Year Ender 2022 Crime: ఈ భూమ్మీద మనిషికి మాత్రమే వివేచన, విచక్షణ ఉన్నాయి.. అందుకే ప్రపంచ జీవరాశి మీద అతని పెత్తనం కొనసాగుతోంది. కానీ రాను రాను ఈ వివేచన, విచక్షణ అనేది కోల్పోయి మృగాల కంటే దారుణంగా తయారవుతున్నాడు. తన జాతి వాళ్ళనే నిర్దాక్షిణ్యంగా చంపుకుంటున్నాడు. మృగాలే అతని కంటే నయం అన్పించేలా చేస్తున్నాడు.. క్యాలెండర్ పేజీల సాక్షిగా మరికొద్ది రోజుల్లో 2022 కాలగర్భంలో కలిసిపోతున్నది.. గతాన్ని నెమరు వేసుకుంటూ వర్తమానంలోకి ప్రయాణించాలి కాబట్టి… 2023 లోకి అడుగుపెట్టే సందర్భంలో 2022ను ఒక్కసారి మననం చేసుకుంటే ఎన్నో నేరాలు.. మరెన్నో ఘెరాలు జరిగాయి. విస్తు పోయే వాస్తవాలు కళ్ళకు కట్టాయి.

– 2022లో జూబ్లీహిల్స్ పబ్ లో మైనర్ పై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేయడం ఆందోళన కలిగించింది. పైగా ఈ దారుణానికి ఒడిగట్టిన వారంతా మైనర్లు కావడం విశేషం.. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయితే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆధారాలు బయటపెట్టేంతవరకు ఈ కేసులో పోలీసులు ముందడుగు వేయకపోవడం గమనార్హం.. పైగా నిందితులకు ప్రత్యేకంగా బిర్యానీ ప్యాకెట్లు తేవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

– ఆమె వయసు నాలుగు పదులు పైబడింది.. ఆమె భర్త ఒక దినసరి కూలి. ఈమె కూడా అదే పని చేస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి.. మనవాళ్లు, మనవరాళ్ళతో హాయిగా కాలం గడపాల్సిన ఆమె దారి తప్పింది. కూలి పనులకు వెళ్తున్న క్రమంలో ఒక ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. అతడు నిలదీసే సరికి అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన ప్రియుడిని ఇందుకు ఉసిగొలిగింది. అతడు ఒక ఆర్ఎంపీ సహాయంతో… మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ లో జరిగింది. ఇప్పుడు నిందితులు మొత్తం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
_ ఆగస్టు 15.. తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుంటే.. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో మాత్రం నెత్తురు పారింది.. టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను… ఆయన ప్రత్యర్థి వర్గం వారు గొడ్డళ్ళ తో అత్యంత కిరాతకంగా హతమార్చి చంపారు. ఈ కేసులో తమ్మినేని వీరభద్రం సోదరుడు, ఇతరులు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకి వచ్చారు.
_ఆదిభట్ల వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.. హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల మన్నెగూడ లో ఆమె ఇంటిపై 100 మందికి పైగా దాడి చేసి ఆ యువతిని ఎత్తుకెళ్లారు.. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నిందితుడు నవీన్ రెడ్డి మిస్టర్ టి షాప్ ఓనర్. అతడు వైశాలి తో కలిసి బ్యాడ్మింటన్ వాడటం వల్ల ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా తాను ఈ నిర్ణయం తీసుకోలేనని వైశాలి తేల్చి చెప్పింది.. దీంతో నవీన్ రెడ్డి యువతి ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడగా, దానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న నవీన్ రెడ్డి గతంలో ఆ యువతితో చనువుగా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఎంతో వైశాలి నవీన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మనసులో పెట్టుకున్న నవీన్ రెడ్డి వైశాలికి పెళ్లి చూపులు చూస్తున్నారు అని తెలుసుకొని వంద మందితో ఆమె ఇంటి పై దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిని ఇష్టానుసారంగా కొట్టాడు. వైశాలిని బలవంతంగా తీసుకెళ్లాడు.. ఈ కేసులో నవీన్ రెడ్డి జైల్లో ఉన్నాడు.

