https://oktelugu.com/

Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవితకు హైబీపీ.. ఏం జరుగనుంది?

ఇవన్నీ కూడా కవిత తరఫు న్యాయవాది సమక్షంలో పరిశీలించిన తర్వాతనే ఆమెకు అందజేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని కవితకు ఒకసారి హై బీపీ రావడంతో భారత రాష్ట్ర సమితి కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

Written By: NARESH, Updated On : March 16, 2024 8:41 pm
K Kavitha

K Kavitha

Follow us on

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల కస్టడీలో ఉంది. సుమారు 7 రోజులపాటు అధికారులు ఆమెను విచారించనున్నారు. శుక్రవారం అరెస్టు చేసిన కవితను ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. షెడ్యూల్ కంటే ముందే ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శనివారం కోర్టు కేసును విచారించింది. “సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఉల్లంఘించారు. క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగానే ఆమెను అరెస్టు చేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని” కవిత తరఫున విక్రమ్ చౌదరి అనే న్యాయవాది వాదించారు. దీనికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ తన వాదనలు వినిపించారు. “గత ఏడాది సెప్టెంబర్ 15న విచారణ సందర్భంగా 10 రోజులు మాత్రమే సమన్లు ఇవ్వబోమని ఎన్ ఫోర్స్ అధికారులు హామీ ఇచ్చారు. పది రోజులు అంటే నిరవధిక కాలం కాదు. వేరే వాళ్ళ కేసును కవిత తనకు అనువహించుకుంటున్నారని” జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కవితను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించింది.

కాగా, శుక్రవారం రాత్రి కవితను అరెస్టు చేసి ఢిల్లీలోని కోర్టు ముందు హాజరపరిచినప్పుడు.. వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆ సమయంలో ఆమెకు హై బీపీ ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి ప్రకటించారు. “గతంలో ఎన్నడు కవితకు హైబీపీ లేదు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిబంధనలు పాటించలేదు. అందువల్లే ఆమె ఒత్తిడికి గురయ్యారు. కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా ఆమెకు హై బీపీ వచ్చిందని” అనే తరఫున న్యాయవాది ప్రకటించారు. కాగా, శనివారం కవిత తరఫున విక్రమ్ చౌదరితో పాటు సోమా భరత్, రోహిత్ రావ్, మాజీ అడ్వకేట్ జనరల్ రామచందర్రావు వాదనలు వినిపించారు.

అంతకంటే ముందు కవితను 10 రోజులపాటు కస్టడీలోకి ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టును కోరారు. అయితే ఇది వర్గాల వాదనలు విన్న కోర్టు కవితను ఏడు రోజులపాటు కస్టడీకి ఇస్తున్నట్టు ప్రకటించింది. కస్టడీకి ముందు కవితకు హై బీపీ ఉన్నట్టు తేలడంతో ఆమె కోసం ప్రత్యేకంగా మందులు, ఇతర ఇంజక్షన్లు, దుస్తులు సమకూర్చినట్టు తెలిసింది. ఇవన్నీ కూడా కవిత తరఫు న్యాయవాది సమక్షంలో పరిశీలించిన తర్వాతనే ఆమెకు అందజేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని కవితకు ఒకసారి హై బీపీ రావడంతో భారత రాష్ట్ర సమితి కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.