Gunfight : ఈ ప్రపంచంలో భూమి కోసం కొట్లాట జరిగింది. ఆధి పత్యం కోసం కొట్లాట జరిగింది. అధికారం కోసం కొట్లాట జరిగింది. సంపద దోచుకునేందుకు కొట్లాట జరిగింది. చివరికి తినే తిండి, తాగే నీరు, ఉండే ఆవాసం.. ఇలా పలు రకాల వాటి కోసం పోట్లాటలు జరిగాయి. కాని చరిత్రలో తొలిసారిగా పశువులు మేసే గడ్డి కోసం మనుషులు కొట్టుకున్నారు. ప్రకృతి ధర్మం ప్రకారం.. పశువులు గడ్డి మేస్తాయి. మనుషులు అన్నం తింటారు. గడ్డిమేసే పశువులకు విచక్షణ అనేది ఉండదు. అన్నం తినే మనుషులకు జ్ఞానం, విచక్షణ, వివేకం ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ పశువుల (ఇక్కడ జంతువులు క్షమించాలి) కంటే హీనంగా మనుషులు ప్రవర్తించారు. పశువులు తినే గడ్డి మీద కొట్లాడుకున్నారు. చివరికి వారి వివేచన గడ్డి కరిచింది కాబోలు విచక్షణారహితంగా ప్రవర్తించారు. కాల్పులకు తెగబడి పరస్పరం చంపుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో దాతియా ప్రాంతంలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని దాతియా నియోజకవర్గంలో రెండా అనే గ్రామంలో రెండు రోజుల క్రితం పాల్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన సభ్యుల పొలంలోకి ఒక ఆవు ప్రవేశించింది. అందులో పెరిగిన దట్టమైన పచ్చి గడ్డిని అది మేసింది. దీంతో వారు దానిని తరిమికొట్టారు. వారు తరిమికొట్టే క్రమంలో ఆవు స్వల్పంగా గాయపడింది. ఈ ఆవు డాంగి అనే తెగలకు చెందిన వ్యక్తులది. పాల్ కుటుంబ సభ్యులు తమ ఆవును తరిమి కొట్టడాన్ని వారు చూశారు. దీంతో ఇది చినికి చినికి గాలి వాన లాగా మారింది. ఇరు వర్గాలు పరస్పరం వాదనలకు దిగాయి. ఇది సరైన పద్ధతి కాదని కొంతమంది చర్చలకు ఆహ్వానించడంతో..పాల్, డాంగి సామాజిక వర్గాలకు చెందిన వారు ఒకచోట భేటీ అయ్యారు. చర్చలు ప్రారంభించారు. అయితే ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.. ఈ కాల్పుల్లో ప్రకాష్ డాంగి, రామ్ నరేష్ డాంగి, సురేంద్ర డాంగి, రాజేంద్ర పాల్, రాఘవేంద్ర పాల్ తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ కాల్పులతో రెండా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడంతో జనం బయటికి రావడానికే జంకారు. కాల్పులు మోత తగ్గిన తర్వాత బయటికి వచ్చి చూడగా ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. రక్తపు మరకలు, గాయపడి ఆర్తనాదాలు చేస్తున్నవారు, తుపాకీ బుల్లెట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ సంఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది.
విషయం తెలుసుకున్న దాటియా ఎస్పీ ప్రదీప్ శర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారు.. ప్రత్యక్ష సాక్షులను వివరించారు. “పశువుల మేతకు సంబంధించి గ్రామంలో డాంగి, పాల్ సామాజిక వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు కూడా తుపాకులతో పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో కొంతమంది చనిపోయారు. కొందరు దూకుడుగా వ్యవహరించడం వల్లే ఈ వివాదం చెల రేగింది. అది ఐదుగురు మృతి చెందడానికి కారణమైంది. దీనిపై విచారణ నిర్వహిస్తాం. మృతి చెందిన వారిలో డాంగి సామాజిక వర్గానికి చెందినవారు ముగ్గురు, పాల్ సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు ఉన్నారు.” అని ఎస్పీ వివరించారు. మారుమూల గ్రామంలో రెండు తెగలకు చెందిన సామాజిక వర్గాలకు తుపాకులు ఎక్కడివి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.. అయితే వారు ఉపయోగించిన ఆయుధాలలో లైసెన్స్ లేనివి కూడా ఉన్నాయి. కొంతమంది నిందితులు పరారీలో ఉండగా.. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాయపడిన వారిలో జ్ఞాన్ సింగ్ పాల్ అనే వ్యక్తిని పోలీసులు విచారించారు..”పశువులను తరిమికొట్టడంపై డాంగి సామాజిక వర్గంతో మాకు వివాదం ఉంది. ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు మేము వచ్చాం. కానీ వారు మాపై కాల్పులు ప్రారంభించారు. ఒక తుపాకీ గుండు నా కాలు నుంచి దూసుకుపోయింది” అని అతడు వివరించాడు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో పలువురు అనుమానితులను ప్రశ్నించి వదిలి వేస్తున్నారు.