Groundhog Day 2024 : ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఉంటాయి. ఆచారాన్ని బట్టి వ్యవహారాలు ఉంటాయి. ఓకే దేశం, భిన్న సంస్కృతులు ఉండే భారత్ లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా పండుగలు జరుగుతుంటాయి. అన్ని పండుగలను తిథులు, నక్షత్రాలు, వాటి గమనాల ఆధారంగా జరుపుకుంటారు. ఉదాహరణకు జనవరి రెండవ వారంలో సంక్రాంతి, మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉగాది, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో దసరా, నవంబర్ నెలలో దీపావళి మనం జరుపుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో వారి సంస్కృతుల ఆధారంగా పండుగలు జరుపుకుంటారు. ఇక పాశ్చాత్య దేశాలలో పండుగలు జరుపుకునే విధానం వేరుగా ఉంటుంది. క్రిస్మస్ ప్రతి ఏడాది డిసెంబర్ 25న వస్తుంది. న్యూ ఇయర్ ఎలాగూ జనవరి ఒకటిన జరుపుకుంటారు. కానీ వారు కూడా మనలాగే కొన్ని నక్షత్రాలు, వాటి గమనాల ఆధారంగా పండుగలు జరుపుకుంటారు. అలాంటి పండుగే గ్రౌండ్ హాగ్ డే. మన ప్రాంతంలో తొలకరి చినుకులు మొదలైనప్పుడు రైతులు ఏరువాక సాగుతుంటారు. దీనికి ప్రత్యేకంగా ఒక తేదీ అంటూ ఉండదు. అలాగే పాశ్చాత్య దేశాలలో గ్రౌండ్ హాగ్ డే అనే వేడుక( అమెరికా దేశాలలో ఫిబ్రవరి 2న జరుగుతుంది) కూడా దాదాపు ఇలానే జరుగుతుంది. కాకపోతే ఇది ఒక జంతువు గమనంతో ముడిపడి ఉంటుంది.
ప్రతి ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అమెరికా, దాని చుట్టుపక్కల దేశాలు గ్రౌండ్ హాగ్ డే అనే ఒక సంప్రదాయాన్ని పాటిస్తాయి. దీనిని వేడుకలాగా జరుపుకుంటాయి. ఇది చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నదే. కొంతమంది దీనిని మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తుంటారు. ఇది అమెరికాలో పుట్టకపోయినప్పటికీ పెన్సిల్వేనియా, డచ్ ప్రాంతంలో ఇది తరతరాల ఒక నమ్మకం. క్రమంగా అమెరికాకు విస్తరించిందని చెబుతుంటారు. ఒక రోజున గ్రౌండ్ హాగ్ (ముళ్ళ పందిలాంటి జంతువు) తన బొరియ నుంచి బయటికి వస్తుంది. దాని నీడను చూసి.. ఆ తర్వాత వెంటనే తన బొరియలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది నీడను చూడకపోతే వసంతకాలం త్వరగా వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఒకవేళ నీడను చూస్తే శీతాకాలం మరో ఆరు వారాలపాటు కొనసాగుతుందని విశ్వసిస్తుంటారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత గ్రౌండ్ హాగ్ బయటికి వచ్చి, తన నీడను తాను చూసుకునే పద్ధతిని నమ్మడం మరింత పెరిగిపోయిందని ఇక్కడి ప్రజలు వ్యాఖ్యానిస్తుంటారు.
ఇక గ్రౌండ్ హాగ్ బొరియ నుంచి బయటికి వచ్చే విధానాన్ని బాడ్జర్(అంచనా వేసే వ్యక్తి) పర్యవేక్షిస్తుంటాడు. అలా ఆ జంతువు బొరియ నుంచి బయటికి వచ్చేటప్పుడు చాలామంది గుమిగూడుతారు. కొందరైతే క్యాండిల్స్ పట్టుకొని ప్రార్థన నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొందరు నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత గ్రౌండ్ హాగ్ బయటికి వస్తుంది. తనని తాను చూసుకుని తిరిగి వెళ్ళిపోతే శీతాకాలం మరో ఆరు వారాలపాటు కొనసాగుతుంది, తన నీడను తాను చూసుకుంటే వసంతకాలం త్వరగా వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ సంస్కృతిని 16 వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ సంస్కర్తలు వ్యతిరేకించారు. అయినప్పటికీ పాశ్చాత్య దేశాలలో ఈ సంస్కృతి కొనసాగుతోంది. ప్రస్తుత వాతావరణం ప్రకారం శుక్రవారం గ్రౌండ్ హగ్ డే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.