_భద్రాద్రి జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తి కోయలు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. తన బీట్ పరిధిలో నాటిన హరితహారం మొక్కలను పశువులతో మేపుతుండగా.. గొత్తి కోయలను అతడు వారించాడు. దీంతో వారు అతనిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస రావు హత్య నేపథ్యంలో తాము పోడు సర్వే చేయబోమని అటవీ శాఖ సిబ్బంది తేల్చి చెప్పారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
_సిరిసిల్లలో ఓ యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. అయితే తీరా చూస్తే ఆమె అతని ప్రియుడిని ఇందుకు ఉసిగొలిపింది. తన ప్రేమను పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతోనే ఈ కిడ్నాప్ నాటకానికి తెర లేపినట్టు సదరు యువతి చెప్పడం గమనార్హం.. అయితే ఈ విషయంలో తల్లిదండ్రుల మీదనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
_ హైదరాబాదులో పరువు హత్య కలకలం రేపింది. వేరే మతానికి చెందిన నాగరాజు అన్న యువకుడిని పెళ్లి చేసుకున్న అశ్రీన్ అనే యువతి బంధువులు అతడిని దారుణంగా చంపేశారు.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి కి చెందిన బిల్లాపురం నాగరాజు, కోతిరెడ్డి పల్లెకు చెందిన ఆశ్రిన్ సుల్తానా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే ఆశ్రిన్ తరఫున బంధువుల నుంచి వీరికి ప్రాణహాని ఉండడంతో పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్లిపోయారు.. రెండు నెలల తర్వాత హైదరాబాద్ వచ్చి రహస్యంగా జీవిస్తున్నారు. వీరు వచ్చారని తెలుసుకున్న ఆశ్రీన్ బంధువులు ఇంటికి బైక్ పై వెళ్తున్న అశ్రీన్, నాగరాజు పై దాడి చేశారు.. ఆమె కళ్ళ ముందే నాగరాజును కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. నిందితుడి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.

_మంచిర్యాల జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.. మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో వాసు శివయ్య కుటుంబానికి దుండగులు నిప్పు పెట్టారు.. మాసు శివయ్య, అతడి భార్య పద్మ, ఆమె అక్క కూతురు మౌనిక, ఇద్దరు పిల్లలు, శాంతయ్య అనే వ్యక్తి చనిపోయారు. వివాహేతర సంబంధం వల్లే శాంతయ్య భార్య పిల్లలే ప్లాన్ చేసి ఈ హత్యలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు. శివయ్య భార్యతో శాంతయ్యకు వివాహేతర సంబంధం ఉంది.. ఈ నేపథ్యంలో అతడు భార్య పిల్లల్ని దూరంగా పెడుతున్నాడు.. దీంతో శాంతయ్య భార్య సృజన వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడిని ఉసిగొలిపి ఈ హత్యలు చేయించింది.. రాఖీ సినిమాలో మాదిరి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాలని ప్లాన్ చేసి ఈ సజీవ దహనానికి పాల్పడ్డారు.
_ములుగు జిల్లాలో ఇన్నోవా కారు లో వెళ్తున్న న్యాయవాది కారును అడ్డగించి దారుణంగా గొడ్డళ్లు, కత్తులతో దుండగులు దాడి చేసి హత్య చేశారు.. గతంలో మంథని లాయర్లను చంపినట్టే… ఇతన్ని కూడా చంపడం కలకలం సృష్టించింది. అడ్వకేట్ మల్లారెడ్డి ములుగు నుంచి మల్లంపల్లి వైపు వెళ్తున్న క్రమంలో పందికుంట స్టేజి వద్ద దుండగులు మాటు వేసి సరిగా స్పాట్ వద్దకు రాగానే ఇన్నోవా కారును మరో కారుతో అడ్డగించి డ్రైవర్ పై దాడి చేశారు. ఆ తర్వాత కారు నుంచి మల్లారెడ్డిని బయటకు లాగి విచక్షణ రహితంగా కత్తులు, గొడ్డలితో నరికి చంపారు.
_ తన అక్కను కాదని వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో యువకుడు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు. దీనికి స్థానికంగా ఉండే గంజాయి గ్యాంగ్ బ్యాచ్ సహాయం తీసుకున్నాడు. కాళ్లు చేతులను కత్తులతో కోశాడు.. అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మొదట్లో ఈ కేసు డబ్బు సంబంధిత వ్యవహారాల వల్ల జరిగింది అనుకున్నారు.. కానీ పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూసాయి.. మృతుడు నిందితుడి అక్కతో ప్రేమయాణం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. తర్వాత వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఖమ్మంలో కాపురం పెట్టాడు.. ఇది జీర్ణించుకోలేని ఆ యువతి సోదరుడు… సదరు వ్యక్తిని గ్రామంలోని పంచాయతీ కార్యాలయానికి పిలిపించి హత్య చేయించాడు. ప్రస్తుతం నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇవే కాదు 2022లో ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయి.. అయితే హత్యల విషయంలో వివాహేతర సంబంధాల తాలూకువే ఎక్కువ ఉన్నాయి. తర్వాత భూదందాలు, డబ్బు సంబంధిత వ్యవహారాలు, డ్రగ్స్ వంటి కేసుల్లో ఎక్కువగా హత్యలు నమోదయ్యాయి. చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని నిందితులు ఇష్టానుసారంగా నేరాలకు పాల్పడుతున్నారు.. వెంటనే జైలు నుంచి బయటకు వస్తుండడంతో వారికి ఒక రకమైన భరోసా ఏర్పడుతోంది..