https://oktelugu.com/

Guntur Kaaram vs Hanu Man : ఆ బుడ్డోడే మహేష్ ప్రత్యర్థి.. తెగుతున్న టికెట్లే సాక్షి

మొత్తానికి మహేష్ బాబు కొడుకుగా నటించిన తేజ.. హనుమాన్ సినిమా ద్వారా మహేష్ బాబు గుంటూరు కారాన్ని బీట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2024 / 11:17 PM IST
    Follow us on

    Guntur Kaaram vs Hanu Man : అప్పుడెప్పుడో 23 సంవత్సరాల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో యువరాజు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో మహేష్ బాబు కథానాయకుడు. సాక్షి శివానంద్, సిమ్రాన్ అతడికి జోడిగా నటించారు. ఆ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో అప్పటి బాల నటుడు తేజ సజ్జా నటించాడు. ఆ సినిమాలో మహేష్ బాబు తెలియక చేసిన తప్పు వల్ల సిమ్రాన్ గర్భవతి అవుతుంది. తేజ సజ్జా కు జన్మనిస్తుంది. అనేక మలుపుల తర్వాత తేజ తన కుమారుడు అని మహేష్ బాబుకు తెలుస్తుంది. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తేజ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో తనకు కుమారుడిగా నటించిన తేజ ఇప్పుడు ప్రత్యర్థి అవుతాడని మహేష్ బాబు కలలో కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా శుక్రవారం అతడి గుంటూరు కారం తో పాటు తేజ నటించిన హనుమాన్ సినిమా కూడా విడుదలైంది. వాస్తవానికి బజ్ కూడా గుంటూరు కారానికే ఉంది. శుక్రవారం బెనిఫిట్ షో తోనే గుంటూరు కారం భవిష్యత్తు ఏమిటో తేలిపోయింది.

    ప్రఖ్యాత ఆన్లైన్ టికెట్ యాప్ బుక్ మై షో లో గుంటూరు కారం చిత్రానికి అత్యంత పేలవమైన రేటింగును ప్రేక్షకులు ఇచ్చారు. మహేష్ బాబు చిత్రంలో అత్యంత దారుణంగా 6.9 రేటింగ్ ఇచ్చారు. వాస్తవానికి మహేష్ బాబు సినిమాలు స్పైడర్, బ్రహ్మోత్సవం, వన్ నేనొక్కడినే వంటి సినిమాలు కూడా 8 మించి రేటింగ్స్ నమోదు చేశాయి. కానీ గుంటూరు కారం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో ఆ రేటింగ్ కాస్త 6.9 గా నమోదయింది. అయితే గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఓపెనింగ్ రోజే ఇంత తక్కువ రేటింగ్ రావడం షాకింగ్ పరిణామం అని మహేష్ బాబు అభిమానులు చెబుతున్నారు.

    మరోవైపు మహేష్ బాబు చిత్రానికి పోటీగా తేజ నటించిన హనుమాన్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమైంది. ఈ సినిమాకు సంబంధించి సరైన థియేటర్లు లభించకపోయినప్పటికీ కథలో దమ్ము ఉండాలే గాని ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా నిరూపించింది. హిందూ మైథాలజీని, ప్రస్తుత పరిస్థితులను మేలవించి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లను నమోదు చేస్తోంది. బుక్ మై షో చెబుతున్న దాని ప్రకారం గత గంటలో గుంటూరు కారం సినిమాకు సంబంధించి 9,270 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇదే సందర్భంలో హనుమాన్ సినిమాకు సంబంధించి 11,680 టికెట్లు విక్రయించామని బుక్ మై షో నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 9.7 రేటింగ్ నమోదు చేసింది. బుక్ మై షో నిర్వహించిన రేటింగ్ లో హనుమాన్ సినిమాకు సంబంధించి 51,900 మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సినిమా బాగుందని కితాబిచ్చారు. ఇక గుంటూరు కారం సినిమాకు సంబంధించి 40,400 మంది ఓటింగ్లో పాల్గొంటే..6.9 రేటింగ్ ఇచ్చారు. ఇక శనివారం, ఆదివారం వరుసగా నా సామి రంగా, సైంధవ్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో గుంటూరు కారం సినిమా కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు కొడుకుగా నటించిన తేజ.. హనుమాన్ సినిమా ద్వారా మహేష్ బాబు గుంటూరు కారాన్ని బీట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ట్రేడ్ పండితులు అంటున్నారు.