Hindu temples: పురాణాల నుంచి మన దేశం హిందూ దేశం.. మనదేశంలో ఉన్న గుడులు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ధర్మం విలసిల్లిన మనదేశంలో పెద్ద పెద్ద కోవెలలకు లోటు లేదు. తిరుపతి, అనంత పద్మనాభ స్వామి గుడి, మధురై మీనాక్షమ్మ గుడి, కంచి కామాక్షి దేవాలయం, కేదార్నాథ్, కామాఖ్య దేవి ఆలయం.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని జాబితా చాలా పెద్దగా ఉంటుంది. మనదంటే హిందూ దేశం కాబట్టి ఆలయాలు ఉంటాయి. కానీ మన పొరుగున ఉన్న దేశాల్లో కూడా అతిపెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇటీవల అబుదాబిలో స్వామి నారాయణ్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మన దేశానికి వెలుపల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పెద్ద హిందూ దేవాలయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అంగ్ కార్ వాట్ , కంబోడియా
కంబోడియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. దీన్ని సూర్య వర్మన్ అనే రాజు 12వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. శేషుడిపై పడుకున్నట్టుగా ఉండే విష్ణుమూర్తి ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ. ప్రపంచ వారసత్వ జాబితాలో, ప్రపంచ వింతల్లో ఇది 8వ స్థానంలో కొనసాగుతోంది.
పంబన్ ఆలయం, ఇండోనేషియా
ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా పంబన్ ఆలయం వినతి కెక్కింది. ఈ ఆలయంలో శివుడు, విష్ణు విగ్రహాలున్నాయి. ఈ ఆలయంలో బ్రహ్మ విగ్రహం పూజలు అందుకుంటుంది. రామాయణ కాలంలో రాముడు ఈ ప్రాంతంలో నడయాడాడని చారిత్రక ఐతిష్యం ఉంది. ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో శైలేంద్ర రాజవంశీయులు నిర్మించారు. అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు సంభవించడం.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఈ ఆలయం చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఈ ఆలయంలో 240 ఉపాలయాలు ఉన్నాయి.
అక్షర ధామ్, అమెరికా
అమెరికాలోని న్యూ జెర్సీ ప్రాంతంలోని రాబిన్స్ విల్ల్ సిటీలో ఈ ఆలయం ఉంది. దీనిని 185 ఎకరాల్లో నిర్మించారు. ఈ ఆలయం ఎత్తు 191 అడుగులు. దీనిని అక్టోబర్ 8 2023న ప్రారంభించారు. దీని నిర్మాణానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ దేశాల్లో లభ్యమయ్యే సున్నపురాయి, గులాబీ రంగు ఇసుకరాయి, మార్బుల్, గ్రానైట్ రాళ్లను వినియోగించారు. ఇవి విపరీతమైన చలిని, వేడి కాలనీ తట్టుకుంటాయి కాబట్టి నిర్మాణంలో ఉపయోగించారు.
పశుపతినాథ్ ఆలయం, నేపాల్
పేరులోనే పశుపతి అని ఉంది కాబట్టి.. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది శివుడి ఆలయం అని. దీన్ని ఎనిమిదవ శతాబ్దంలో జయదేవరాజు నిర్మించాడు. నేపాల్ రాజధాని ఖాట్మండు లో ఈ ఆలయం ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ గుడిలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆలయ నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇతర మతస్తులు మైదానం వరకే వెళ్లే అవకాశం ఉంటుంది.
శివ విష్ణు దేవాలయం, ఆస్ట్రేలియా
ఈ ఆలయంలో శివుడు, విష్ణు మూర్తుల ప్రతిమలు ఉంటాయి. ఇది ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుతారు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి వైకుంఠ ఏకాదశి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులు ఈ ఆలయానికి ఎక్కువగా వెళుతుంటారు.