Babri Masjid : వందల ఏళ్ల కల నెరవేరింది. హిందువుల ఆరాధ్య దైవం రాముడికి అయోధ్యలో ఆలయం నిర్మితమైంది. ఇన్ని రోజులపాటు ఈ వివాదానికి కారణమైన బాబ్రీ మసీదు సంగతి ఏంటి? దానిని ఎక్కడైనా నిర్మిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తేవి. ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా సమాధానం లభించింది. 2019 సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్య మహానగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో మసీదు నిర్మాణానికి ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ డెవలప్మెంట్ కమిటీ రంగం సిద్ధం చేస్తోంది. రంజాన్ నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని ఫౌండేషన్ డెవలప్మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న హాజీ అరఫత్ షేక్ చెప్తున్నారు. కేవలం 3 నుంచి 4 నెలల లోనే మసీదు పూర్తి చేస్తామని ఆయన అంటున్నారు. రీ డిజైన్ కారణంగానే మసీదు నిర్మాణంలో జాప్యం జరిగిందని.. లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేదని ఆయన అంటున్నారు. అయితే మసీదు ప్రాజెక్టు సముదాయంలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక కూడా చేర్చామని ఆయన వివరిస్తున్నారు.
ఇక అయోధ్యలో నిర్మించే మసీదుకు సంబంధించి నిధుల కొరత ఉందని తెలుస్తోంది. అయితే ఈ మసీదు నిర్మాణానికి సంబంధించి నిధుల కోసం తాము ఎవరిని కూడా సంప్రదించలేదని.. నిధుల సేకరణకు ఎలాంటి ఉద్యమం చేపట్టలేదని ఐఐసీఎఫ్ ప్రెసిడెంట్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ చెబుతున్నారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ పేరుతో ఉన్న బాబ్రీ మసీదు వివాదాస్పద నిర్మాణంగా అప్పట్లో పేరు పొందిన నేపథ్యంలో.. కొత్తగా నిర్మించే మసీదుకు ఆ పేరు తొలగించనున్నారు. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదుగా దీనికి పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మసీదు నిర్మాణంలో బిజెపి నాయకుడు షేక్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిధుల కొరత ఉన్న నేపథ్యంలో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభిస్తామని.. దీనికోసం ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అంటున్నారు. ప్రజల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టడమే తమ ధ్యేయమని షేక్ అంటున్నారు. ద్వేషాన్ని ప్రేమగా మారుస్తామని.. కచ్చితంగా హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు కృషి చేస్తామని ఆయన చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించినా.. అంగీకరించకపోయినా పిల్లలు, ప్రజలకు మంచి విషయాలు బోధించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విజ్ఞానం వైపు కొత్త తరం అడుగులు వేస్తే పోరాటాలు మొత్తం ఆగిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన అనంతరం అలర్లు చెలరేగాయి. హింసాకాండ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అప్పట్లో 2000 మంది దాకా మరణించారని సమాచారం. ఇక సుప్రీంకోర్టు 2019లో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అయోధ్యలో బాబ్రీ మసీదును తొలగించిన ప్రాంతంలో రామాలయం నిర్మించారు. ఇందులో బాల రాముడిని ప్రతిష్టించారు. ప్రస్తుతం ఆ కోవెలలో కొలువై ఉన్న రాముడిని లక్షల మంది దర్శించుకుంటున్నారు.