AP Education System: ఏపీలో విద్యావ్యవస్థ గాడిలో పడిందా?

రాష్ట్రవ్యాప్తంగా 60 కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అత్యున్నత నాక్ గుర్తింపు లభించింది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ చాలా డిగ్రీ కళాశాలల్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేవు. అయితే దీనికి కూడా ప్రభుత్వమే కారణమని తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : January 21, 2024 10:52 am

AP Education System

Follow us on

AP Education System: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి జగన్ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. కానీ వాటిపై మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. శత శాతం ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఒకవైపు అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నగదు సాయం చేస్తున్నారు. మరోవైపు నాడు నేడు పథకంతో పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. పాఠశాలల విలీన ప్రక్రియ, ఉపాధ్యాయుల సర్దుబాటు వంటి విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 60 కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అత్యున్నత నాక్ గుర్తింపు లభించింది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ చాలా డిగ్రీ కళాశాలల్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేవు. అయితే దీనికి కూడా ప్రభుత్వమే కారణమని తెలుస్తోంది. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలతో పేద విద్యార్థుల కంటే ప్రైవేటు విద్యాసంస్థలకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. ఏడాదికి ఫీజుల రూపంలో ప్రైవేటు విద్యాసంస్థలకు 60 వేల కోట్ల రూపాయలు చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ నగదు ప్రభుత్వం నుంచి వెళ్తోంది. ఈ లెక్కన ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ప్రభుత్వ పథకాలతో బలోపేతం అవుతున్నాయి. వాటి ప్రభావం కూడా ప్రభుత్వ విద్యపై పడుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి కేటాయింపులు వాస్తవం. కానీ అవి సరైన మార్గంలో ఖర్చు చేయడం లేదు. ప్రత్యేక ప్రణాళిక అంటూ లేదు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పథకాలు అమలు చేయడంతో ప్రజాధనం వృధా అవుతుందే తప్ప.. ప్రభుత్వ విద్య మాత్రం బలోపేతం కావడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేవు. చాలామంది ప్రైవేట్ విద్యపైనే మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సమీపంలోని స్కూళ్లలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం వంటి వాటితో ఎక్కువమంది ప్రభుత్వ విద్యపై ఆసక్తి చూపడం లేదు. జగన్ సర్కార్ కేటాయిస్తున్న మాట నిజమేనా విద్యా రంగం మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించడం లేదు.