివరించారు. విద్యుత్‌ సంస్థలను ఎలా నష్టాల్లోకి నెట్టారో తెలియజేశారు. ఎంత అప్పు చేశారు.? ఎంత బకాయి ఉన్నారో సభలో ప్రజలకు వివరించారు. దాదాపు 7 రోజులు జరిగిన సమావేశాల్లో ప్రశాంతంగా పైచేయి సాధించారు.

    – ఉప ముఖ్యమంత్రితో ప్రధాని వద్దకు..
    ఇక రేవంత్‌రెడ్డి పాలనలో మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్తే.. వెంట అధికారులను మాత్రమే తీసుకెళ్లేవారు. కానీ, రేవంత్‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు.

    -ఉత్తమ్‌ కుమార్‌తో కలిసి ఢిల్లీకి..
    మొదట ఉప ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన రేవంత్‌రెడ్డి.. తర్వాత ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితోపాటు, అధికారులను తీసుకెళ్లారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీటిపారుదల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదాతోపాటు రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, సైనిక్‌ స్కూల్, ఐపీఎల్‌ల కేటాయింపు గురించి చర్చించారు.

    సమష్టిగా నిర్ణయాలు..
    ఇక రాష్ట్ర అభివృద్ధి, ప్రజాపాలన, హామీల అమలు విషయంలో రేవంత్‌రెడ్డి ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించడం లేదు. ఒంటెద్దు పోకడ పోవడం లేదు. ప్రతీ విషయాన్ని మంత్రివర్గంతో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని తర్వాత మంత్రులతో సంతకాలు పెట్టించేవారు. రేవంత్‌ ఇందుకు భిన్నంగా మంత్రులతో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఐదు గ్యారెంటీల అమలుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. మేడిగడ్డ పరిస్థితిపై అధ్యయనం, దాని భవితవ్వం తేల్చేందుకు కూడా మంత్రులను పంపించి, అక్కడే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇప్పించారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

    హంగు ఆర్భాటాలు లేకుండా..
    ఇక పాలనలో రేవంత్‌రెడ్డి ఎక్కడా హంగులు, ఆర్భాటాలకు పోవడం లేదు. గతంలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. సొంత వాహనాలనే వాడుతున్నారు. కానీ కేసీఆర్‌ అధికారంలోకి రాకముందే మళ్లీ అధికారంలోకి వస్తామని బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతో కాన్వాయ్‌ సిద్ధం చేయించుకున్నారు. ఇక రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌లో ఉండకుండా.. ప్రజాభవన్‌గా మార్చి దానిని ఉప ముఖ్యమంత్రి దళితుడైన భట్టి విక్రమార్కకు కేటాయించారు. గిరిజనురాలు అయిన మంత్రి సీతక్కకు ఒక భవనం ఇచ్చారు. ప్రగతి భవన్‌లో ఐదు భవనాలు ఉన్నాయి.. అందులో భట్టికి ఒకటి, సీతక్కకు ఒకటి కేటాయించారు. మిగతా భవనాలు ప్రజాపరిపాలన కోసం దరఖాస్తులు, సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులకు కేటాయించారు.

    నాడు ఏం చేసినా పాలాభిషేకాలు..
    గత సీఎం కేసీఆర్‌ ఏ కొత్త విషయం చెప్పినా.. మరుసటి రోజు ఫొటోలకు పాలాభిషేకం చేయించుకునేవారు. నేడు అలాంటి పరిస్థిత లేదు. ప్రజా సమస్యల పరిష్కారం, ఆరు గ్యారెంటీల అమలే ప్రధాన అంశాలుగా రేవంత్‌ సర్కార్‌ పాలన సాగిస్తోందని నెల రోజుల తీరును బట్టి అర్థమవుతోంది. ఇక మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోపాటు, అందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

    అధికారుల విషయంలోనూ..
    ఇక అధికారుల ఎంపిక విషయంలోనూ రేవంత్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సమర్థులను, పైరవీలు లేనివారిని, నిజాయతీ పరులను ఎంచుకుంటున్నారు. గత సీఎం అగ్రవర్ణాలకు మాత్రమే సీఎంవోలో చోటు కల్పించేవారు. వెనుకబడిన వర్గాలు సమర్థులైనా అవకాశం దక్కేది కాదు. కానీ ప్రస్తుతం కులం, మతంతో సంబంధం లేకుండా, సమర్ధతకు పెద్దపీట వేస్తున్నారు.

    గొడవలకు పోకుండా..
    కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షంతో గొడవలకు పోవడం లేదు. గతంలో రేవంత్‌ సీఎం అయితే బీఆర్‌ఎస్‌పై కక్ష సాధిస్తారని అంతా భావించారు. కానీ, సీఎం అయ్యాక ఆయన మాటతీరుతోపాటు వ్యవహార శైలి కూడా మారింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే భేషజాలకు పోకుండా స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఫాంహౌస్‌లో కేసీఆర్‌ జారిపడినప్పుడు గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేసి ఆస్పత్రికి వేగంగా తరలించే ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రిజ్వీని ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించేలా నియమించారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను కూడా రేవంత్‌ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు, ప్రజలు చేసే మంచి సూచనలు స్వీకరిస్తామని పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీ బయట మాత్రమే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారు.

    ఇ -ఫార్ములా రేసు రద్దుపై విమర్శలు..
    ఇక ఇటీవల ఇ-ఫార్ములా రేసింగ్‌ను రేవంత్‌ సర్కార్‌ రద్దు చేసింది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు. ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోందని ఆరోపించారు. కానీ, దీనిని కాంగ్రెస్‌ సర్కార్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందకు కేటీఆర్‌ ఫార్ములా రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారని తెలిపారు. దీనికోసం రూ.110 కోట్లు వృథా చేశారని తెలిపారు. ఫార్ములా రేసింగ్ కు నిధులు కేటాయించడం కన్నా.. ప్రజల సమస్యల పరిష్కారానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

    4వ తేదీలోపు వేతనాలు..
    ఇక ప్రతిపక్షంలో ఉండగా అధికార బీఆర్‌ఎస్‌ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి విమర్శలు రాకూడదని భావించారు. డిసెంబర్‌ నెల వేతనాలను జనవరి 4వ తేదీనే చెల్లించారు. పింఛన్లు కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    ఇలా నెల రోజుల్లోనే పాలనలో గుణాత్మక మార్పును చూపించారు రేవంత్‌రెడ్డి. ఏకపక్షంగా కాకుండా సమష్టిగా చేసే నిర్ణయాలు కాంగ్రెస్‌ సర్కార్‌ మంచి చేస్తుంది అనే భావనను ప్రజల్లో కల్పిస్తోంది.