https://oktelugu.com/

Gemini AI: గూగుల్ కు “జెమిని” శిరోభారం.. మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం

చాట్ జిపిటిని ప్రవేశపెట్టిన తర్వాత గూగుల్ కూడా ఆ కేటగిరీలో జెమిని తీసుకొచ్చింది. మార్కెట్లోకి కొత్త టూల్ వచ్చినప్పుడు ఔత్సాహికులు దానిని పరీక్షించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 25, 2024 / 11:04 AM IST
    Follow us on

    Gemini AI: ఓపెన్ ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే చాట్ జిపిటిని ఏ ముహూర్తానయితే తెరపైకి తీసుకొచ్చిందో.. అప్పటినుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓపెన్ ఏఐ చాట్ జిపిటిని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా “బాట్” ను తెరపైకి తీసుకొచ్చింది. తర్వాత దీని పేరు జెమిని గా మార్చింది. అయితే ఈ జెమిని గూగుల్ కు శిరోభారంగా మారింది. ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ తీసుకొచ్చిన వివాదం వల్ల గూగుల్ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫాసిస్టా? కాదా? అని” ఓ నెటిజన్ జెమిని ని ప్రశ్నించాడు. దీంతో ఆ టూల్ వివాదాస్పద సమాధానమిచ్చింది. ఈ సమాధానంతో ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గూగుల్ జెమినీ టూల్ పై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో గూగుల్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో పనిచేసే తమ చాట్ బాట్ అన్ని సార్లూ నమ్మకమైన సమాధానం ఇవ్వకపోవచ్చని, దీనిని చక్కదిద్దుకుంటామని గూగుల్ ప్రకటించింది.

    చాట్ జిపిటిని ప్రవేశపెట్టిన తర్వాత గూగుల్ కూడా ఆ కేటగిరీలో జెమిని తీసుకొచ్చింది. మార్కెట్లోకి కొత్త టూల్ వచ్చినప్పుడు ఔత్సాహికులు దానిని పరీక్షించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.. అలాగే వారు గూగుల్ జెమినీ మీద కూడా ప్రయోగాలు చేశారు.. ఓ నెటిజన్ సరదాగా నరేంద్ర మోడీ ఫాసిస్టా? అని ప్రశ్నించాడు. దీనికి జెమినీ “నరేంద్ర మోడీ అవలంబించిన కొన్ని విధానాల వల్ల ఆయనను అలా అంటారని” వివాదాస్పద సమాధానమిచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి అడిగినప్పుడు “కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం” అని ఆ ఏఐ టూల్ సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఓ పాత్రికేయుడు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు. దీంతో అవి దెబ్బకు వైరల్ అయ్యాయి.. వాటిని చూసిన తర్వాత ” గూగుల్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.”ఇది ఐటీ చట్టం, క్రిమినల్ కోడ్ ఉల్లంఘన” అంటూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి మండిపడ్డారు..

    ఈ వివాదం నేపథ్యంలో గూగుల్ స్పందించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ వెంటనే చర్యలు చేపట్టామన్నారు. జెమిని అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుందని, ఇది సమకాలీన రాజకీయ అంశాలపై ప్రశ్నలు అడిగినప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ పొరపాటు నేపథ్యంలో భవిష్యత్తులో జెమిని మరింత కచ్చితత్వంతో పని చేసే విధంగా మార్పులు, చేర్పులు చేస్తామని గూగుల్ ప్రకటించింది. అయితే గూగుల్ ప్రకటన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇటువంటి సాకులు చెప్పి తప్పించుకోలేరని.. ఇండియాలో చట్టాలు గట్టిగా ఉన్నాయని స్పష్టం చేశారు. కచ్చితత్వం లేని అల్గారిథమ్ వల్ల యూజర్లకు విశ్వసనీయమైన సమాచారాన్ని ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో గూగుల్ సంస్థకు నోటీసులు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.